టీ–17 పందులు సూపర్‌.. నెలకు లక్షకు పైగా నికరాదాయం!

SVVU T17 Pig: Crossbred Pig Variety Developed By Sri Venkateswara Veterinary University - Sakshi

రైతులకు వరంగా మారిన ఎస్‌వీవీయూ అభివృద్ధి చేసిన టీ–17 రకం సీమ పందుల జాతి

సాధారణ పందుల కంటే రైతులకు రెట్టింపు ఆదాయం

సీమ పందుల పెంపకంపై ఆసక్తి చూపుతున్న యువత

తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించే సీమ పందుల పెంపకంపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న పందుల పరిశోధనా కేంద్రం ఎస్‌వీవీయూ టీ–17 రకం సీమ పందుల జాతిని అభివృద్ధి చేసింది. శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ ఈ జాతి పందులను  పెంచుతున్న రైతులు అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. యువ రైతులు సైతం ఆసక్తి చూపుతుండటం విశేషం. 

పంది మాంసాన్ని ‘పోర్క్‌’ అంటారు. కండ (హమ్‌), వారు (బాకన్‌), సాసెజ్, నగ్గెట్స్, ప్యాట్టీస్, పోర్క్‌ పచ్చడి, బ్యాంబూ పోర్క్‌ల రూపంలో సీమ పంది ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేస్తున్నారు. వీటిలో మాంసకృత్తులు, విటమిన్లతో పాటు ఓలిక్‌ లినోలిక్‌ ఫాటీయాసిడ్స్‌ అధికంగా ఉంటాయి. పిల్లలు, వృద్ధులు, క్రీడాకారులకు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి సీమ పంది మాంసం ఉత్పత్తులు ఉపయోగపడతాయని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. 


పందుల పెంపకాన్ని లాభదాయకం చేయడంతో పాటు కొత్త పంది రకాల అభివృద్ధికి తిరుపతిలోని పరిశోధనా కేంద్రం గడిచిన ఐదు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తోంది. స్థానికంగా లభ్యమయ్యే వివిధ వ్యవసాయ ఉప ఉత్పత్తులను 10–15 శాతం వరకు పందుల దాణా తయారీకి వినియోగించి ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. పందులకు సంక్రమించే మేంజ్‌ అనే చర్మ వ్యాధికి డోరోమెక్టిన్‌ అనే ఔషధాన్ని కనిపెట్టారు. 

20 శాతం మంది పోర్క్‌ తింటున్నారు
దేశంలో 9 లక్షల మిలియన్ల పందులుంటే, ఆంధ్రప్రదేశ్‌లో 92 వేలున్నాయి. దేశంలో 22 శాతం మంది, రాష్ట్రంలో 11 శాతం మంది పందుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ మాంసాహారుల్లో పంది మాంసం తినే వారి సంఖ్య 18–20 శాతం ఉన్నారని అంచనా. ఏటా రూ.18 కోట్ల విలువైన 894 టన్నుల పంది మాంసం ఉత్పత్తులు మన దేశం నుంచి వియత్నాం, కాంగో, జర్మనీ వంటి దేశాలకు ఎగుమతవుతున్నాయి. 

ఒక పంది... 80 పిల్లలు...
ఐదేళ్ల క్రితం విదేశీ జాతి పందులతో దేశవాళీ పందులను సంకరపరిచి ఎస్‌వీవీయూ టీ–17 (75 శాతం లార్జ్‌వైట్‌ యార్క్‌షైరు, 25 శాతం దేశవాళీ పంది) అనే కొత్త పంది జాతిని అభివృద్ధి చేశారు. వాడుకలో సీమ పందిగా పిలిచే వీటి పెంపకంపై రైతులు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. జీవిత కాలంలో ఈతకు 8 చొప్పున 10 ఈతల్లో 80 పిల్లలను పెడుతుంది.

పుట్టినప్పుడు 1.12 కేజీలుండే ఈ పంది పిల్ల వధించే సమయానికి 85 కేజీల వరకు బరువు పెరుగుతుంది. పది ఆడ, ఒక మగ పందిని కలిపి ఒక యూనిట్‌గా వ్యవహరిస్తారు. కేంద్రం నుంచి అభివృద్ధి చేసిన పందులకు సంబంధించి 400 యూనిట్లను రైతులకు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఏపీలో రైతుల దగ్గర 20 వేల పైగా ఈ రకం పందులు పెరుగుతున్నాయి. 

