కాజీపేట: ద్విచక్ర వాహనంలో ఉన్న రూ.5 లక్షల నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుని వెళ్లినట్లు బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై ప్రమోద్‌కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. పద్మ అరవింద న్యాయవాది వద్ద పని చేస్తున్న పూలరాజు, గుండు శ్రీనివాస్‌లు ఆఫీసు పని మీద వడ్డెపల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్దకు మంగళవారం చేరుకోగా.. బ్యాంకులో సర్వర్ బిజీగా ఉందని వెనక్కి వచ్చారు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై ఇద్దరు ఇంటికి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత స్కూటీ డిక్కీలో చూడగా.. రూ.5లక్షల నగదు కనిపించకపోవడంతో కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా.. పోలీసులు విభిన్న కోణాల్లో విచారణ జరుపుతున్నారు. నగదుతో రాజు, శ్రీనివాసులు తిరిగిన ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. న్యాయవాది వద్ద పని చేసే సిబ్బందికి పత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.