మానవ హితమే ‘ఈద్‌’ అభిమతం | Sakshi Special Story About Eid-ul-Fitr | Sakshi
Sakshi News home page

మానవ హితమే ‘ఈద్‌’ అభిమతం

Mar 21 2026 3:49 AM | Updated on Mar 21 2026 3:49 AM

Sakshi Special Story About Eid-ul-Fitr

రమజాన్‌ నెల ముగిసిన తర్వాత ముస్లిం సమాజం అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే పర్వదినం ఈదుల్‌ ఫిత్ర్‌. ఏకధాటిగా నెలరోజులపాటు సాగిన ఆధ్యాత్మిక సాధన స్పూర్తితో, మానవీయ విలువలకు నూతన ఆరంభం. ఉపవాసం ద్వారా శరీరాన్ని మాత్రమే కాదు, తన ఆలోచనలను, ప్రవర్తనను కూడా శుద్ధి చేసుకున్న మనిషి ఆ అనుభూతిని సమాజంతో పంచుకునే రోజు ఈద్‌. అందుకే ఈ పండుగలో కనిపించే ఆనందం కేవలం ఉత్సవపు ఉల్లాసం కాదు; అది ఆధ్యాత్మికత, దానం, సహోదరత్వం, సామాజిక బాధ్యతల సమ్మేళనం.

 అందుకే ఈ నెలను ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం పాటించడం, రాత్రిళ్లు ప్రత్యేక ప్రార్థనలు చేయడం, ఖుర్‌ ఆన్‌ పఠనం, దానం వంటి ఆచారాలు విశ్వాసుల జీవితంలో ఒక శుద్ధి ప్రక్రియలా మారుతాయి. ఉపవాసం ద్వారా ఆకలి, దాహం అనుభూతిని స్వచ్ఛందంగా స్వీకరించడం ద్వారా మనిషి తన కోరికలను నియంత్రించుకోవడం నేర్చుకుంటాడు. అదే సమయంలో పేదసాదల కష్టాలను అర్థం చేసుకునే సానుభూతి కూడా అతనిలో పెరుగుతుంది.

ఈ పండుగలోని ముఖ్యమైన ఆచారాల్లో ఒకటి జకాతుల్‌ ఫిత్ర్‌ లేదా ఫిత్రా. ప్రతి ముస్లిం కుటుంబం తమ శక్తికి తగ్గట్టు పేదలకు దానం చేయడం సంప్రదాయం. దీని వెనుక ఉన్న భావం ఎంతో గొప్పది. సమాజంలో ఎవరూ ఆకలితో ఉండకూడదనే మానవీయ బాధ్యతను ఇది గుర్తు చేస్తుంది. పండుగ ఆనందం సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరాలనే భావన ఇస్లాం లోని సామాజిక న్యాయ భావనను ప్రతిబింబిస్తుంది.

ఈద్‌ రోజూ ఉదయం మసీదులు, ఈద్‌ గాహ్‌లలో జరిగే ప్రత్యేక ప్రార్థనలు సమాజంలోని ఐక్యతను ప్రతిబింబిస్తాయి. వేలాదిమంది ఒకేస్థలంలో చేరి, ధనిక, పేద, పెద్ద, చిన్న అనే తేడాలు లేకుండా ఒకే వరుసలో నిలబడి ప్రార్థన చేయడం సమానత్వానికి ప్రతీక. ప్రార్థన అనంతరం ప్రజలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ‘ఈద్‌ ముబారక్‌’ అని శుభాకాంక్షలు తెలుపుకోవడం పరస్పర ప్రేమను, క్షమాభావాన్ని వ్యక్తపరుస్తుంది.

ఈదుల్‌ ఫిత్ర్‌ తాత్వికంగా కూడా ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. రమజాన్‌ నెలలో మనిషి తనలోని స్వార్థాన్ని తగ్గించి దయ, సహనం, నియంత్రణ వంటి విలువలను పెం΄పొందించుకుంటాడు. ఈ విలువలు కేవలం ఒక నెలకు మాత్రమే పరిమితం కాకుండా జీవితాంతం కొనసాగాలని ఈద్‌ మనకు గుర్తు చేస్తుంది. నిజమైన ఈద్‌ అంటే కేవలం ఒక రోజు సంబరం కాదు; రమజాన్‌ ద్వారా ΄పొందిన ఆధ్యాత్మిక మార్పును జీవితంలో నిలబెట్టుకోవడం.

సామాజికంగా కూడా ఈ పండుగ గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఒకచోట చేరి ఆనందాన్ని పంచుకోవడం ద్వారా బంధాలు మరింత బలపడతాయి. చాలా సందర్భాల్లో సంవత్సరాలుగా కొనసాగుతున్న అపార్థాలు, విభేదాలు కూడా ఈ సందర్భంలో పరిష్కారమవుతాయి. పరస్పరం క్షమించుకోవడం, మళ్లీ దగ్గరవడం ఈ పండుగకు ప్రత్యేకమైన లక్షణం.

నిజమైన ఈద్‌ కొత్త బట్టలు ధరించడంలో కాదు; కొత్త మనసుతో జీవించడంలో ఉంది. ద్వేషం స్థానంలో ప్రేమను, స్వార్థం స్థానంలో దానాన్ని, విభేదాల స్థానంలో ఐక్యతను పెం΄పొందించడమే ఈదుల్‌ ఫిత్ర్‌ అసలు ఆత్మ. ఈ ఆత్మను మన జీవితంలో నిలబెట్టగలిగితేనే ఈ పండుగ ఆధ్యాత్మిక, తాత్విక, సామాజిక సందేశం సార్థకమవుతుంది. దైవం మనందరికీ ఈ పర్వదినం స్ఫూర్తిని అందిపుచ్చుకొనే అవకాశం అనుగ్రహించాలని కోరుకుందాం.

రమజాన్‌ నెల మనిషికి ఒక ఆత్మపరిశీలన సమయం. తన జీవితంలోకి ఒకసారి తొంగిచూసుకుని, తన లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసే కాలం. ఈద్‌ ఆ ప్రయాణానికి ఒక ఆనందకర ముగింపు. అదే సమయంలో ఒక కొత్త సంకల్పానికి ఆరంభం కూడా. ఈదుల్‌ ఫిత్ర్‌ పండుగ కేవలం ముస్లిం సమాజానికి మాత్రమే చెందిన పండుగ కాదు; అది మానవత్వానికి సంబంధించిన పండుగ. ఉపవాసం ద్వారా నేర్చుకున్న నియంత్రణ, దానం ద్వారా పెరిగిన దయాగుణం, ప్రార్థన ద్వారా ΄పొందిన ఆధ్యాత్మిక బలం – ఇవన్నీ కలిసి సమాజంలో ప్రేమ, న్యాయం, సామరస్యం స్థాపించడానికి మార్గం చూపుతాయి. అందుకే ఈ పండుగ మనకిచ్చే అసలు సందేశం ఎంతో సరళం, కానీ చాలా గొప్పది.

– మదీహా అర్జుమంద్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement