అమ్మ చేతి పంట

Tamil Nadu farmer P Bhuvaneshwari started her farming to Organic Farm - Sakshi

విద్యార్థులు ఏటా పరీక్షలు రాసి ఉత్తీర్ణులవుతూ పై తరగతులకు ప్రమోట్‌ అవుతుంటారు. పట్టభద్రులైన తర్వాత ఇక పుస్తకాలుండవు, తరగతులుండవు, పరీక్షలూ ఉండవు. రైతుకి అలా కాదు. వ్యవసాయం అనే పరీక్షను ఏటా ఎదుర్కోవాల్సిందే. తన జీవితకాలమంతా ఏటా పరీక్ష కు సిద్ధం కావాల్సిందే. కాలం కలిసి వచ్చి ప్రకృతి కరుణిస్తేనే ఉత్తీర్ణత. ఎన్నేళ్లు ఎన్ని పరీక్షలు రాసినా ప్రమోషన్‌ ఉండదు. అదే పొలం, అదే పంట.

భూమితో అనుబంధం తెంచుకోలేక, ఉత్తీర్ణత ప్రశ్నార్థకమవుతున్నా సరే మళ్లీ మళ్లీ పరీక్షకు సిద్ధం కావాల్సిందే. ఇన్ని పరీక్షలతో అలసిపోయిన రైతులు తర్వాతి తరాన్ని పొలానికి దూరంగా పెంచుతున్నారు. వ్యవసాయం మీద మమకారం పెంచుకుంటారేమోనని భయపడుతున్నారు కూడా. తమిళనాడులోని ఈ కుటుంబం కూడా అలాంటిదే. ఓ అమ్మ పిల్లల బాధ్యతలు పూర్తయిన తరవాత అదే పొలంలో అడుగుపెట్టి, ప్రయోగాల పంట పండించింది.

కావేరి తీరం!
భువనేశ్వరి పుట్టింది తమిళనాడు, తంజావూరు జిల్లాలోని కల్యాణోదయ్‌ గ్రామంలో. వాళ్ల ఇంటికి దగ్గరగా కావేరి నది ప్రవహిస్తుండేది. నీరు, మట్టి, చెట్టు, పండు అన్నీ స్వచ్ఛమే. కలుషితం కావడం అంటే ఏమిటో తెలియని ప్రకృతి ఒడిలో పెరిగిన బాల్యం ఆమెది. పెళ్లి తర్వాత మధురైకి దగ్గరలోని పుదుకొటై్టకి వెళ్లింది. అత్తవారిది కూడా వ్యవసాయ ప్రధానమైన కుటుంబమే. కానీ ఈ తరంలో అందరూ ఇతర వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు. కౌలు రైతుల కెమికల్‌ ఫార్మింగ్‌ వల్ల పొలం బీడువారింది.

అత్తగారింట్లో వాళ్లెవరూ తమకు పదెకరాల పొలం ఉందనే సంగతి కూడా పట్టించుకోవడం లేదు. భువనేశ్వరి మొక్కల హాబీ పెరటిసాగుకే పరిమితమైంది. పిల్లలు పెద్దయిన తర్వాత ఆమెకు ఖాళీ సమయం ఎక్కువైంది. ఇంట్లో వాళ్లను అడిగి ఒకటిన్నర ఎకరా పొలంలో సాగు చేయడానికి అనుమతి తీసుకుందామె. పొలానికి వెళ్లి సేద్యం చేయడానికి అనుమతి ఇస్తూ ఇంట్లో వాళ్లు ‘వ్యవసాయం అంటే పెరట్లో కూరగాయలు పండించినట్లు కాదు’ అని హెచ్చరించారు కూడా.

సేద్యంలో మెళకువల కోసం కరూర్‌లోని ‘వనగమ్‌ నమ్మళ్వార్‌ ఎకలాజికల్‌ ఫౌండేషన్‌’లో శిక్షణ తీసుకుంది. అన్నింటికీ తలూపి సేంద్రియ పద్ధతిలో సేద్యం చేయడం మొదలుపెట్టిందామె.  అలా ఆమె రైతుగా మారింది. ఇది 2013 నాటి మాట. ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిన సాగు మంచి ఫలితాలనిచ్చింది. సాగు విస్తీర్ణాన్ని విస్తరించింది. ఇప్పుడు పదెకరాల పొలాన్ని ఒంటి చేత్తో సాగు చేస్తోంది. నేలకు ఎప్పుడు ఏ సేవ చేయాలో, ఎప్పుడు ఏ పంట వేయాలో క్షుణ్నంగా వివరించగలుగుతోంది. కొత్తగా సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే వాళ్లకు సలహాలిస్తోంది.

వంట కోసమా! పంట కోసమా!!
భువనేశ్వరి సేంద్రియ సేద్యంలో నేర్చుకున్న ఆవుపేడ, ఆవు మూత్రంతో కూడిన పంచగవ్యాన్ని ఉపయోగించడం వంటి మెళకువలకు తోడు తాను మరికొన్ని జోడించి చేసిన సొంత ప్రయోగాలు ఫలించాయి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మెత్తగా నూరి ఆ ముద్దను మజ్జిగలో కలిపి పంటల మీద చల్లేది. కీటకాలు మొక్కలోని సారాన్ని పీల్చేసి ఆకులు తెల్లగా మారిపోయినప్పుడు ఆమె ఈ పని చేసింది. కీటకాలు నశించి మొక్కలు ఆకుపచ్చదనం సంతరించుకున్నాయి.

ఆమె ప్రయోగాలను చూసి ఆమె పిల్లలు ‘అమ్మా! వంట చేస్తున్నావా? పంట పండిస్తున్నావా’ అని చమత్కరించేవారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల మీద ప్రయోగాలు పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు అంతరించిపోతున్న ధాన్యాలను పరిరక్షించే పనిలో ఉందామె. అందరికీ ఉండేది రోజుకు ఇరవై నాలుగ్గంటలే. ఆ ఇరవై నాలుగ్గంటలను ఉపయుక్తంగా మలుచుకునే వాళ్లు చరిత్ర సృష్టిస్తారు... అచ్చం భువనేశ్వరిలాగానే.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top