ఖురాన్‌లో పలు సందర్భాల్లో మొక్కల ప్రస్తావన వస్తుంది. ఆయా మొక్కల నుంచి లభించే ఫలాలు, పత్రాలు, పుష్పాలు మానవాళికి ఎలా ఉపయోగపడుతాయో దైవగ్రంథం, హదీసులు వివరించాయి. అలాంటి వాటిలో ఆలివ్, ఖర్జూర, ద్రాక్ష, దానిమ్మ, అరటి, నల్ల జీలకర్ర, గుమ్మడి వంటివి ముఖ్యమైనవి.
ఆలివ్ : దీని శాస్త్రీయనామం– ఓలియా యురోపియా. ఇది ఓలియేసి కుటుంబానికి చెందినది. దీన్ని అరబిక్ లో జైతున్ అని పిలుస్తారు. ఈ మొక్క గురించి ఖురాన్‌లో ఆరు చోట్ల ప్రస్తావించారు. ఆలివ్ నూనెలో, ఆలివ్ పండ్లలో ఉన్న పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచివి.
ఖర్జూరం : దీని శాస్త్రీయనామం– ఫోనిక్స్ డెక్టైలిఫెరా. ఇది అరికేసి కుటుంబానికి చెందినది. దీన్ని అరబిక్‌లో నఖ్ల్ అని పిలుస్తారు. ఖర్జూరం లో ఉండే ΄పొటాషియం రక్తపోటును నియంత్రించడంలోనూ, కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మలబద్ధక నివారణకు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికీ తోడ్పడుతుంది.
దానిమ్మ : దీని శాస్త్రీయనామం– ప్యూనిక గ్రానేటం. ఇది ప్యూనికేసి కుటుంబానికి చెందినది. అరబిక్‌లో రూమ్మన్ అని పిలుస్తారు. దానిమ్మలో అనేక ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ పని పట్టి వృద్ధా΄్యాన్ని, చర్మంపై ఏర్పడే ముడతలనూ దూరం చేస్తాయి. అల్జీమర్స్, చర్మక్యాన్సర్లను అడ్డుకుంటాయి. ఆస్టియో ఆర్థ్రయిటిస్‌తో బాధపడేవారికిది అద్భుత ఔషధం.
అంజూర : దీని శాస్త్రీయనామం– ఫైకస్ కెరిక. ఇది మొరేసి కుటుంబానికి చెందినది. దీన్ని అరబిక్‌లో తీన్ అని పిలుస్తారు. దీని పండ్లను, వేర్లను, ఆకులను సాంప్రదాయ వైద్యంలో జీర్ణకోశ, శ్వాసకోశ, హృదయ సంబంధ రుగ్మతలు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.
తులసి : దీని శాస్త్రీయ నామం– ఆసిమం టెన్యూ ఫ్లోరమ్. దీనిని అరబిక్‌లో రైహాన్ అంటారు. ఇది లామియేసి కుటుంబానికి చెందినది. తులసి ఆకులు నాడులకు టానిక్‌లా పని చేసి, జ్ఞాపకశక్తిని పెం΄పొందిస్తాయి. తులసి కషాయంతో గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసితో మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. తులసి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోపాటు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది.
ద్రాక్ష : దీని శాస్త్రీయనామం – వైటిస్ వెనిఫెరా. ఇది వైటేసి కుటుంబానికి చెందినది. దీనిని అరబిక్‌లో ఇనబ్ అంటారు. ద్రాక్షగింజల రసం గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది, ఎముకలను బలోపేతం చేస్తుంది, చర్మక్యాన్సర్‌ను నివారించడంలో, ఇన్ ఫెక్షన్ తో పోరాడడంలో సహాయ పడుతుంది.
ఉల్లి : దీని శాస్త్రీయనామం – ఆలియమ్ సెపా. ఇది లిలియేసి కుటుంబానికి చెందినది. ఉల్లిపాయల్లో యాంటీ అలర్జీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు, విటమిన్ ఎ, బి6 , సి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఉల్లిని వాడితే శరీరాన్ని ఇన్ఫెక్షన్ బారి నుంచి కాపాడుకున్నట్లే. మధుమేహం ఉన్నవారికి అది నియంత్రణలోకి వచ్చి.. ఎముకలు గట్టిపడతాయి.
ఆవాలు : దీని శాస్త్రీయనామం– బ్రాసిక నైగ్ర. ఇది బ్రాసికేసి కుటుంబానికి చెందింది. వీటిని అరబిక్‌లో ఖర్దల్ అంటారు. ఆవాలనుంచి తయారు చేసిన ఆవనూనెని కొన్ని సంప్రదాయ చికిత్సలలో ఉపయోగిస్తారు. ఆవ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
మిస్వాక్ : దీని శాస్త్రీయనామం– సాల్వో డోరా పెర్సికా. ఇది సాల్వో డేరేసి కుటుంబానికి చెందినది. దీన్ని అరబిక్‌లో అల్ అరక్ అని పిలుస్తారు. దీని పుల్లలతో దంత ధావనం చేసుకోవడం వల్ల దంతాలు శుభ్రపడి నోటి దుర్వాసన నుంచి విముక్తి లభిస్తుంది. వీటివేర్లను ఊపిరితిత్తుల సమస్యలకు, ఆకులను దగ్గు, ఉబ్బసం, స్కర్వి వ్యాధి నివారణకూ వాడతారు. బెరడును వెన్నుపోటు, తలపోటు, కడుపునొప్పి నివారణలో ఉపయోగిస్తారు.
అరటి : దీని శాస్త్రీయ నామం– మ్యూసా పారడైసియాక. ఇది మ్యూసేసి కుటుంబానికి చెందినది. అరటిని అరబిక్‌లో తల్హ్ అంటారు. అరటిలో ΄పొటాషియం అధికంగా ఉంటుంది. దీనిలో ఉండే పోషకాలు హైబీపీ, షుగర్, ఆస్తమా, క్యాన్సర్, అజీర్తి వంటి సమస్యలను నిరోధిస్తాయి. అరటి పండ్లలోని కార్బోహైడ్రేట్లు జీర్ణక్రియకు ఉపకరిస్తాయి. పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు, ఫ్యాటీ యాసిడ్స్‌ను ఉత్పత్తి చేసేందుకు ఇది తోడ్పడుతుంది.
నల్ల జీలకర్ర : దీని శాస్త్రీయనామం – నైగెల్ల సటివ. దీనిని అరబిక్ లో హబ్బతుస్ సౌదా అంటారు. ఇది రానన్కులేసి కుటుంబానికి చెందినది. నల్ల జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను అదుపులో వుంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
డాక్టర్ ఎల్. నాగిరెడ్డి సహాయ ఆచార్యులు
శ్రీ కృష్ణదేవరాయ ఉద్యాన కళాశాల, అనంతపురం
చాంద్ బాషా, ఉపాధ్యాయులు, తాడిపత్రి


