
వరి రైతుల కోత అనంతర కష్టాలు తీర్చే ‘సమీకృత శుద్ధి యంత్రా’న్ని ఆవిష్కరించిన కాన్పూర్ ఐఐటీ
ధాన్యం కోసిన తర్వాత తాలు తప్ప, చెత్తా చెదారం తొలగించటం.. తేమను తగ్గించటం వంటి 3 పనులను ఏకకాలంలో చేసే యంత్రం సిద్ధమైంది
పొలాల దగ్గరకే తీసుకెళ్లి ట్రాక్టర్, జనరేటర్‌తో అనుసంధానం చేసి దీన్ని నడుపుకోవచ్చు
రోడ్లపైన ధాన్యం ఆరబెట్టుకోవటం, తేమ ఎక్కువగా ఉంటే ధర నష్టపోవటం వంటి సమస్యలకు ఇక కాలం చెల్లినట్లే!
సకాలంలో వర్షాలు పడి నీరు అందుబాటులో ఉండే వరి ధాన్యం పండించటం ఎంత సులువో.. పండిన ధాన్యాన్ని హార్వెస్టర్ యంత్రంతో కోత కోసి, శుభ్రం చేసి, తేమ తగ్గే వరకు ఎండబెట్టి అమ్మటం అంతకన్నా కష్టంగా మారిందంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో డ్రయ్యింగ్ ప్లాట్‌ఫారాలు తగినన్ని అందుబాటులో లేకపోవటంతో రోడ్లపైనే రైతులు ధాన్యాన్ని రోజుల తరబడి ఆరబెట్టుకోవటం మనకు ప్రతి ఖరీఫ్, రబీ సీజన్ల ముగింపు దశలో కనిపించే కష్టాలే. అయితే, ఈ కోత అనంతర కష్టాలకు చెక్ చెప్పేందుకు దోహదపడే ఒక సమీకృత శుద్ధి యంత్రాన్ని (ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ మెషీన్‌ను) కాన్పూర్ ఐఐటీలోని ఇంక్యుబేషన్ సెంటర్ ‘రుటాగ్’ (రూరల్ టెక్నాలజీ యాక్షన్ గ్రూప్) ఆవిష్కరించింది.
భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర విషయాల సలహాదారు చొరవతో కాన్పూర్ ఐఐటీలో రుటాగ్ ఏర్పాటైంది. ఉన్నత స్థాయి శాస్త్ర, సాంకేతిక పరిశోధనల ద్వారా గ్రామీణ ప్రాంతవాసుల అభ్యున్నతికి దోహదపడే ఆవిష్కరణలకు పూర్తి మద్దతు ఇవ్వటమే లక్ష్యంగా రుటాగ్ పనిచేస్తోంది. మూడు పనుల్ని ఏకకాలంలో చేసే ఈ యంత్రానికి సంబంధించిన సాంకేతికతను కాన్పూర్ ఐఐటీ రుటాగ్ నుంచి పొందిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన టెకోరంగ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ రూ.7.8 లక్షలకు యంత్రాన్ని విక్రయిస్తోంది.
వరి కోత యంత్రం పంటను కోసిన తర్వాత ధాన్యాన్ని ఎత్తి ఈ యంత్రంలోకి పొయ్యాలి. స్టార్ట్ చేసి, క్లీన్ చేసి, వేడి గాలితో ధాన్యంలో తేమను అవసరమైన మేరకు అప్పటికప్పుడు తగ్గించేస్తుంది. ఈ యంత్రాన్ని విద్యుత్‌తో నడపొచ్చు. లేదంటే జనరేటర్, ట్రాక్టర్‌లతో అనుసంధానం చేసి ఉపయోగించుకోవచ్చు. ఈ వెసులుబాటు ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల పొలాల దగ్గరకే తీసుకెళ్లి వాడుకోవచ్చు. ధాన్యాన్ని సులువుగా ఆరబెట్టేసుకొని, నేరుగా విక్రయించుకోవచ్చు లేదా గోదాములకు తరలించవచ్చు. కోత అనంతర పనుల కోసం ప్రత్యేక షెడ్లు వంటివేమీ అవసరం లేదు. రోడ్ల మీద పోసి తేమ తగ్గే వరకు అనేక రోజుల పాటు కష్టపడి ఆరబెట్టుకునే క్రమంలో బాధలు పడే అవసరం ఇక ఉండదు.
