ఈ వైపరీత్యం ఎవరి పాపం?

Bahar Dutt Article On Natural Calamities - Sakshi

విశ్లేషణ

పర్యావరణ మార్పుల ప్రభావంతో విధ్వంసం ఏదైనా సరే.. పేదదేశాలకే పరిమితమని పాశ్చాత్య దేశాల ప్రజల్లో సర్వసాధారణంగా ఉన్న అంచనాను గత రెండువారాలుగా జరుగుతున్న పరిణామాలు పటాపంచలు చేశాయి. వరదకు అర్థం తెలీని జర్మనీలో.. అమెరికా, కెనడాల్లో చెలరేగిన వడగాల్పుల్లో వందలాది మంది మృతి చెందడం యావత్‌ ప్రపంచానికీ గుణపాఠం కావాలి. ఈ ఆకస్మిక వైపరీత్యాల సమస్యను సంపన్నదేశాలు ఏదోలా అధిగమిస్తాయన్న ధీమా గాలికి కొట్టుకుపోయింది. కోవిడ్‌ కానివ్వండి.. ఇంకో ప్రకృతి విపత్తు కానివ్వండి.. ప్రతి ఒక్కటీ మనకు ఒకే విషయాన్ని గుర్తు చేస్తోంది. ఏ మూల ఏం జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతా కచ్చితంగా ఉంటుందని!

యూరప్‌లో వరద బీభత్సం... కెనడాలో చరిత్రలో ఎన్నడూ ఎరగని స్థాయి ఉష్ణోగ్రతలు.. అకాల వర్షాలు... వరదలు!! ఇటీవలి కాలంలో సర్వత్రా వినిపిస్తున్న వార్తలివే. కారణాలు సుస్పష్టం. వాతావరణ మార్పులు. అయితే బాధ్యత ఎవరిదన్న విషయానికి వస్తే మాత్రం ప్రపంచం రెండుగా విడిపోయిందనే చెప్పాలి. జర్మనీలో ఇటీవలి వరదకు సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశమైనప్పటికీ వరదను సమర్థంగా ఎదుర్కోలేని పరిస్థితిలో ఎందుకుంది? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం నీళ్లు నములుతోంది. ‘‘జరిగిన విధ్వంసాన్ని వర్ణించేందుకు జర్మన్‌ భాషలో పదాలు కరవయ్యాయి’’ అని చాన్స్‌లర్‌ ఏంజెలా మార్కెల్‌ ఓ టీవీ రిపోర్టర్‌తో మాట్లాడుతూ వ్యాఖ్యానిస్తే... ఓ సామాన్య మహిళ మాత్రం ‘‘అసలు వరదల్లాంటివన్నీ పేద దేశాల్లో కదా జరగాలి. జర్మనీలోనూ వస్తాయని నేనెప్పుడూ అనుకోలేదు. వాన ఎంత వేగంగా వచ్చిందో... అంతే వేగంగా మనుషులను తనతో తీసుకెళ్లిపోయింది’’ అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 

సంపన్న దేశాలు మినహాయింపు కాదు...
ఈ మహిళ తన వ్యాఖ్యలో తెలిసో తెలియకో పాశ్చాత్యదేశాల్లోని మెజార్టీ ప్రజల్లో ఉన్న ఒక తప్పుడు అవగాహనను ఇంకోసారి స్పష్టం చేసింది. వాతావరణ మార్పుల ప్రభావం తాలూకూ విధ్వంసం ఏదైనా సరే.. పేదదేశాలకే పరిమితమన్నది వీరి అంచనా. అధిక జనాభాతో కిటకిటలాడే ఆయా దేశాల తీర ప్రాంతాల్లోనే నష్టం ఎక్కువగా ఉంటుందని.. ధనిక దేశాలకు ఏం ఫర్వాలేదన్న అపోహకు హేతువేమిటో తెలియదు. అంతేకాదు. సంపన్నదేశాలు ఏదోఒకలా ఈ సమస్యను అధిగమిస్తాయన్న ధీమా కూడా వారిలో వ్యక్తమవుతూంటుంది. కానీ వాస్తవం మాత్రం ఇందుకు భిన్నం. ప్రాంతం ఏదైనా.. ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగే జననష్టం మాత్రం అంతా ఇంతా కాదు. అయితే ఈ సంఘటనలకు మనం ఎలా స్పందిస్తున్నామన్న అంశంపైనే వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చలు విభేదాలకు దారితీస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల పేద దేశాలే ఎక్కువ నష్టపోతాయన్న అంచనా కూడా ఇలాంటిదే. కానీ కోవిడ్‌ కానివ్వండి.. ఇంకో ప్రకృతి విపత్తు కానివ్వండి.. ప్రతి ఒక్కటి మనకు ఒకే విషయాన్ని గుర్తు చేస్తోంది. ఏ మూల ఏం జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతా కచ్చితంగా ఉంటుందని! 

