హీరోయిన్ చేస్తానని నా భార్యను తీసుకెళ్లాడు సార్‌..! | Wife Leaves Family For Chasing Film Dreams After Social Media Fame, Husband Seeks Guidance On Saving Family And Relationship | Sakshi
Sakshi News home page

హీరోయిన్ చేస్తానని నా భార్యను తీసుకెళ్లాడు సార్‌..!

Mar 26 2026 8:20 AM | Updated on Mar 26 2026 10:27 AM

 Wife Leaves Family Chasing Film Dreams After Social Media Fame

నాకు నలభై సంవత్సరాలు. నా భార్య స్వాతికి ముప్పై సంవత్సరాలు (పేర్లు మార్చబడినవి). మాది పెద్దలు కుదిర్చిన వివాహం. ఆమె చూడడానికి చాలా బాగుంటుంది, అలాగే వంటలు చాలా బాగా  చేస్తుంది. అయితే నలుగురిలో తాను ప్రత్యేకంగా కనిపించాలనే ఆరాటం ఆమెకు ఎక్కువ. కోవిడ్‌ సమయంలో సరదాగా యూట్యూబ్‌లో వంటల వీడియోలు చేయడం ్రపారంభించింది. మొదట్లో మంచి వ్యూస్‌ వచ్చాయి, సబ్‌స్క్రైబర్లు కూడా పెరిగారు. 

కానీ తరువాత వ్యూస్‌ తగ్గిపోయాయి, సబ్‌స్క్రైబర్లు కూడా పెరగలేదు. అదే సమయంలో రీల్స్‌ ట్రెండ్‌ మొదలైంది. దాంతో ఆమె వంటలు తగ్గించి చిన్నచిన్న డ్యాన్సులు, స్కిట్స్‌ చేయడం ్రపారంభించింది. ఇతరుల మాదిరిగా తనకు వ్యూస్‌ రావడం లేదని  రొమాంటిక్‌ పాటలకు, రొమాంటిక్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో వీడియోలు చేయడం మొదలు పెట్టింది. ఈ లోపు సోషల్‌ మీడియాలో పరిచయం అయిన ఒక వ్యక్తి తనకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని, తరువాత ఆమెను హీరోయిన్‌ని చేస్తానని నమ్మబలకడంతో ఆమె నేను ఎంత చెప్పినా వినకుండా హైదరాబాద్‌ వెళ్లి  ఒక ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. 

అతను రెండు మూడు చిన్న సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు ఇచ్చాడు. కానీ ఆమె మాత్రం త్వరలోనే హీరోయిన్‌ అవుతానని నమ్ముతోంది. ఆ వ్యక్తి ఆమెను  ప్రలోభపెట్టి అన్ని రకాలుగా తన వైపు తిప్పుకుంటున్నాడని అర్థమైంది. మాకు ఇద్దరు పిల్లలు. ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెకు సర్దిచెప్పకపోగా మా కూతురు హీరోయిన్‌ అవుతుందని, నేను అనవసరంగా అనుమానాలు పెంచుకుంటున్నానని నా మీదనే ఎదురు దాడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో నేను ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. 
– నరసింహారావు, విజయవాడ

మీరు ఎంత వేదన అనుభవిస్తున్నారో అర్థమవుతోంది. ఒకవైపు బాధ, మరోవైపు అవమానం, కోపం, నిరాశ ఇవన్నీ కలగలిసిన పరిస్థితి మీది. ఇక మీ భార్య విషయానికి వస్తే, ఆమెకు ముందు నుంచే నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనే ఆకాంక్ష ఉన్నట్లు స్పష్టమవుతోంది. కొందరిలో ఇలాంటి వ్యక్తిత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. గుర్తింపు రావడం మాత్రమే వారికి చాలా ముఖ్యం. యూట్యూబ్‌లో వంటల వీడియోల ద్వారా కొంతకాలం ఆమెకు ఆ గుర్తింపు వచ్చింది. కానీ వ్యూస్, సబ్‌స్క్రైబర్లు తగ్గడంతో  ఆమె రీల్స్, ఇతర వీడియోల వైపు వెళ్లి ఉండవచ్చు. సోషల్‌ మీడియాలో ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు కొత్తగా ప్రయత్నిస్తున్న మహిళలను ప్రలోభపరుస్తుంటారు.

ఇలాంటి సమయంలో మీరు ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకువెళ్లడం చాలా ముఖ్యం. మొదటగా.. ఆమె చేస్తున్న ప్రతి దాన్ని పూర్తిగా తప్పు అని చెప్పి, ఆపమని ఒత్తిడి చేస్తే ఆమె ఇంకా మీకు దూరమయ్యే అవకాశం ఉంది. బదులుగా ‘‘నీ ప్రయత్నాలకు నేను కూడా తోడుగా ఉంటాను’’ అనే విధంగా మాట్లాడడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అవసరమైతే కొంతకాలం ఆమెతో కలిసి ఆడిషన్లకు వెళ్లడం ద్వారా ఆమె ఒంటరిగా ఉండే పరిస్థితి తగ్గుతుంది. రెండవది.. సినిమా రంగంలో ఇప్పటికే పనిచేస్తున్న... లేదంటే స్థిరపడిన వ్యక్తులతో ఆమె మాట్లాడేలా చూడండి. ఆ రంగంలో ఉన్న కష్టాలు, వాస్తవ పరిస్థితుల గురించి వాళ్లు చెబితే కొన్నిసార్లు అది ఎక్కువ ప్రభావం చూపుతుంది.

 మూడవది.. మీ పిల్లల గురించి కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. వాళ్లు ఈ పరిస్థితి వల్ల ఒత్తిడికి గురికాకుండా చూడాలి. అవసరమైతే కొంతకాలం వారిని హాస్టల్‌లో చేర్పించండి. నాలుగవది.. మీ అత్తమామలతో కూడా ప్రశాంతంగా మాట్లాడండి. ‘‘ఆమె నటనావకాశాల కోసం ప్రయత్నించడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఆమె భద్రతే నాకు ముఖ్యం’’అని వాళ్లకు అర్థమయ్యేలా వివరించండి. ఇంతేకాదు.. చట్టపరమైన విషయాల గురించి కూడా మీరు అవగాహన కలిగి ఉండటం మంచిది. ఆ వ్యక్తి నిజంగా మోసం చేస్తున్నాడని అనిపిస్తే సంబంధిత ఆధారాలను సేకరించండి. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. 

ఒక మనిషిని బలవంతంగా మార్చడం సాధ్యం కాదు, ఆమె సొంత నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉన్నారని గమనించాలి. కాబట్టి మనం చేయగలిగేది ఓపికగా ప్రయత్నించడం, అదే సమయంలో సంబంధాన్ని పూర్తిగా తెంచుకోకుండా ఉండడం మాత్రమే! పరిస్థితి క్లిష్టంగా అనిపిస్తే ఒక మంచి క్లినికల్‌ సైకాలజిస్టు లేదా సైక్రియాట్రిస్టు దగ్గర ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ తీసుకోవడం కూడా ఉపయోగపడుతుంది. మీ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు మనశ్శాంతి కోల్పోకుండా మీ శ్రేయోభిలాషులతో కూడా సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోండి. ఒక్కోసారి జీవితంలో మనం అన్నీ అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. కాలమే సరైన సమాధానం చెబుతుంది. ఓపిగ్గా ముందుకెళ్లండి. ఆల్‌ ది బెస్ట్‌. 

డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, 
సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. 
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన 
మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com

Advertisement
 
Advertisement
Advertisement