మహిళలను ఒక పట్టాన వదలని రక్తహీనత...

Special Story About Anemia in womens - Sakshi

రక్తహీనత పురుషుల్లో, మహిళల్లో ఇలా అందరిలో కనిపించే సమస్యే అయినా మహిళల్లో మరింత ఎక్కువ. అందునా భారతీయ మహిళల్లోని దాదాపు 80 శాతం మందిలో రక్తహీనత ఉండనే ఉంటుందని అనేక మంది డాక్టర్ల పరిశీలనల్లోతేలింది.

రక్తంలో తగినన్ని ఎర్రరక్తకణాలు లేకపోవడాన్ని రక్తహీనత (అనీమియా) అంటారు. మన శరీరంలోని 100 గ్రాముల రక్తంలో... హీమోగ్లోబిన్‌ పరిమాణం మగవారిలోనైతే 13 గ్రాములు, మహిళల్లోనైతే 12 గ్రాములు ఉండాలి. ఒకవేళ ఇంతకంటే తక్కువగా ఉంటే రక్తహీనతతో బాధపడుతున్నట్లు పరిగణించవచ్చు.

కారణాలు
 మహిళల్లో రుతుస్రావం వల్ల ప్రతి నెలా రక్తం పోతుంది కాబట్టి అది రక్తహీనతకు దారితీయడం చాలా సాధారణం. కొందరిలో ఎర్రరక్తకణాల తయారీ ప్రక్రియ దెబ్బతింటుంది. కొత్త ఎర్రరక్తకణాలు తయారయ్యే లోపే కొందరిలో పాతవి వేగంగా చనిపోవడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. ఇక మహిళల్లో రుతుస్రావంతో పాటు బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అతిగా రక్తంపోవడం, యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ ఉండటం కూడా రక్తహీనతకు కారణం.

లక్షణాలు
 రక్తహీనత వచ్చిన వారిలో ఎర్రరక్తకణాల (రెడ్‌ బ్లడ్‌ సెల్స్‌ / ఎరిథ్రోసైట్స్‌) సంఖ్య తగ్గిపోతుంది. దాంతో పాలిపోయిన చర్మం, తెల్లబడ్డ గోళ్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాటిని అనీమియాకు సూచనగా పరిగణించవచ్చు. ∙శ్వాస కష్టంగా ఉండటం ∙కొద్దిపాటి నడకకే ఆయాసం ∙అలసట  ∙చికాకు / చిరాకు / కోపం ∙మగత ∙తలనొప్పి ∙నిద్రపట్టకపోవడం ∙పాదాలలో నీరు చేరడం ∙ఆకలి తగ్గడం  ∙కాళ్లుచేతుల్లో తిమ్మిర్లు, అవి చల్లగా మారడం ∙పాలిపోయినట్లుగా ఉండటం ∙ఛాతీనొప్పి ∙త్వరగా భావోద్వేగాలకు గురికావడం మొదలైనవి.

జాగ్రత్తలు / చికిత్స
ఐరన్‌ పుష్కలంగా లభించే ఆహారాలైన కాలేయం, ఆకుపచ్చటి ఆకుకూరలు, నువ్వులు, ఖర్జూరం, అటుకులు, బెల్లం వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అవసరమైన సందర్భాల్లో కొందరిలో  ఐరన్‌ ట్యాబ్లెట్లు వాడాలి.  ఇవి వాడే సమయంలో కొందరికి మలబద్దకం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవి డాక్టర్ల సలహా మేరకే వాడాలి. అప్పుడు డాక్టర్లు వారికి సరిపడే అనీమియా మందుల్ని  సూచిస్తారు. మరీ రక్తహీనత ఎక్కువగా ఉంటే అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించాలి.
రక్తహీనత ఉన్న మహిళలు తప్పనిసరిగా డాక్టర్‌ చేత పరీక్షలు చేయించుకుని తమ అనీమియాకు నిర్దిష్టంగా కారణమేమిటో తెలుసుకోవాలి. అసలు కారణాన్ని తెలుసుకుని దానికి సరైన చికిత్స ఇస్తే అనీమియా తగ్గుతుంది. ఆ తర్వాత మాత్రమే అవసరాన్ని బట్టి అనంతర చికిత్స తీసుకోవాలి.
 
డాక్టర్‌ ఆరతి బళ్లారి
హెడ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top