వాతావరణ మార్పులపై ఈ ఏడాది మరోసారి అంతర్జాతీయ స్థాయి చర్చలు జరగనున్నాయి. బ్రిటన్‌లోని గ్లాస్‌గ్లవ్‌లో ఈ చర్చ జరగాల్సి ఉండగా.. ఈ ఏడాది కూడా కనివినీ ఎరుగని రీతిలో ప్రకృతి విపత్తులు చవిచూశాం మనం. కాలిఫోర్నియాను అలవికాని దావానలం చుట్టేస్తే.. అమెరికాలో దశాబ్దాల తరువాత వడగాడ్పులు వీస్తున్నాయి. ఉత్తర అమెరికాలో భాగమైన కెనడాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకోవైపు జర్మనీలో వరదలు.. వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో చైనాలో వాన బీభత్సం. ఇవన్నీ ఇటీవలి పరిణామాలే. చైనాలో ప్రళయాన్ని తలపించేలా కార్లు, విమానాలు నీళ్లలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సుదూర భవిష్యత్తులోనూ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.

దేశీయంగా చూస్తే.. నలభై ఏళ్లలో లేనంత స్థాయిలో వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలమైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కేవలం ఆరు వారాల వ్యవధిలో రెండుసార్లు ప్రమాద హెచ్చరికలను చూడాల్సి వచ్చింది. ఉప్పొంగిన సముద్రకెరటాలు ఒకవైపు.. ఎడతెరిపిలేని వానలు ఇంకోవైపు మహా నగరాన్ని భయంతో కంపించేలా చేశాయంటే అతిశయోక్తి కాదేమో. చిన్నపాటి వర్షానికే నగరాలు చెరువుల్లా మారిపోతూండటానికి నగర ప్రణాళికల్లో లోపం, వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ విపరీతంగా సాగుతున్న కాంక్రీట్‌ నిర్మాణాలు కొంత కారణమైనప్పటికీ... ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువయ్యాయని అందరూ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మానవ చేష్టల ఫలితంగా వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయని.. భవిష్యత్తులో వీటి ప్రభావం మరింత తీవ్రమవుతాయని.. సముద్రతీర ప్రాంతాల్లోని మహానగరాలు నీటమునిగినా ఆశ్చర్యం లేదని అందరూ అంగీకరిస్తున్నా.. కొన్ని ధనికదేశాలు ఈ విపత్తును అధిగమించగలవన్న ఆశ కొనసాగుతూండటం ఆందోళనకరం.

ఆధిపత్య భావజాలమా?
అతితక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం! ఇలాంటి అనూహ్య పరిణామాలు తరచూ జరుగుతుంటాయని వాతావరణ మార్పులపై ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి కమిటీ ఐపీసీసీ ఇప్పటికే చాలాసార్లు హెచ్చరికలు జారీ చేసింది. భూతాపోన్నతి కారణంగా సంభవించే వాతావరణ మార్పుల్లో ఇదీ ఒకటని కూడా విస్పష్టంగా పలు నివేదికల్లో పేర్కొంది. ఇది ప్రపంచంలోని అన్నిదేశాలకూ వర్తించే అంశమైనప్పటికీ ఈ విషయమై వివక్ష స్పష్టంగా కనిపిస్తూంటుంది. తెల్లతోలు ఆధిపత్య భావజాలం కనిపిస్తూంటుంది. ప్రకృతి వనరులను రేపన్నది లేని చందంగా వాడేసుకుంటూ వాతావరణ మార్పులకు వారే కారణమవుతున్నా.. నెపం మాత్రం పేద దేశాల్లోని అధిక జనాభాపై నెట్టేయడం ఈ భావజాలానికి ఓ ప్రతీకగా చెప్పుకోవచ్చు. 

కొందరి సోకు.. అందరి శోకం!
వాతావరణ మార్పుల విషయంలో వాస్తవం ఏమిటంటే.. పెట్రోలు, డీజిల్‌ వంటి శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం. ప్రధాన భూమిక దీనిదే. కొందరి కార్బన్‌ ఫుట్‌ప్రింట్‌ (మన జీవనశైలి, అలవాట్ల ఫలితంగా ఉత్పత్తి అయ్యే విషవాయువుల మోతాదు. వాహనాల్లో పెట్రోలు వాడకంతో కార్బన్‌ డయాక్సైడ్, నైట్రిక్‌ ఆక్సైడ్‌ వంటి వాయువులు వెలువడుతూంటాయి). అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఒకసారి తరచి చూస్తే.. కేవలం కొన్ని దేశాలు, ప్రజల కార్బన్‌ ఫుట్‌ప్రింట్‌ అధిక జనాభా ఉన్న ఇతర దేశాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండటంతోనే ప్రపంచం ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. 

ప్రపంచ వనరులపై 2019 నాటి ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం.. అధిక ఆదాయానికి, భూ వాతావరణంపై పడుతున్న ప్రభావానికి ప్రత్యక్ష సంబంధం ఉందని చెబుతుంది. అధిక జనాభా కానే కాదు. ఆదాయం పెరిగిన కొద్దీ విలాసాలు ఎక్కువవుతాయన్నది అనుభవం. ధనికదేశాల్లో జరుగుతున్నది అదే. జనాభా వృద్ధి రేటు తగ్గుతున్నా.. ఆయా దేశాల్లో వనరుల వినియోగంలో మాత్రం తగ్గుదల నమోదు కావడం లేదు. అంతేకాదు.. తక్కువ ఆదాయమున్న దేశాల్లో జనాభా ఎక్కువవుతున్నా వారి వనరుల కోసం డిమాండ్‌లో మాత్రం వృద్ధి లేకపోవడం గమనార్హం. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచ వనరుల్లో పేద దేశాల డిమాండ్‌ మూడు శాతంగానే కొనసాగుతోంది. ఏతావాతా... వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించాలంటే.. జనాభ సమస్యను కాకుండా.. ఐశ్వర్యం అనే సమస్యకు పరిష్కారం వెతకాల్సి ఉంటుంది.

రానున్న రోజుల్లో ఈ ఏడాది జర్మనీలో తరహాలోనే పలు ప్రకృతి వైపరీత్యాలను చవిచూడాల్సి వస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రపంచం ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే పరిస్థితి ఇంతకంటే దిగజారకుండా జాగ్రత్త పడినాచాలు. ఇది జరగాలంటే రానున్న కాప్‌ 26 సమావేశాల్లో ధనిక దేశాల వివక్ష సమస్యపై కచ్చితంగా చర్చ జరగాల్సి ఉంటుంది. వాతావరణ మార్పుల ప్రభావం భూమ్మీద ప్రతిఒక్కరిపై ఉంటుందన్న ఎరుక కలిగినప్పుడే దాన్ని సమర్థంగా ఎదుర్కోగలమని, విపత్తును నివారించగలమని అందరూ గుర్తించాలి. 


బహార్‌ దత్‌ 
వ్యాసకర్త పర్యావరణ జర్నలిస్టు, అధ్యాపకురాలు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top