Bahar Dutt: రెండేళ్ల పిల్లలు కూడా పాములతో ఆడుకోవడం చూసి.. చలించి.. వాటితో పాటు వారికి కూడా!

Who Is Bahar Dutt Changes Lives Of Snake Charmers - Sakshi

వారి జీవితాల్లోకి వసంతం తెచ్చింది

బహార్‌దత్‌ దిల్లీకి దగ్గరలోని బదర్‌పూర్‌ గ్రామానికి వెళ్లింది. అక్కడి దృశ్యాలు తనని అమితమైన ఆశ్చర్యానికి గురిచేయడమే కాదు ఆవేదన కలిగించాయి. రెండు మూడు సంవత్సరాల వయసు పిల్లలు ఆటబొమ్మలతో ఆడుకుంటున్నట్లుగా పాములతో ఆడుకుంటున్నారు! ‘పిల్లలకు ఇది బడిలాంటిది. పెద్దయ్యాక వాళ్లు బతికేది వీటితోనే కదా!’ అన్నాడు అక్కడ ఉన్న పెద్దాయన బీడీ వెలిగిస్తూ.

మధ్యప్రదేశ్‌లోని ఒక గ్రామంలో సంత జరుగుతోంది. రెండు బుట్టలతో కూర్చున్న ఒక యువకుడి చుట్టూ జనం మూగారు. బుట్టలో ఉన్న పాములను రకరకాలుగా ఆడిస్తున్నప్పుడు చుట్టూ ఉన్నవాళ్లు సంతోషంతో చప్పట్లు కొడుతున్నారు. విజిల్స్‌ వేస్తున్నారు. ఆ పాములు భరిస్తున్న హింసను చూసి బహార్‌కు ‘అయ్యో! పాపం’ అనిపించింది.

ఆట అయిపోయిన తరువాత... ‘తమ్ముడూ... పాములను అలా హింసించడం తప్పు కదా’ అన్నది బహార్‌దత్‌. ‘మేము బతికేది వీటితోనే కదమ్మా. మరి ఏం చేయమంటావ్‌!’ అన్నాడు ఆ యువకుడు పాములను బుట్టలో వేసుకుంటూ. ఎన్విరాన్‌మెంటల్‌ జర్నలిస్ట్‌ అయిన బహార్‌దత్‌ పర్యావరణ అంశాల గురించి ఎన్నో కోణాలలో ఎన్నో విలువైన వార్తాకథనాలు రాసింది.

ఆమె రాసిన ‘రివైల్డింగ్‌ ఇన్‌ ఇండియా’ (ఆక్స్‌ఫర్డ్‌ ప్రచురణ), ‘గ్రీన్‌వార్స్‌’ పుస్తకాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి. ‘ఎర్త్‌టాక్స్‌’ పేరుతో రిసెర్చ్‌ ఫౌండేషన్‌ మొదలు పెట్టిన బహార్‌దత్‌ యూఎన్‌ ఏజెన్సీ కోసం ఎన్నో చిత్రాలు చేసింది. ‘పాములపై హింస’ గురించి వ్యాసం లేదా వార్తాకథనం రాసి మనసులోని భారాన్ని దించుకోవచ్చు. కానీ తనకు వారి మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి... ‘మరేం చేయమంటావమ్మా... మా తాతముత్తాతల నుంచి మాకు వీటితోనే బతుకు’.

మన దేశంలో పాములను ఆడించేవారు వేలసంఖ్యలో ఉన్నారు. ఒకే నాణేనికి రెండు వైపులా... ఒకవైపు చూస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉల్లంఘన. మరోవైపు చూస్తే పాములే వారి జీవనాధారం. తన వంతుగా కొందరినైనా ఆ వృత్తి నుంచి బయటికి తీసుకురావాలనుకుంది బహార్‌. హరియాణ, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌... ఇలా ఎన్నో రాష్ట్రాలు తిరుగుతూ పాములు పట్టి ఆడించేవాళ్లు ఎక్కువగా ఉన్న గ్రామాల్లోకి వెళ్లి అక్కడి నాయకులు, ప్రభుత్వ అధికారులతో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల గురించి మాట్లాడింది.

మొదట్లో వాళ్లు పెదవి విరిచారు. అయితే పలుసార్లు మాట్లాడడం ద్వారా వారిలో మార్పు తీసుకువచ్చింది. దీంతో పాములు ఆడించేవాళ్లలో చాలామంది సంప్రదాయ వృత్తికి గుడ్‌బై చెప్పి బ్యాంకు రుణాల ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం మొదలుపెట్టారు. పిల్లలను బడికి పంపించడం ప్రారంభించారు. ‘బహార్‌’ అంటే వసంతం. ఆమె వారి జీవితాల్లోకి వసంతాన్ని తీసుకు వచ్చింది.

తన పర్యటనలలో ఎన్నోచోట్ల పాములు ఆడించే వాళ్ల  సంగీతాన్ని విన్నది...‘ఆహా’ అనిపించింది. ఏక్‌తార్, డోలక్‌లతో వారు తరతరాలుగా వస్తున్న సంప్రదాయ సంగీతాన్ని ఆలపిస్తున్నప్పుడు ఎంత గొప్పగా ఉంటుందో! వారి నుంచి పాములను దూరం చేసినా, విలువైన సంగీతాన్ని మాత్రం దూరం చేయకూడదు అనుకుంది బహార్‌. ఈ ఆలోచనలో భాగంగానే థియేటర్‌ డైరెక్టర్‌ రాయ్‌స్టెన్‌ ఎబెల్‌తో మాట్లాడి ‘ఎ హండ్రెడ్‌ చార్మర్స్‌’ అనే మ్యూజికల్‌ బ్యాండ్‌ను మొదలుపెట్టింది.

పాములు ఆడించే సమాజానికి  చెందిన గాయకులు ఈ వేదిక ద్వారా దేశవిదేశాల్లో తన ప్రతిభను ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది. జర్నలిస్ట్, రచయిత్రి, ఫిల్మ్‌మేకర్‌గా పేరు తెచ్చుకున్న బహార్‌దత్‌ ప్రస్తుతం కాలేజీపిల్లలకు పర్యావరణ సంబంధిత అంశాల గురించి పాఠాలు బోధిస్తోంది.

చదవండి: Russia Ukraine War: యుద్ధం ముగుస్తుంది.. నిజంగానే యుద్ధం ముగుస్తుంది.. కానీ!
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top