పరిశ్రమలను అభివృద్ధి చేయటం, వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించటం, మౌలిక సదుపాయాలు కల్పించటం వంటి 2030 నాటికి సాధించాల్సిన ఐక్యరాజ్యసమితి నిర్దేశిత లక్ష్యాల సాధనకు ఈ సమీకృత శుద్ధి యంత్రం దోహదం చేస్తుంది. తత్ఫలితంగా రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాలతో పాటు అంతిమంగా వినియోగదారులకు సైతం మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
తేమ సమస్యకు పొలాల దగ్గరే పరిష్కారం
తాలు గింజలు తియ్యటానికి, శుద్ధి చేయటానికి, ఆరబెట్టడానికి వేర్వేరు యంత్రాలు వాడుతూ అధిక ఖర్చులకు, అధిక శ్రమకు గురయ్యే రైతులకు ఈ యంత్రం ఎంతో ఊరట కల్పిస్తుంది. ధాన్యం తేమ కొంచెం ఎక్కువ ఉన్నా, శుభ్రంగా లేకపోయినా రైతుకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. ఈ కోత అనంతర కష్టాలకు సమీకృత శుద్ధి యంత్రం ముగింపు పలకనుంది. ఈ యంత్రం విద్యుత్‌తో లేదా జనరేటర్‌తో నడుస్తుంది కాబట్టి ఈ యంత్రం మారుమూల ప్రాంతాల్లో వరి కోతలయ్యే పొలాల దగ్గరకే తీసుకెళ్లి ఉపయోగించుకోవచ్చు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాలు, మార్కెటింగ్ యార్డులు, ధాన్యం సేకరణ చేసే సంస్థలు ఈ సమీకృత ప్రాసెసింగ్ యంత్రాలను కొనుగోలు చేసి అందుబాటులోకి తెస్తే రైతుల వ్యయప్రయాసలు గణనీయంగా తగ్గుతాయి. ఈ యంత్రాన్ని ఉత్పత్తి చేస్తున్న టెకోరంగ్ ఇంజనీరింగ్ కంపెనీ ఇప్పటికే పలువురికి విక్రయించినట్లు తెలిపారు. ఇతర వివరాలకు.. యంత్రం ఉత్పత్తిదారు: anivesh.mech.ism@gmail.com
కాన్పూర్ ఐఐటీ రుటాగ్: jrkumar@iitk.ac.in
ఎలా పనిచేస్తుంది?
ఈ సమీకృత శుద్ధి యంత్రంలో రెండు చాంబర్‌లు ఉంటాయి. మొదటి చాంబర్‌లో పోసిన ధాన్యపు గింజలను జల్లెడ పట్టడానికి 4 మెష్‌లు ఉంటాయి. మొదట ధాన్యంలో నుంచి తాలు గింజలను యంత్రం వేరు చేసి, చెత్తా చెదారాన్ని తొలగించి క్లీన్ చేస్తుంది. ఆ తర్వాత ఇన్సులేటెడ్ చాంబర్‌లో వేడి గాలి ద్వారా ధాన్యంలో తేమను యంత్రం ఆరబెడుతుంది. కాన్పూర్ ఐఐటీ ‘రుటాగ్’కు చెందిన డాక్టర్ అమన్‌దీప్ సింగ్ మాట్లాడుతూ, 230 ఆర్‌పీఎం గల 3హెచ్‌పీ గేర్ మోటారుతో నడిచే 14 అడుగుల పొడవు కన్వేయర్‌ను ఈ యంత్రానికి అమర్చినట్లు చెప్పారు. 4 అడుగుల ఎయిర్ బ్లోయర్ నుంచి వెలువడే వేడి గాలి డెల్టా బాక్స్ డిజైన్ ట్యాంక్ ద్వారా సర్క్యులేట్ అయ్యి ధాన్యాన్ని ఆరబెడుతుందన్నారు.