కాంట్రాక్టర్ నుంచి భారీగా లంచం డిమాండ్ ఫారెస్ట్ ఆఫీసర్ అవినీతిపై ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు రూ.1.25 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న వైనం
బాపట్ల టౌన్: కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ. లక్షల్లో నగదు డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారిని ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి గురువారం రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ వి.వి. వెంకటరమణ మాట్లాడుతూ బాపట్ల మండలం, సూర్యలంక రహదారిలో రూ. 2 కోట్ల నిధులతో నిర్మించిన నగరవనంలో ఇటీవల కాలంలో బిల్లులు మంజూరు సమయంలో రూ. లక్షలు చేతులు మారినట్లు సమాచారం. తాజాగా నగరవనంలో రూ. 5.90 లక్షలతో నిర్మించిన ఉడ్‌డెక్ (చెక్కతో తయారుచేసిన వేదిక) బిల్లులు మంజూరయ్యాయి. వనసంరక్షణ సమితి సభ్యులు నగరవనంలోని అభివృద్ది పనులను కర్రి వీర్లంకయ్య అలియాస్ బుజ్జి అనే వ్యక్తికి అప్పగించారు. గతంలో నిర్వహించిన పనుల బిల్లులు రూ. 1.40 కోట్ల నిధులు ఏడాది క్రితం మంజూరయ్యాయి. బిల్లులు నేరుగా సదరు అకౌంట్‌లో జమ కావాలంటే రూ. 30 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేసేదేమి లేక సదరు కాంట్రాక్టర్ రూ. 16 లక్షలు వేరే అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ కొట్టగా, మిగిలిన 14 లక్షలను నగదు రూపంలో ఫారెస్ట్ అధికారులకు అందజేసినట్లు వాపోయారు.
మళ్లీ వేధింపులు
తాజాగా చెక్క వేదిక బిల్లు రూ. 5.90 లక్షలు మంజూరైంది. ఈ బిల్లులో కూడా 25 శాతం రూ. 1.25 లక్షలు లంచం రూపంలో ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తామంటూ బెదిరించడంతో 23న ఏసీబీని ఆశ్రయించారు. నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు గురువారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో బాపట్ల మండలం, ఆదర్శనగర్ సమీపంలోని నగరవనానికి సివిల్ డ్రస్‌లో చేరుకున్నారు. అదే సమయంలో రేపల్లె డివిజన్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వి.వి.వెంకటరమణకు కాంట్రాక్టర్ వీర్లంకయ్య రూ.. 1.25 లక్షలు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. నగరవనంలోని రికార్డులను తనిఖీ చేశారు. పూర్తి సమాచారం కోసం పట్టణంలోని రేంజ్ కార్యాలయానికి తరలించి, విచారించారు. రమణ రావును విజయవాడలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్స్య, సీఐలు నాగరాజు, సుబ్బారావు, మన్మథరావు, సురేష్‌బాబు, ఎస్‌ఐలు భరత్‌రెడ్డి, ఉవర కొండ, సిబ్బంది దాడులలో పాల్గొన్నారు. లంచం అడిగితే 1064 టోల్‌ఫ్రీ, 94913 05638 నంబర్లకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.
ఏసీబీకి చిక్కిన ఫారెస్టు అధికారి
ఏసీబీకి చిక్కిన ఫారెస్టు అధికారి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
