
పాపం శ్రీరంగం నారాయణబాబు కవిగా మన మధ్యన నేటికీ నిలిచి ఉన్నాడంటే అదంతా ఆరుద్ర 1972లో రూపకల్పన చేసిన రుధిర జ్యోతి సంకలన ఫలితమే. ఎందరో కవులు సంకలనం రూపం పొందకుండానే వెళ్ళిపోయారు. నేటికీ పోతూనే ఉన్నారు. ఆ ప్రమాదం నుండి తప్పించిన ఆరుద్రను మనం మరిచిపోలేం. ఈ పనిని ఆరుద్ర చేసి ఉండకపోతే కవిగా నారాయణబాబు కాలగర్భంలోనే ఉండిపోయేవారు. లేదా సినారె లాంటి పరిశోధకుల గ్రంథాలకే పరిమితం అయ్యి ఉండేవారేమో.
అసలు విషయం దగ్గరికి వస్తే, శ్రీరంగం నారాయణబాబు మరణించిన తేదీ ఏది? కాలక్రమంలో ఇది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఎవరు నారాయణబాబు గురించి రాసినా ఆయన చివరి తేదీ ఏ ఆధారాలు చూసి వేస్తూ వచ్చారో అంతుపట్టదు. ఆరుద్ర, శ్రీశ్రీలకు గురుతుల్యులైన రోణంకి అప్పలస్వామి 2 అక్టోబర్ 1961న నారాయణబాబు వెళ్లిపోయినట్టు రాశారు. కానీ నారాయణబాబు అంత్యక్రియల్లో పాల్గొన్న ఆరుద్ర తన సమగ్ర ఆంధ్ర సాహిత్యం 13వ సంపుటంలో నారాయణబాబు గురించి రాస్తూ, 2 జనవరి 1965 తేదీ ఇచ్చారు. బహుశా మొన్నటి కవిసంధ్య ముఖచిత్రం మీద ఈ తేదీనే ఇచ్చారు. ఆరుద్రకు, రోణంకి అప్పలస్వామికి నారాయణబాబు మరణించిన తేదీ విషయంలో వచ్చిన తేడా అలా ఉంచితే డాక్టర్ మానేపల్లి 2 అక్టోబర్ 1962 చేర్చారు. ఒక కవి మరణించిన తేదీ గందరగోళంగా తయారైపోతుంటే దీనికి సరైన తేదీని సంపాదించి ముగింపు పలకాలని చేసిన ప్రయత్నం ఇలా ఫలించింది.
ముందుగా ఆరుద్ర ఇచ్చిన తేదీలోని ఆనాటి దినపత్రికలో నారాయణబాబు మరణ వార్త కోసం వెతకటం జరిగింది. కానీ అక్కడ నిరాశే ఎదురైంది. ఇక అప్పలస్వామి ఇచ్చిన తేదీని పరిశీలిస్తే ఆంధ్రపత్రిక డైలీ మరణ వార్తను ధ్రువపరుస్తూ 3 అక్టోబర్ 1961 నాడు ‘నారాయణబాబు మృతి– ప్రముఖ కవి’ అని వార్త వచ్చింది. కనుక ఆ వార్తను ఆధారంగా ఇస్తున్నాను. ఎవరైనా నారాయణబాబు జనన మరణాల తేదీలు చూపాలంటే ఇదే ఆధారంగా పరిగణిస్తారని తలుస్తాను.
సజ్జా వెంకటేశ్వర్లు