ఒక యూనిట్‌ దేశవాళీ పందుల పెంపకం ద్వారా సగటున ఏటా రూ. 3–3.5 లక్షల ఆదాయం వస్తుంటే, ఈ రకం సీమ పందుల పెంపకం ద్వారా రూ. 6–7 లక్షల ఆదాయం వస్తుంది. మాంసం రూపంలో అమ్మితే రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. 
– పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి


నెలకు రూ. లక్షకు పైగా నికరాదాయం
 
నేనో సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని. రెండేళ్లుగా పశుపోషణ చేస్తున్నా. గతేడాది తిరుపతి పందుల పరిశోధనా కేంద్రం నుంచి 15 పిల్లలతో పాటు 5 పెద్ద పందులను కొని పెంపకం చేపట్టా. హాస్టళ్లు, హోటళ్ల నుంచి సేకరించే పదార్థాలను పందులకు మేపుతున్నాం. చూడి/పాలిచ్చే పందులకు విడిగా దాణా పెడతున్నా. నెలకు రూ. 49,400 ఖర్చవుతోంది. మాంసం ద్వారా రూ.1.40 లక్షలు, పంది పిల్లల అమ్మకం ద్వారా రూ.13,500 ఆదాయం వస్తోంది. ఖర్చులు పోను నెలకు రూ.లక్షకు పైగా నికరాదాయం వస్తోంది. పందుల పెంపకం లాభదాయకంగా ఉంది.     
– సుంకర రామకృష్ణ, నూజివీడు, ఎన్టీఆర్‌ జిల్లా


మార్కెటింగ్‌పై అవగాహన కల్పిస్తే...

నేనో సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని. పందుల పెంపకంపై ఆసక్తితో తిరుపతి పరిశోధనా కేంద్రంలో శిక్షణ పొందాను. ఈ పరిశ్రమ ఎంతో లాభసాటిగా ఉందని గ్రహించాను. త్వరలో పందుల పెంపకం యూనిట్‌ పెడుతున్నా. మార్కెటింగ్‌పై మరింత అవగాహన కల్పిస్తే యువత ఆసక్తి కనపరుస్తారు.
–జి.మహేష్, గాజులమండ్యం, తిరుపతి జిల్లా


పొరుగు రాష్ట్రాల రైతుల ఆసక్తి

శాస్త్రీయ పద్ధతుల్లో సీమ పందుల పెంపకంపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాం. ఎస్‌వీవీయూ టీ–17 జాతి పందులకు మంచి డిమాండ్‌ ఉంది. పొరుగు రాష్ట్రాల రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. పెంపకంలో మెళకువలతో పాటు వీటికి సంక్రమించే వ్యాధులను గుర్తించి తగిన చికిత్స, నివారణా చర్యలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పంది మాంసం ఉత్పత్తుల్లో ఉండే పోషక విలువలపై వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తున్నాం.
– డాక్టర్‌ కే.సర్జన్‌రావు (99890 51549), పరిశోధనా సంచాలకులు, ఎస్‌వీవీయూ, తిరుపతి


రైతులకు నిరంతర శిక్షణ

తిరుపతిలో పందుల పరిశోధనా కేంద్రం ఏర్పాటై 50 ఏళ్లవుతోంది. తాజాగా విడుదల చేసిన ఎస్‌వీవీయూ టీ–17 రకం పంది జాతికి  మంచి డిమాండ్‌ ఉంది. దేశవాళీ పందులతో పోల్చుకుంటే రెట్టింపు ఆదాయం వస్తుంది. వీటి పెంపకంపై ఆసక్తి గల యువతకు, రైతులకు ఏడాది పొడవునా శిక్షణ ఇస్తున్నాం.
–డాక్టర్‌ ఎం.కళ్యాణ్‌ చక్రవర్తి (94405 28060), సీనియర్‌ శాస్త్రవేత్త, అఖిల భారత పందుల పరిశోధనా కేంద్రం, తిరుపతి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top