చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం..! హీరో నాగార్జున సైతం | Millets: Forgotten Grains with Potential Health Benefits | Sakshi
Sakshi News home page

చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం..! హీరో నాగార్జున సైతం

May 5 2026 11:56 PM | Updated on May 5 2026 11:56 PM

Millets: Forgotten Grains with Potential Health Benefits

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో మిల్లెట్ మార్వెల్స్ ఆధ్వర్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్), న్యూట్రీహబ్ సహకారంతో 'రోజుకు ఒక పూట చిరు ధాన్యాల భోజనం' జాతీయ మిషన్‌ను రాజేంద్రనగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ లో‌ తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. దీని ద్వారా చిరు ధాన్యాల వినియోగంపై ప్రజలలో అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవనశైలికి దారితీసే ఉద్యమంగా రూపుదిద్దడం లక్ష్యం. 

ఈ మిషన్‌కు ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున మద్దతు తెలిపారు. ఆయన ఒక వీడియో సందేశం ద్వారా రోజు వారీ ఆహారంలో చిరు ధాన్యాలను చేర్చాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన భారత నిర్మాణానికి దోహదపడే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్డిన మిల్లెట్ మార్వెల్స్‌ను అభినందించారు. ప్రతి వ్యక్తి ప్రతి ఇంట్లో మిల్లెట్ల వినియోగాన్ని పెంచాలని ఈ వినూత్న కార్యక్రమం పిలుపునిస్తోంది. ఇది భారతదేశ పోషకాహార రంగాన్ని మార్చే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి అనుగుణంగా దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడానికి రూపొందించబడింది. 

ఈ సందర్భంగా ప్రతిరోజూ ఒక మిల్లెట్ ఆధారిత భోజనాన్ని తమ ఆహారంలో చేర్చుకోవాలని, మిల్లెట్ల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని, మరో ముగ్గురిని ఈ ఉద్యమంలో భాగస్వాములను చేయాలని ప్రతిజ్ఞ చేశారు. చైన్ పద్ధతిలో జరిగే ప్రచారం ద్వారా ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించి, తరువాత అంతర్జాతీయ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన లోక్‌సభ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు కూడా మద్దతు తెలిపారు.

మిల్లెట్ మార్వెల్స్ 
'మిల్లెట్ మార్వెల్స్'ను 2020లో సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్టు, సినీ నటుడు డాక్టర్ భరత్ రెడ్డి స్థాపించారు. చిరుధాన్యాలతో తయారైన ఆహారపు ఉత్పత్తులను రుచికరంగా, అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో ఈ స్టార్ట్అప్ ప్రారంభమైంది. భారతీయ మార్కెట్‌లో మంచి అవకాశాలను సొంతం చేసుకుంటోంది. డాక్టర్ సంగీతా రెడ్డి (జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, అపోలో హాస్పిటల్స్) కృషితో మిల్లెట్ మార్వెల్స్ ను పునరుద్ధరించారు. నూతన ఉత్సాహంతో తిరిగి అభివృద్ధి చేశారు. 

హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో ఇన్‌పేషెంట్లకు ఆరోగ్యకరమైన మిల్లెట్ ఆహారాన్ని అందించడంపై దృష్టి సారిస్తూ ఈ సంస్థను మళ్లీ బ్రాండింగ్ చేశారు. దేశంలో ఇలాంటి చర్యలు చేపట్టిన తొలి హాస్పటల్ గా అపోలో నిలిచింది. ఈ కార్యక్రమానికి రోగులు, వారి కుటుంబ సభ్యుల నుంచి మంచి స్పందన లభించింది. అపోలో హాస్పిటల్స్ నెట్‌వర్క్‌లోని ఇతర హాస్పిటల్స్ లో కూడా విస్తరించేందుకు మిల్లెట్ మార్వెల్స్ సిద్ధమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement