ఫ్రెండ్స్, ఈరోజు మదర్స్ డే కదా. మరి అమ్మకు ఏం గిఫ్ట్ ఇస్తున్నారు? నిజానికి అమ్మకు అసలు సిసలు గిఫ్ట్ ఏమిటో తెలుసా? ఆమె చెప్పిన మాటను పాటించడం. అలా పాటిస్తే... మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎంతోమంది గొప్ప వ్యక్తులు అమ్మ మాటను విజయానికి బాటగా చేసుకున్నారు. ‘అమ్మ నా వెనుక ఉంది’ అనుకుంటే వారికి ఎంతో బలంగా ఉండేది. ‘అమ్మ నాతో ఉంది’ అనుకుంటే ఎంతో సందడిగా, సంతోషంగా ఉండేది. ‘అమ్మ ఆశీర్వచనం ఉంది’ అని గుర్తు తెచ్చుకుంటే ఆత్మవిశ్వాసం పెరిగేది. విజయం చేరువయ్యేది. ఎందరో మహానుభావులు... అందరికి వెనుక అమ్మ ఉంది...
నా ప్రపంచం అమ్మకు మాత్రమే తెలుసు!
ప్రఖ్యాత శా్రçస్తవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పుస్తకంలో తన తల్లి గురించి ఇలా కవితాత్మకంగా రాశారు...
‘నాకు పదేళ్ల వయసున్న ఆరోజు ఇంకా గుర్తుంది
అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అసూయపడేలా....
నీ ఒడిలో నిద్రిస్తున్నప్పటి సంగతి. అది ΄పౌర్ణమి రాత్రి.
నా ప్రపంచం నీకు మాత్రమే తెలుసు అమ్మా... నా అమ్మా!
అర్ధరాత్రి, నా మోకాళ్లపై కన్నీళ్లు జారుతుండగా... నేను మేల్కొన్నప్పుడు...
నీ బిడ్డ బాధ నీకు తెలుసు, నా అమ్మా
నీ శ్రద్ధగల హస్తాలు నా బాధను సున్నితంగా తుడిచివేశాయి
నీ ప్రేమ, విశ్వాసం, శ్రద్ధ నాకు బలాన్ని ఇచ్చాయి.
అమ్మకు ఇచ్చిన మాట
గాంధీజీ లా చదవడం కోసం ఇంగ్లాండ్‌కు ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు తోటి ప్రయాణికుడైన ఆంగ్లేయుడు పరిచయం అయ్యాడు. కొన్ని మాటల తరువాత మాంసం ప్రస్తావన వచ్చింది.
‘నేను తినను’ అని చెప్పారు గాంధీజీ
‘ఇంగ్లాండ్‌లో ఎంతో చలిగా ఉంటుంది. అక్కడ మాంసం లేకుండా బతకడం అసాధ్యం’ అన్నాడు ఆంగ్లేయుడు.
‘అక్కడి ప్రజలు మాంసం లేకుండా కూడా జీవించగలరని విన్నాను’ అన్నారు గాంధీజీ.
‘పచ్చి అబద్ధం. మాంసం తినకుండా అక్కడ జీవించడం అసాధ్యం. అది లేకుండా మీరు జీవించలేరు’ అన్నాడు ఆంగ్లేయుడు.
‘మీ సలహాకు థ్యాంక్స్. కాని నేను మా అమ్మకు మాంసం తినను అని మాట ఇచ్చాను. ఒకవేళ అది లేకుండా జీవించడం అసాధ్యం అని తేలితే నేను భారతదేశానికి తిరిగి వెళ్లడానికి ఇష్టపడతాను’ అన్నారు గాంధీజీ.
తియ్యటి ఆ పిలుపు ఎప్పుడూ గుర్తుంటుంది!
సచిన్ తెందూల్కర్ తల్లి పేరు...రజని.
‘ఆమె ప్రోత్సాహం, ప్రార్థనలు నాకు వెన్నుదన్నుగా ఉన్నాయి. అమ్మ నా బలం’ అనేవారు సచిన్.
చిన్నప్పుడు సచిన్ క్రికెట్ ఆడుతున్నప్పుడు...
‘సచిన్... సచిన్’అంటూ పిలిచేవారు రజని.
‘సచిన్... సచిన్ అనే అమ్మ పిలుపు తీయగా ఉంటుంది. అది ఎప్పుడూ గుర్తుండిపోతుంది’ అంటారు సచిన్.
‘ప్రతి తల్లి తన బిడ్డ ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే కోరుకుంటుంది. సచిన్ విషయంలో నేను కూడా అంతే’ అనేవారు రజని.


