అస్తవ్యస్తంగా క్రమబద్ధీకరణ వ్యవహారం
వరంగల్ అర్బన్:నగరంలో నల్లా కనెక్షన్ల క్రమబద్ధీకరణ వ్యవహారం అస్తవ్యస్తంగా మారింది. ఒక ఇంటికి రెండు, మూడు నల్లా కనెక్షన్లు ఉన్నట్లు ఫీజు విధించడంతో యజమానుల్లో గుబులు మొదలైంది. అక్రమ నల్లా కనెక్షన్లు, అమృత్ మిషన్ భగీరథ కొత్త నల్లాల క్రమబద్ధీకరణలో భాగంగా ఏఈలు, మెప్మా రిసోర్స్ పర్సన్(ఆర్‌పీ) ఇష్టారాజ్యంగా నల్లాలను గుర్తించి ‘ఆన్‌లైన్’లో నమోదు చేయడంతో సమస్య కొత్త మలుపు తిరిగింది. దీంతో ఇళ్ల యజమానులు ఇంటికి ఒకే నల్లా ఉంటే రెండు, మూడు నల్లాలు ఉన్నట్లు చార్జీలు విధించడం ఏమిటని అధికారులను నిలదీస్తున్నారు. దీనిపై బల్దియా గ్రీవెన్స్ సెల్‌లో పెద్ద మొత్తంలో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ఇంటికి ఉన్న ఒక్క నల్లా కనెక్షన్ నుంచి నీళ్లు ఫ్రెషర్‌తో రావడం లేదని, రెండు, మూడు ఎందుకు పెట్టారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. గతంలో ఉన్న నల్లాలు, నల్లాలు లేని ఇంటి నంబర్లు, అమృత్ అర్బన్ మిషన్ భగీరథ కింద ఏర్పాటు చేసిన నల్లాలను వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదు. క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించకుండా ఎడాపెడా కనెక్షన్లను ‘ఆన్‌లైన్’లో నమోదు చేయడంతో ఇలా రెండు, మూడు చొప్పున నల్లా కనెక్షన్లు నమోదయ్యాయి. దీనిపై ఇంజనీర్లను వివరణ కోరితే.. ఫిర్యాదు చేస్తే విచారణ చేసి తొలగిస్తామని పేర్కొన్నారు.
మడికొండకు చెందిన కృష్ణమూర్తి ఇంటి నం.30–8–18, నల్లా కనెక్షన్ నం.85379 ఉంది. 2018 నుంచి మరో నల్లా, 2022 నుంచి ఇంకో నల్లా మొత్తం ఒకే ఇంటికి మూడు నల్లాలు ఉన్నట్లుగా చార్జీ విధించారు.
కరీమాబాద్ అనంతలక్ష్మి 17–3–74 ఇంటికి నల్లా కనెక్షన్ ఉంది. అదనంగా మారో నల్లా, రెండు కనెక్షన్ల చార్జీ.. నెలకు రూ.300 చొప్పున ‘ఆన్‌లైన్’ చూపిస్తోంది.
ఇలా నగరంలో వేలాది ఇళ్లకు ఒక ఇంటికి, రెండు, మూడు చొప్పున నల్లా కనెక్షన్లు ఉన్నట్లు చార్జీలు విధించడంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు.