పిల్లలు గంట.. పెద్దలు 45 నిమిషాలు

WHO New Guidelines On Physical Exercise - Sakshi

వ్యాయామంపై డబ్ల్యూహెచ్‌వో నూతన మార్గదర్శకాలు

ఎక్కువ శారీరక శ్రమ ఉన్న ఎక్సర్‌సైజులతో పిల్లలకు మేలు

యువత, మధ్యవయస్కులకు తేలికపాటి వ్యాయామంతో లబ్ధి

ఏరోబిక్స్‌తో వృద్ధులకు లాభం

సాక్షి, హైదరాబాద్‌: ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలని అందరికీ తెలుసు. కానీ ఏ వయసు వారు ఎంతసేపు, ఎలాంటి వ్యాయామాలు చేయాలి? అనే అంశాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజాగా స్పష్టత ఇచ్చింది. ఐదేళ్ల పిల్లలు మొదలు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, గర్భిణులను ఐదు కేటగిరీలుగా విభజించి ఎవరెంతసేపు ఎక్సర్‌సైజులు చేయాలో సూచించింది. బీపీ, షుగర్, ఎసిడిటీ, స్థూలకాయం, కేన్సర్, గుండె జబ్బులు తదితర జీవనశైలి వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలు తిరిగి ఆరోగ్యకర జీవనం సాగించేందుకు వీలుగా శారీరక శ్రమపై తొలిసారి శాస్త్రీయ మార్గదర్శకాలతో నివేదిక విడుదల చేసింది. 

5–17 ఏళ్ల వయసువారు... 
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం ఐదేళ్ల నుంచి 17 ఏళ్లలోపు ఉన్న పిల్లలు, ప్రతిరోజూ కనీసం గంటపాటు శక్తివంతమైన వ్యాయామాలు చేయాలి. ఎక్కువగా పరిగెత్తడం, జాగింగ్‌ లేదా ఏరోబిక్‌ వ్యాయామాలు చేయాలి. వారంలో మూడురోజులు కండరాలు, ఎముకలను బలోపేతం చేసే ఎక్సర్‌సైజులు చేయాలి. ఆటలు ఆడాలి. 

18–64 ఏళ్ల వయసువారు... 
ఈ విభాగంలోని వారు ప్రతివారం కనీసం రెండున్నర గంటల నుంచి ఐదు గంటల వరకు (రోజుకు గరిష్టంగా సుమారు 45 నిమిషాలు) తేలికపాటి నుంచి కఠిన ఎక్సర్‌సైజులు చేయాలి. వారానికి కనీసం 95 నిమిషాల నుంచి రెండున్నర గంటల వరకు కఠినమైన వ్యాయామాలు చేయడం వల్ల గుండె జబ్బులు, రక్తపోటు, కేన్సర్, టైప్‌–2 డయాబెటీస్‌ నుంచి బయటపడొచ్చు. శారీరక ఆరోగ్యం, మానసిక శ్రేయస్సు కోసం వ్యాయామం అవసరం. 

65 ఏళ్లు పైబడినవారు... 
వృద్ధులు సైతం 18–64 ఏళ్ల వయసు కేటగిరీ వారు చేసే వ్యాయామాలన్నీ చేయవచ్చు. వాటితోపాటు వారు వారానికి కనీసం మూడు రోజులు శరీర బ్యాలెన్స్‌కు దోహదపడే ఎక్సర్‌సైజులు చేయడం మంచిది. వృద్ధులు తూలి కిందపడకుండా ఉండేందుకు ఈ తరహా వ్యాయామాలు ఉపయోగపడతాయి. 

గర్భిణులు... 
గర్భిణులు లేదా బాలింతలు ఎలాంటి సమస్యలు లేకపోతే డాక్టర్ల సూచన మేరకు ప్రతివారం కనీసం రెండున్నర గంటల వరకు పరిమితమైన ఏరోబిక్స్‌ చేయాలి. అయితే వ్యాయామ సమయంలో నిర్ణీత పరిమాణంలో మంచినీరు తప్పక తాగాలి. కఠినమైన వ్యాయామాలు చేయరాదు. 

దీర్ఘకాలిక అనారోగ్యాలున్నవారు... 
దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధులున్న వారు వారానికి కనీసం గంటన్నర నుంచి ఐదు గంటలపాటు ఏరోబిక్స్‌ చేయాలి. లేదా వారానికి కనీసం 75 నిమిషాల నుంచి రెండున్నర గంటలపాటు కఠినమైన, శక్తివంతమైన ఏరోబిక్స్‌ చేయాలి. అలాగే వారానికి కొన్నిసార్లు, తమ సామర్థ్యాలను పెంచుకోవడానికి బ్యాలెన్స్‌ వ్యాయామాలు చేయాలి.

శారీరక శ్రమను ప్రోత్సహించాలి
డబ్ల్యూహెచ్‌వో నివేదికలోని మార్గదర్శకాలు అత్యంత శాస్త్రీయమైనవి. అందువల్ల శారీరక శ్రమ చేసేందుకు పిల్లలను ప్రోత్సహించాలి. తద్వారా వారిలో గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఎముకలు బలపడతాయి మానసిక ఉల్లాసం లభిస్తుంది. శారీరక శ్రమ చేసే గర్భిణుల్లో బీపీ సమస్య తలెత్తదు. ముందస్తు కాన్పుల సమస్య తగ్గుతుంది. 
– డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ 

డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్న అంశాలివి
►రోజుకు 10–12 గంటలు స్థిరంగా కూర్చునే వారిలో ముందస్తు మరణాలు సంభవించే అవకాశం మిగతావారికంటే 1.5 రెట్లు ఎక్కువ. 
►శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారిలో కిడ్నీ సమస్యలు, కడుపులో మంట, కేన్సర్‌ వంటివి 10 నుంచి 20 శాతం వరకు తగ్గుతాయి. అధిక బరువు సమస్య తలెత్తదు. షుగర్‌ వ్యాధిగ్రస్తులకు గుండెజబ్బు మరణాలు 40 శాతం తగ్గుతాయి. 
►27.5 శాతం పెద్దలు, 81 శాతం యుక్త వయస్కులు శారీరక శ్రమ చేయడంలేదు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top