మాట్లాడే రాళ్ళు

Special Story About Durgabai Deshmukh - Sakshi

విద్యార్థులు ఏదయినా ఒక విషయాన్ని సాధించాలనుకుంటే–దానికి ప్రతిబంధకమయిన విషయాన్ని దాటడంలో ముందు ఉండాల్సింది మనోస్థైర్యం, మొక్కవోని ధైర్యం. ఈ లక్షణాలకు అవసరమయిన ప్రేరణ మహాత్ములయిన వారినుంచి వస్తాయి. వారి జీవిత చరిత్రలను చదివితే, వారి ప్రసంగాలు వింటే వస్తాయి.

ప్రముఖ సంఘ సేవకురాలు, స్త్రీ జనోద్ధరణకు విశేషంగా కృషి చేసిన దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ 11వ ఏట మహాత్మాగాంధీ ప్రసంగం విన్నారు. సహాయ నిరాకరణోద్యమం జరుగుతోంది ఆ రోజుల్లో. హిందీ నేర్చుకోవాల్సిన అవసరాన్ని, విదేశీ వస్తువులను వాడకుండా వదిలివేయాల్సిన అవసరాన్ని ఆ ప్రసంగం ద్వారా అర్థం చేసుకున్నారు. ఇంటికొచ్చి తను అప్పటివరకూ వాడుతున్న విదేశీ వస్తువులన్నీ పెరట్లో పడేసి అగ్నిహోత్రంలో దగ్ధం చేసారు. ఒక రాట్నం కొనుక్కుని నూలు వడకడం నేర్చుకుని తన బట్ట తానే తయారు చేసుకుని ధరించారు. హిందీ నేర్చుకున్నారు.

చిన్నపిల్లలతో ప్రత్యేకించి ‘బాలికా హిందీ ప్రచార సభ’ను ఒక చిన్న కుటీరంలో తన 12వ ఏట ప్రారంభించారు. తాను మహాత్మాగాంధీ నుంచి ఎలా ప్రేరణ పొందారో అందరికీ అలా దేశభక్తి కలగడానికి అందర్నీ కూర్చోబెట్టి దేశభక్తుల చరిత్రలు  చెప్పేవారు. అలా ఎంత మందిని తీర్చిదిద్దారో! ఆమె సంకల్పబలం ఎంత గట్టిదంటే – ఒక్క ఆంధ్ర దేశంలోనే వంద విశాలమైన ప్రాంగణాలు ఈ ప్రయోజనం కోసం వెలిసాయి. కొన్ని వేలమంది స్త్రీలను ఉద్ధరించడానికి అనువైన పలు కార్యక్రమాలు చేపట్టారు.

ఆమె అనుభవాలతో ‘స్టోన్స్‌ దట్‌ స్పీక్‌’ పేరిట (‘మాట్లాడే రాళ్ళు’ అని) ఒక పుస్తకం రాసారు. మనం పునాది రాయి ఒకటి వేస్తే... అది ఒక సంకల్పానికి ప్రతీక. నేనిక్కడ ఏడంతస్తుల మేడ కట్టాలనుకున్నా, ఒక పునాది రాయి వేసా. అది వందేళ్ళయినా అలాగే ఉంటుంది. అది మాట్లాడదు–అనుకోకండి. ఏమిటీరాయి. పునాదిరాయి. ఎవరేశారు.. ఫలానాయన. ఎప్పుడేశారు... వందేళ్ళక్రితం. ఎందుకేశారు... ఏడంతస్తుల మేడ కట్టాలని. ఏమయింది... కట్టలేదు. ఆయనేడి... కాలగర్భంలో కలిసిపోయాడు... అంటే – ఇప్పుడా రాయి సంకల్పశుద్ధిలేని ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నట్లే కదా !!!.

మరో పునాది రాయి ఉంది. దాని పక్కనే ఒక విశ్వవిద్యాలయం, ఒక వైపున వైద్యాలయం, మరోవైపున కళా కేంద్రం, వాటి వెనుక ఒక ఏడంతస్తుల మేడ వచ్చింది. ఒక వ్యక్తి ఏ లక్ష్యంతో ప్రారంభించాడో అది ఎలా తీర్చిదిద్దబడిందో ఎంతమంది ఆ  లక్ష్యం వైపుగా అడుగులు వేసి దేశ చరిత్రలో  కీర్తి పుటలను అదనంగా ఎన్ని చేర్చగలిగారో... మాట్లాడలేదు.. అనుకున్న ఆ పునాది రాయి సజీవ సాక్ష్యాలతో చెబుతున్నదా లేదా!!! అందుకే ఆమె ఆ పేరు పెట్టారు.

ఆ పుస్తకంలో ఆమె కాలాన్ని ఎలా వినియోగించుకోవాలో రాస్తూ – ‘‘ఒక సంకల్ప శక్తి కలిగిన వ్యక్తి కాలం విలువను అర్థ చేసుకోగలిగిన వ్యక్తి, ప్రణాళికా బద్ధంగా కాలాన్ని తీర్చిదిద్దుకోగలిగిన వ్యక్తి.. ఏ కార్యాన్ని సాధించాలనుకున్నాడో దానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేసుకుని లోభ కారకాలనూ, మోహ కారకాలనూ జయించి నిలబడగలిగిన వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి తీసుకు రాగలడేమో కానీ, కోట్లాది రూపాయలు మాత్రం అటువంటి వ్యక్తిని తయారు చేసి తీసుకు రాలేవు. అటువంటి వ్యక్తులు దేశ చరిత్రను తిరగ రాస్తారు’’–అన్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top