రాజకీయ క్షేత్రంలో ఒక కేసరి

Tanguturi Sriram Article On Occasion Of 150th Birth Anniversary Of Tanguturi Prakasam - Sakshi

సందర్భం

ఒక నాయకుడికి ఎన్నో గొప్ప లక్షణాలు ఉండొచ్చు. కానీ ధైర్యం అనేమాటకు సమానార్థకంగా నిలిచిన నాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులు. బ్రిటిష్‌ తుపాకీకి ఎదురొడ్డి, చొక్కా విప్పి ఛాతీని చూపిస్తూ, దమ్ముంటే కాల్చమని ఆయన సవాల్‌ విసిరిన తీరు స్వాతంత్య్ర పోరాటంలో ఒక ఉత్తేజకర ఘట్టం. ప్రజలంటే నేనే, నేనంటేనే ప్రజ అనగలిగిన అతిశయం; తన మాటనే శాసనంగా చలాయించుకోగల అధికార దర్పం ఆయనకే చెల్లాయి. ప్రజల పట్ల ఉన్న షరతులు లేని మమకారమే దానికి కారణం అయ్యుండాలి. ఆంధ్రకేసరి అనేది కేవలం బిరుదనామం కాదు. ప్రజాక్షేత్రంలో సింహంలానే బతికారు. 150వ జయంతి వేడుకల సందర్భంగా ప్రకాశం పంతులుకు భారతరత్న ప్రకటించడమే ఆయనకు ఇవ్వగలిగే సరైన నివాళి. స్వతంత్య్ర భారతావనికి 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభవేళ ఇది. ఈ వేడుకలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘ఆజాదీ కా అమృత్‌మహోత్సవ్‌’ 75 వారాల పాటు జరుపు కోవాలని శ్రీకారం చుట్టారు. ఈ వేడుకలు ముఖ్యంగా అటు పాలకులు, ఇటు పాలితులు మన గొప్ప దేశ భక్తుల జీవితాలను, వారి త్యాగాలను, ధైర్య సాహసాలను, వారి అకుంఠిత దేశభక్తిని స్మరించుకొని ఆచరణలో పెట్టడానికి, వారిలో ఉత్తేజాన్ని నింపడానికి తలపెట్టినవి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఈ మహోత్సవ్‌ని స్వర్గీయ పింగళి వెంకయ్య గడప నుండి శ్రీకారం చుట్టడం హర్షణీయం.

ప్రజా అంటే నేనే
స్వాతంత్య్ర పోరాటంలో దక్షిణాన బ్రిటిష్‌సామ్రాజ్యాన్ని ధైర్య సాహసాలతో ఎదురించి గడగడలాడించిన సాహసి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. అర్ధ శతాబ్దికి పైగా రాజకీయ, ప్రజా హిత జీవిత రంగంలో ఆయన ఆశాకిరణమై నిలిచారు. దక్షణాన యావత్‌ ప్రజానీకంతో ప్రకాశం గారికున్న చనువు, చొరవ మరి ఏ నాయకుడికీ లేదు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులలో నైనా సరే ప్రజల పక్షాన నిలిచాడు. ఆజన్మాంతం ప్రజా అంటే నేనేరా! నేనంటేనే ప్రజరా! అని నిష్కల్మషంగా అనేవారు. అనేక సందర్భాలలో అది రుజువు చేశారు కూడా. 1928లో మద్రాస్‌ పట్టణంలో సైమన్‌కు వ్యతిరేకంగా ‘సైమన్‌  గోబ్యాక్‌’ హర్తాళ్‌కు భయపడి అందరు అగ్ర నేతలు పట్టణం వదిలిపోయారు. ప్రకాశం ఒక్కడే స్వయంగా నిలబడి హర్తాళ్‌ జరిపారు. లక్షలమంది పాల్గొన్న ఆ ఉద్యమంలో బ్రిటిష్‌ తుపాకీకి ఒక యువకుడు బలి అయి రోడ్డు మీద పడిపోయాడు. ప్రకాశం పంతులు ఆవేశంతో ముందుకు దూకాడు. బ్రిటిష్‌తుపాకీకి తన గుండెను చూపించి ‘‘కాల్చుకోండిరా!’’ అని ఎదిరించిన ధీశాలి. ఆనాటి నుంచే ఆయన ఆంధ్రకేసరిగా ప్రసిద్ధులైనారు. ప్రకాశం గారు నిర్వహించిన ఆ హర్తాళ్‌ దేశానికే తలమానికైంది. 

