Neck Pain: మెడనొప్పి బాధిస్తుందా.. అయితే ఇలా చేయండి

Precautions And Measures To Avoid Neck Pain - Sakshi

ఇటీవలి కాలంలో మెడనొప్పి సమస్య చాలా మందిని వేధిస్తోంది. మెడనొప్పి ఉంటే ఏ పనులూ సరిగ్గా చేయలేం. ఈ మెడనొప్పికి కారణాలు చాలానే ఉన్నాయి. ముందుగా కారణాన్ని తెలుసుకుని, అందుకు తగ్గ చికిత్సను తీసుకుంటే మెడ నొప్పిని సులువుగా తగ్గించుకోవచ్చు.  ఆఫీసులో లేదా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో ఉన్న వారు గంటల తరబడి కూర్చుని లాప్‌టాప్‌  లేదా కంప్యూటర్‌ మీద పనిచేయడం వల్ల మెడనొప్పి వస్తుంది. సాధారణంగా మనం కూర్చునే విధానం సరిగ్గా లేకుంటేనే మెడ నొప్పి వస్తుంది. చిన్న సమస్యే అని తేలిగ్గా తీసేస్తే సమస్య మరింత పెద్దదయ్యే ప్రమాదం ఉంది.

మెడ నొప్పికి  కారణాలు:
సరిగ్గా కూర్చోకపోవడం: 
కంప్యూటర్‌ లేదా స్మార్ట్‌ ఫోన్‌ లను ఎక్కువ సేపు ఉపయోగించేటప్పుడు సరిగ్గా కూర్చోకపోవడం వల్ల దీనివల్ల కండరాలకు ఒత్తిడి కలుగుతుంది. మంచం మీద పడుకుని లేదా కూర్చొని చదవడం వల్ల కూడా ఒత్తిడికి దారితీస్తాయి. ఇది మెడనొప్పికి కారణమవుతుంది. 


గాయాలు:
తల అకస్మాత్తుగా  వెనుకకు, తరువాత ముందుకు కదిలినప్పుడు, నరాలు ఒత్తుకుపోవడం... వల్ల కూడా  మెడనొప్పి  వస్తుంది.
కీళ్ళు అరిగిపోవడం: 
శరీరంలోని ఇతర కీళ్ళ మాదిరిగానే మెడ కీళ్లు కూడా వయస్సు వచ్చే కొద్దీ అరుగుతాయి. ఈ అరుగుదల వల్ల మెడ కదలికలు ప్రభావితం అవుతాయి. దీనివల్ల మెడనొప్పి వస్తుంది.  

► అయితే కొన్ని చిట్కాలను అనుసరించడం వల్ల ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. అవేంటంటే..

మెడ నొప్పిని తగ్గించే చిట్కాలు
సరైన భంగిమ: కూర్చున్నప్పుడు లేదా నిలబడినప్పుడు భుజాలు తుంటిపై సమానమైన వాలులో ఉన్నాయని నిర్ధారించుకోండి. అలాగే మీ చెవులు నేరుగా మీ భుజాలకు సమకోణంలో ఉండేట్టు చూసుకోవాలి. సెల్‌ ఫోన్లు, టాబ్లెట్లు లేదా ఇతర చిన్న స్క్రీన్లు వంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను ఉపయోగిస్తున్నప్పుడు మెడను వంచకూడదు. అలా వంచకూడదంటే ఈ వస్తువులు మీ తలకు అనుగుణంగా కాస్త ఎత్తులో పెట్టాలి. అలాగే మీ వర్క్‌ టేబుల్, కంప్యూటర్, కుర్చీని సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. 

విరామం అవసరం: ఎక్కువసేపు డ్రైవ్‌ చేయాల్సి వచ్చినా.. లేదా స్క్రీన్‌ ముందు గంటల తరబడి పనిచేయాల్సి వచ్చినా.. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. ముఖ్యంగా మెడను, భుజాలను బాగా కదిలించండి. అలాగే మీ శరీరాన్ని సాగదీయండి. 
భుజాలపై ఎక్కువ బరువును వేయద్దు: మీ భుజాలు, చేతులపై ఎక్కువ బరువుండే బ్యాక్‌ ప్యాక్‌ లను మోయకండి. ఎందుకంటే ఇవి మీ భుజాలపై ఒత్తిడిని కలిగిస్తాయి. తద్వారా. మెడ నొప్పి వస్తుంది. 

సౌకర్యంగా పడుకోవాలి: మీ తల, మెడ.. మీ శరీరంలోని మిగిలిన భాగాలకు అనుగుణంగా ఉండాలి. మీ తలకింద పెద్ద సైజు దిళ్లను అసలే ఉపయోగించకండి. దిండు లేకుండా ఉండలేమనుకుంటే చిన్న దిండును మాత్రమే ఉపయోగించండి. కాళ్ల కింద దిండును వేసుకుంటే మంచిది. దీనివల్ల  వెన్నెముక కండరాలు రిలాక్స్‌ అవుతాయి. 

జీవనశైలిలో మార్పులు: ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవద్దు. ఎక్కువగా తిరగండి. నడవండి. ధూమపానం అలవాటుంటే వెంటనే మానుకోండి. ఎందుకంటే ఇది మెడ నొప్పి వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

స్ట్రెచింగ్‌ ఎక్సర్‌సైజులు: ఇంటి నుంచి పనిచేయడం లేదా ల్యాప్‌ టాప్‌ల ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల మెడ నొప్పి వస్తుంది. అయితే శరీరాన్ని సాగదీసే స్ట్రెచింగ్‌ వ్యాయామాల వల్ల మెడనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా వైద్యులు లేదా ఫిజియో థెరపిస్టులు చెప్పే కొన్ని చిట్కాలను అనుసరించడం వల్ల మెడనొప్పి తొందరగా తగ్గుతుంది.  

కాపడం: మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి, వాపు లేదా మంటను తగ్గించడానికి చల్లని లేదా హీట్‌ కంప్రెస్‌ రెండింటినీ ఉపయోగించొచ్చు. ఇది కండరాల సడలింపునకు సహాయపడుతుంది. నొప్పిని తగ్గిస్తుంది. అయితే ఈ టెక్నిక్‌ ను 20 నిమిషాల కంటే ఎక్కువ సార్లు ఉపయోగించకూడదు. 
మసాజ్‌: మెడ నొప్పికి మసాజ్‌ థెరపీ వల్ల కండరాలను సడలించవచ్చు. తీవ్రమైన మెడ నొప్పిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అలాగే ఇది రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి లక్షణాలను తగ్గిస్తుంది.  

మెడనొప్పి తగ్గడానికి నొప్పి నివారణ మందులు ఉంటాయి. అయితే అలా మందులు వాడటం వల్ల సైడ్‌ ఎఫెక్టులు తప్పవు. అందువల్ల మందులకు బదులు కొన్ని నొప్పి నివారణ చర్యలు, ఉపశమన చర్యలను పాటించడం మంచిది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top