తిరుపతి గంగజాతర: వారు మాత్ర‌మే ఆ వేషాలు వేస్తారు! | Tirupati Ganga Jatara 2026 date wise full details | Sakshi
Sakshi News home page

తిరుపతి గంగజాతర వేషాల తీరే వేరు!

May 9 2026 2:06 PM | Updated on May 9 2026 2:21 PM

Tirupati Ganga Jatara 2026 date wise full details

సందర్భం

‘తిరుపతి కొండంత కొండ, పేరూరు గుట్టంత గుట్ట, తిరుపతి గంగజాతరంత జాతర’ లేవని తిరుపతి ప్రాంతీయుల నమ్మకం. నేడు తిరుపతి గంగజాతర రాష్ట్ర స్థాయి జాతర. ఇందులో 20 దున్న పోతుల్ని, 400 మేకపోతుల్ని, 700 కోళ్లని బలి ఇచ్చే సంప్రదాయం ఉన్నట్టు 1881 నాటి ఆర్కాట్‌ మాన్యువల్లో ఆర్థర్‌ ఎఫ్‌ కాక్స్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం దున్నపోతు బలి నిషేధితం. జాతరకి చిత్రి మాసంతో కత్రి కార్తెతో సంబంధం ఉంది. తిరుపతి గంగజాతర చాటింపు చిత్రి నెల నాలుగో మంగళవారం (మే 5, 2026). జాతర ముగింపు తర్వాతి మంగళవారం రాత్రి.

చాటింపునకు ముందు అవిలాల గ్రామం (Avilala Village) నుంచి ఆడబిడ్డ సాంగ్యం తేవడం ఆనవాయితీ. ఇచ్చేది ముళ్లపూడి పెదరెడ్డి కుటుంబీకులు. తెచ్చేది తాళ్లపాక గంగమ్మ గుడి పూజారులైన కైకాల కుటుంబీకులు. అవిలాల ఆడబిడ్డ సాంగ్యంలో భాగంగా అమృతపళ్లెం, గండదీపం, పసుపు కుంకుమ, వేపాకు, నిమ్మకాయలు, ఆకు వక్కలు, పానకం, ఒడిబియ్యం, పచ్చిపిండి (బియ్యపుపిండి) తప్ప నిసరి. చాటింపులో పానకం దుత్త, పసుపు ముంతకు ప్రాధాన్యం ఉంది. చాటింపుకు ముందు అందరికీ నానబియ్యంతో పాటు పానకం ఇస్తారు, ఆడవారికి పసుపు పంచుతారు. వేపాకు, తమల పాకు, అరటి పండు దోసిట్లో పట్టుకొని పోతురాజు ముందు ఎర్నీళ్లు లేదా వసంతం నీళ్లు పూజారి పోస్తుండగా వదిలి, వెనక్కి చూడకుండా వెళ్తారు. కైకాల, తోటివారు పంబ పలకలు అనుసరిస్తుండగా చాటింపు వేసే ప్రాంతానికి వెళ్తారు.

వేషాల వరుస
చాటింపు మర్నాడు నుంచి గుడి తరపున మిరాశీ దారులు వేసే వేషాలు... వేషాలమ్మ గుడి నుంచి ప్రారంభమై మిరాశి ఉన్న ఇళ్లకు వెళ్లి చాటు దాటకుండా తిరిగి వేషాలమ్మ గుడికి చేరుకుంటాయి. బుధవారం పొద్దున వచ్చే బైరాగి వేషం మొదటిది. సాయంత్రం పాముల వేషం, బేస్తవారం పొద్దున గొల్ల, సాయంత్రం బండ వేషాలు ఉంటాయి. శుక్రవారం పొద్దున కోమటి, సాయంత్రం తోటి వేషాలు. శనివారం పొద్దున్నే ఒకప్పుడు జంగం వేషం వచ్చేది కాని ఇపుడు రావడం లేదు. సాయంత్రం దొర లేదా రాజు వేషం, బంటు వేషాలు. రాజు పాళెగాణ్ణి వధించి ‘బండిపీనుగు’ అని పాళెగాని శవాన్ని ఊరేగిస్తారు.