మదరాస్‌ రాకుమారుడు
పదవిలో ఉన్నా లేకున్నా ప్రజాసంక్షేమమే ఊపిరిగా జీవించారు. కొన్ని సందర్భాలలో పదవులను తృణపాయంగా వదిలిపెట్టారు.  లండన్‌లో బారిష్టర్‌ చదువుతున్న రోజులలో సిగార్‌ తాగి చిన్న ఉపన్యాస మివ్వమని చెప్తే, తల్లికిచ్చిన మాట కోసం తాను ఆ పని చేయనని నిశ్చయంగా చెప్పి కాలేజీలో చరిత్ర సృష్టించారు. రాజ మండ్రిలో, కాకినాడలో చదువుకుంటున్న రోజులలో నాటకాలు వేసేవారు. ప్రకాశం నటనా ప్రావీణ్యం చూసి ఆంగ్లబృందం ‘స్టార్‌ ఆఫ్‌ ద స్టేజ్‌’ బిరుదును ఇచ్చారు. వీధి తగాదాలలో పెద్ద పెద్ద రౌడీలను కూడా గడగడలాడించాడు. మద్రాసులో న్యాయవాదిగా పని చేస్తున్నప్పుడు జడ్జీలు సైతం అపసవ్యంగా, అగౌరవంగా వ్యవహరిస్తుంటే ఎదురుతిరిగి సన్మార్గంలో పెట్టేవారు. ఆ రోజులలో రోజుకి 1000 రూపాయల దాకా ఫీజు వసూలు చేసేవారు. ఆనాటికి అది చాలా పెద్ద మొత్తం. అంత ఫీజు తీసుకోవడం తెలుగు లాయర్లు ఎవ్వరు ఎరుగరు. అందుకే ఆయనను (ప్రిన్స్‌ ఆఫ్‌మద్రాస్‌) ‘మదరాస్‌ రాకుమారుడు’ అని పిలిచేవారు.

బీదరికం నుంచి సంపదలోకి...
కడు బీద కుటుంబంలో 1872 ఆగస్టు 23న ఒంగోలులోని మారుమూల గ్రామం వినోదరాయుడు పాలెంలో పుట్టారు ప్రకాశం. పట్టుదలతో, నిర్భీతితో, నిరంతర కృషితో బారిస్టరై లక్షలకు లక్షలు సంపాదించారు. తోటలు, భూములు, భవనాలు, ఆభరణాలు కొన్నారు. భోగభాగ్యాలను అనుభవించారు. గాంధీగారి పిలుపు మేరకు అంత సంపాదననూ వదిలి, దేశ దాస్య విమోచనకై త్రికరణ శుద్ధిగా ప్రజాసేవలో దూకిన మొట్టమొదటి తెలుగు లాయర్‌ఆయనే. వృత్తిని వదిలేసే ఒకరోజు ముందు తన క్లయింట్‌ దగ్గర తీసుకున్న ఫీజును తిరిగి ఇచ్చివేశారు. 

మాటే శాసనం
ఉమ్మడి మద్రాసులో ప్రకాశం పంతులు మంత్రిగా ఉండగా తాను తలపెట్టిన ఒక సంక్షేమ పథకానికి ఒక అధికారి దానికి జీవో తీయాలి, సమయం సందర్భం రావాలి అని అడ్డుపడితే ‘నామాటే ఒక జీవో. తక్షణమే అమలు చేయండి రా!’ అనే ధీమా, దమ్మూ కల జననేత. తాను మంత్రి పదవికి రాజీనామా ఇవ్వాల్సి వస్తే, కార్మికుల, ఉద్యమ కారులతో చర్చలు జరిపి ఒప్పించిన తరువాత సంతకం చేసిన మనిషాయన.

సాహసమే ఊపిరి
ప్రజల క్షేమం కోసం, వారి సుఖ శాంతుల కోసం పరితపించే వారు. మన రాష్ట్రాలలోనే కాక ఎక్కడ కల్లోలాలు జరిగితే అక్కడ ప్రత్యక్షమయ్యేవారు. రజాకార్ల దమనకాండను సహించలేక వారిని హెచ్చరించి ప్రజలకు ధైర్యాన్ని నింపి వచ్చారు. కేరళలో మతకల్లోలాలు జరుగుతుండగా ‘కనపడితే కాల్చు’ ఆదేశాలున్నప్పటికీ అక్కడికి వెళ్లారు. అక్కడి ప్రజలు విస్తుపోయి ఒక రాత్రంతా పంతులుగారిని కాపాడి రహస్యంగా బయటకు తీసుకుని వచ్చారు. కొట్లాటలు చంపు కోడాలు ఆగిపోయినాయి. 

ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఒక ఏడాదిపాటు ఉన్నా దశాబ్ది కాలం పట్టే ప్రజారంజక పథకాలను అమలు చేశారు. కృష్ణా బ్యారేజ్, గుంటూరులో హైకోర్టు స్థాపన, వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుమల దేవస్థానాభివృద్ధి, దానికి గానూ ఆర్థిక సహాయం, పన్ను ఎత్తివేత కొన్ని మచ్చుతునకలు. రాష్ట్ర అవతరణ సందర్భంగా అమలుపర్చిన 2,000 మంది ఖైదీల విమోచన పథకం వంటిది దేశం మొత్తంలో ఎక్కడా జరగలేదని నెహ్రూ కితాబు ఇచ్చారు. తాను మంత్రిగా ఉండగా చేనేత పరిశ్రమ అభివృద్ధి పథకంలో భాగంగా స్పిన్నింగ్స్‌మిల్లులను కేంద్రానికి తిప్పి పంపిన పదహారణాల గాంధేయవాధి. మహాత్ముడు ప్రవేశపెట్టిన ఉప్పు సత్యాగ్రహాన్ని కాంగ్రెస్‌లోని మహామహులే వ్యతిరేకిస్తే ప్రకాశం పంతులు సెంట్రల్‌ అసెంబ్లీకి రాజీనామా ఇచ్చి నేరుగా ఎకాఎకిగా సత్యాగ్రహ శిబిరానికి వెళ్లిన నాయకుడాయన. ఒక అధికారి బాపూజీతో, ప్రకాశం పథకాలను కేంద్రంలో నెహ్రూతో అమలు చేయించమని అడిగితే బాపూ చిరునవ్వు నవ్వి ‘‘అది కేసరులకే సాధ్యం, పండితులకు కాదు’’ అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత సద్భావనా యాత్ర చేస్తుండగా వడదెబ్బ తగిలిన ప్రకాశం పంతులు 1957 మే 20న హైదరాబాద్‌లో అనంతజ్యోతిలో కలిసిపోయారు. జీవితాంతం పల్లెలు, గ్రామాలు, మారుమూల తండాలు సైతం అలుపెరుగక తిరిగిన ప్రజల మనిషి. గ్రామాల అభివృద్ధి కోసం పరితపించిన ఆంధ్రకేసరి జన్మదినాన్ని ‘‘గ్రామ స్వరాజ్య దినోత్సవం’’గా ప్రకటించి, ‘భారతరత్న’ బిరుదును ప్రదానం చేయడం దేశం వారికి ఇచ్చే నిజమైన నివాళి అవుతుంది.

- టంగుటూరి శ్రీరాం 
వ్యాసకర్త ప్రధాన కార్యదర్శి, 
ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ. మొబైల్‌: 99514 17344
(టంగుటూరి ప్రకాశం 150వ జయంతి వేడుకల సందర్భంగా)  

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top