సర్వోన్నతుడే దీనుడై దిగివచ్చిన క్రిస్మస్‌

Prabhu Kiran Special Article On Christmas - Sakshi

సువార్త 

ఆది నుండీ ఉన్న యేసుక్రీస్తు అనే ’జీవవాక్యాన్ని’ తాము చెవులారా విన్నామని, ఆయన్ను కళ్లారా చూశామని, మూడున్నరేళ్ళపాటు ఆయన్ను నిదానించి అనుభవించామని, తమ చేతులతో ఆయన్ను తాకామని ఆయన శిష్యుడైన యోహాను ప్రభువుతో ఉన్న తన అనుబంధాన్ని తన పత్రికలో అత్యద్భుతంగా వర్ణించాడు(1 యోహాను 1:1). కారు, ఇల్లు, టివి, కుర్చీలు, సోఫాలుఇలాంటి విలువైన వస్తువులన్నీ పాతబడిపోతాయి. కానీ తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళతో ఉన్న సజీవమైన అనుబంధాలు మాత్రం పాతబడవు. ఇక దేవునితో ఉండే బాంధవ్యమైతే అసలు పాతబడేదికాదు కదా, అది నిత్యనూతనమైనదని యోహాను అంటాడు. అందుకే యోహాను యేసుకు ’జీవవాక్యం’ అనే బిరుదుని చ్చాడు. పౌలు స్థాపించిన ఎఫెసీ అనే గొప్ప చర్చికి యోహాను చాలాకాలం పాస్టర్‌ గా ఉన్నాడు. ఆ చర్చిలో గ్నోస్టిక్స్‌ అంటే, విశ్వాసం కన్నా దేవుని గూర్చిన జ్ఞానం చాలా గొప్పదని వాదించే ‘మహాజ్ఞానులతో’ ఆయన చాలా సమస్యలనెదుర్కొన్నాడు.

తాను మనిషికి అర్ధమై అతనితో కలిసి పోయేందుకు వీలుగా, అత్యంత సామాన్యుడు, నిరాడంబరుడైన వ్యక్తిగా ఈ లోకానికి దిగివచ్చి, అందరిలాగా ‘నేను పరిచారం చేయించుకోవడానికి కాదు, పరిచారం చెయ్యడానికి వచ్చిన దాసుడినని’ యేసుప్రభువే ప్రకటించుకుంటే(మత్తయి 20:28), దేవుడు నరుడు, దాసుడు కావడమేమిటి? లాంటి ‘అతిభక్తిపూర్వక’ ప్రశ్నలు లేవెనెత్తి, తన జీవనశైలిద్వారా ఆయన నిరూపించుకున్న అత్యున్నతమైన మానవీయ విలువలను కాక, ఆయనకు ఎలాగూ ఉన్న దైవత్వాన్ని మాత్రమే విశ్వసించడానికి, ప్రకటించడానికి పూనుకున్న ఆ ‘జ్ఞానుల’ వాదనలను యోహాను తన స్వీయానుభవపూర్వకమైన ఈ విశ్వాస ప్రకటన ద్వారా నిర్వీర్యం చేశాడు. దేవుడే తగ్గాడంటే, తాము కూడా తగ్గాల్సి వస్తుందని జంకే బాపతువాళ్ళు ‘ఈ జ్ఞానులు’. అందుకే  ఆయన పరలోకంలో ఉండే దేవుడు మాత్రమే కాదు, ఈ లోకంలో తాను తాకిన, చూసిన, విన్న, అనుభవించిన దేవుడు అంటాడు యోహాను.  

తాను పరలోకాధిపతి అయి ఉండి కూడా, ఈ లోకంలోని సాధారణ మనుషులు తనను విని, చూసి, తాకి, తనతో సహవసించడానికి వీలుగా, వారిలో ఒకడిగా జీవించేందుకు గాను మనకు తోడుగా ఉండే’ ఇమ్మానుయేలు’ దేవుడుగా ప్రభువు దిగి వచ్చిన సందర్భమే క్రిస్మస్‌’ సంబరం, సంరంభం. దేవుడే మనిషిగా దిగిరాగా, మనిషి మాత్రం లేనిపోని డాంబికాలకు పోయి తనను తాను దేవునికన్నా గొప్పవాడిగా ఉహించుకొంటూ, కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాల పేరిట తోటి మనుషులను దూరంగా పెట్టడం ఎంత ‘అమానవీయమో’ తెలిపే సందర్భమే క్రిస్మస్‌. దేవుడే దీనుడై యేసుక్రీస్తుగా దిగివచ్చి మానవాళికి దీనత్వాన్ని ప్రబోధించాడు. తనను తాను తగ్గించుకోవడం అనే ‘దీనత్వం’ సర్వోత్కృష్టమైన మానవ ధర్మమని, దేవుడు అహంకారాన్ని ఏవగించుకొని దీనులను ఆదరిస్తాడని ‘బైబిల్‌’ చెబుతోంది. మానవాళి దీనత్వాన్ని అలవర్చుకోవాలన్నదే క్రిస్మస్‌ ఇచ్చే నిరంతర సందేశం!!    – రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top