ఆదివారం మాతంగి, పోతురాజు వేషాలు కాని ఇపుడు పోతురాజు వేషం రావడం లేదు. సోమవారం రెండు పసుపు కుండల వేషాలు. మంగళవారం పేరంటాలు వేషం ఊరు తిరుగు కుంటూ బుధవారం తెల్లవారు జామున గుడిలో ప్రత్యేకంగా తయారు చేసిన గంగమ్మ బొమ్మ చెంప నరుకుతుంది. తోటి వేషం నుంచి వేపాకు తప్పనిసరి. భక్తులు ఎక్కువ ఇష్టపడే వేషం తోటి వేషం. పాళెగాణ్ణి పట్టుకోవడానికి గంగమ్మ వేషాలు వేస్తుందనీ, దొర వేషంలో పట్టుకొని చంపివేస్తుందనీ కొన్ని కథలు చెప్తాయి.

బైరాగి వేషం గొడుగు, పాముల వేషం కావడి, గొల్ల వేషం మజ్జిగ దుత్తతో వస్తే; బండ, తోటి వేషాలు కొత్త చేటతో వస్తాయి. దొర చేతిలో కత్తి, పేరంటాలు చేతిలో గంగమ్మ అద్దం, కోమటి వేషం మెడలో కరవాళ్ల జందెం ఉంటాయి. వేషాలు ఇంటి గుమ్మం తొక్కి ఆశీర్వదించడంలో కూడా ఒక వ్యవస్థ ఉంది. మాతంగి హారతి పళ్లెంలో ఒడిబాల బియ్యం వేసి, సున్నపుకుండలు, పసుపు ఇచ్చి, పేరంటాలు పసుపు కుంకుమ ఇచ్చి ఆశీర్వదిస్తే; తోటి వేషం చేటతో, పొరకతో కొట్టి ఆశీర్వదిస్తుంది.

చ‌దవండి: భ‌వంతుడు ఎవ‌ర్ని అనుగ్ర‌హిస్తాడు?

గంగజాతరలో గుడి తరపు వేసే వేషాల్ని కైకాల వారు, మేకల తూరి, మంగపతి ఇంటిపేరు కల్గిన చాకలి వారు మాత్రమే వేస్తారు. చాకలి వారు బైరాగి నుంచి రాజు వేషం దాకా వేస్తే... మాతంగి, పసుపుకుండలు, పేరంటాలు వేషాలు కైకాలవారు వేస్తారు. ప్రస్తుతం ప్రతి వేషంతో పాటు ఆడవేషం కూడా వస్తోంది. వేషాల్లో చాకలి వారు వేసేవి ఒక వర్గంగా, కైకాలవారు వేసేవి మరో వర్గంగా విభజించి చూసినపుడు వాటి మధ్య ఒక అడ్డురేఖ ఉన్న విషయం గుర్తించవచ్చు. మగ వేషాలు మిరాశీ లేదా పూర్వం నుంచి పోతున్న కుటుంబాల దగ్గరికే పోతాయి. ఆడవేషాలు ప్రతి ఇంటి గడప తొక్కు తాయి. వేషధారణ, దీవెనలో కూడా తేడా ఉంది. మగ వేషాలకు ప్రత్యేక పాటలున్నాయి, బూతు పాటలున్నాయి. మగ వేషాలు గంగమ్మ గుడి దగ్గరకు పోతాయి కాని గుడిలోకి పోవు. రాజు మంత్రి వేషాలు వేశాలమ్మ గుడి దగ్గరకు పోతాయి గాని గుడిలోకి పోవు.

- ప్రొఫెస‌ర్‌ నాగపట్ల భక్తవత్సల రెడ్డి 
జానపద విజ్ఞాన పరిశోధకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement