పింక్‌ ప్రొటెక్షన్‌ ‘సర్వే’యలెన్స్‌ చెక్‌ చేస్తారు... చెక్‌ పెడతారు

Kerala Police launch Pink project for women safety - Sakshi

జ్వరాలు ఉన్నాయేమోనని ఇంటింటి సర్వే చేయడం తెలుసు. కాని ఇక మీదట కేరళలో గృహ హింస జరుగుతున్నదా అని ఇంటింటినీ చెక్‌ చేస్తారు. కాలేజీల దగ్గర పోకిరీల పని పడతారు. కట్నం మాటెత్తితే లోపల వేస్తారు. సోషల్‌ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్స్‌ చేస్తే చిప్పకూడు తినిపిస్తారు. స్త్రీలకు విరోధులుగా మారిన పురుషులకు గుణపాఠం చెప్పడానికి కేరళ ప్రభుత్వం సోమవారం ‘పింక్‌ ప్రొటెక్షన్‌ ప్రాజెక్ట్‌’ ప్రారంభించింది. ఆ వివరాలు...

పోలీస్‌ వెహికిల్‌ అంటే మగ డ్రైవర్, మగ ఇన్‌స్పెక్టర్, మగ కానిస్టేబుల్స్‌... ఇలాగే ఉంటుంది అన్ని చోట్లా. కాని కేరళలో ఇక మీదట ‘పింక్‌’ కార్లు కూడా కనిపిస్తాయి. లేడీ డ్రైవర్, లేడీ ఇన్‌స్పెక్టర్, లేడీ కానిస్టేబుల్స్‌.... వీళ్లే ఉంటారు. ఈ పింక్‌ కార్లు రోడ్ల మీద తిరుగుతుంటాయి. తమ కోసం ఈ వాహనాలు రక్షణకు పరిగెత్తుకొని వస్తాయి అనే నమ్మకాన్ని స్త్రీలకు ఇస్తాయి. కేరళలో ఇటీవల గృహ హింస కేసులు, వరకట్న చావులు మితి మీరాయి. ఇప్పటికే అక్కడ స్త్రీల రక్షణకు వివిధ మహిళా పోలీసు దళాలు విధుల్లో ఉన్నా సోమవారం (జూలై 19) ‘పింక్‌ ప్రొటెక్షన్‌ ప్రాజెక్ట్‌’ పేరుతో అక్కడి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ దృఢమైన సందేశం ఇచ్చేలా కొత్త దళాలను తిరువనంతపురంలో ప్రారంభించారు.

మూడు సంరక్షణలు
స్త్రీలకు మూడుచోట్ల భద్రత కల్పించాలని కేరళ ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలిచ్చింది. ఒకటి పబ్లిక్‌ ప్లేసుల్లో (రోడ్లు, పార్కులు, బస్‌స్టాప్‌లు..), రెండు ప్రయివేటు ప్లేసుల్లో (నివాస గృహాలు, హాస్టళ్లు...), మూడు సోషల్‌ మీడియాలో (ఫేస్‌బుక్, ట్విటర్‌..)... ఈ మూడు చోట్ల స్త్రీలకు ఏ మాత్రం అసౌకర్యం జరగడానికి వీల్లేకుండా ‘పింక్‌ ప్రొటెక్షన్‌’ కింద మహిళా దళాలు అలాగే పురుష దళాలు పరస్పర సహకారంతో పని చేయాలని అక్కడ చర్యలు మొదలయ్యాయి.

ఇంటికి వచ్చే ‘పింక్‌ జనమైత్రి’
గృహ హింస, వరకట్న వేధింపులకు చెక్‌ పెట్టడానికి కేరళలో మొదలెడుతున్న వినూత్న రక్షణ చర్య ‘పింక్‌ జనమైత్రి’. సాధారణంగా ఇళ్లల్లో గృహ హింస జరుగుతూ ఉన్నా, వరకట్న వేధింపు జరుగుతూ ఉన్నా అది ఆ ఇంటికి, ఇరుగు పొరుగు వారికీ తెలుస్తూ ఉంటుంది తప్ప స్టేషన్‌ వరకూ చేరదు. అనేక కారణాల వల్ల, చట్టం సహాయం తీసుకోవచ్చని స్త్రీలకు తెలియకపోవడం వల్ల పోలీసులకు ఈ వేధింపు తెలియదు. అది దృష్టిలో పెట్టుకుని కేరళలోని ప్రతి జిల్లాలోని ప్రతి ఊళ్లోని పంచాయితీ సభ్యులతో ‘పింక్‌ జనమైత్రి’ కార్యక్రమం కింద మహిళా పోలీసులు ‘టచ్‌’లో ఉంటారు.

ఊళ్లో ఏ ఇంట్లో అయినా స్త్రీలపై హింస జరుగుతుందా ఆరా తీస్తారు. అలాగే ఇంటింటిని సర్వే చేస్తూ ఆ ఇంటి మహిళలతో మాట్లాడతారు. మహిళలు విషయం దాచాలనుకున్నా వారి వొంటి మీద దెబ్బపడి ఉంటే ఆ దెబ్బ పెద్ద సాక్ష్యంగా నిలిచే అవకాశం ఉంది. దాంతో ఆ హింసకు పాల్పడిన కుటుంబ సభ్యులపై చర్యలు ఉంటాయి. ముఖ్యంగా ఇది వరకట్న వేధింపులు ఎదుర్కొనే కోడళ్లకు పెద్ద తోడు అయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రులను కూడా ఇంట్లో అడుగుపెట్టనీకుండా కోడళ్లను రాచి రంపాన పెట్టే భర్త, అత్తామామలు ఉంటారు. కాని పోలీసులను రావద్దు అనడానికి లేదు. కోడలు నోరు విప్పి ఏం చెప్పినా అంతే సంగతులు.

పింక్‌ షాడో పెట్రోల్, పింక్‌ రోమియో
కేరళలో స్త్రీలకు నీడలా ఉంటూ వేధించే పురుషులకు సింహ స్వప్నంగా నిలిచేదే ‘పింక్‌ షాడో పెట్రోల్‌’. ఇందుకోసమే పింక్‌ వెహికిల్స్‌ను అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్లు పూర్తిగా మహిళా పోలీసులతో తిరుగుతాయి. ‘మా వెహికిల్‌ వస్తుంటే అల్లరి వెధవలు తోక ముడిచి పారిపోతున్నారు’ అని ఆ వెహికల్స్‌లో విధి నిర్వహిస్తున్న ఒక మహిళా ఇన్‌స్పెక్టర్‌ చెప్పింది. ‘అమాయక యువతులకు మాయమాటలు చెప్పి పార్కులకు సినిమాలకు తిరిగే మేక వన్నె పులులు కూడా ఇప్పుడు మా బండ్లు ఎక్కడ పసి గడతాయోనని ఒళ్లు దగ్గర పెట్టుకుంటున్నారు.’ అని కూడా ఆమె అంది.

పింక్‌ షాడో పెట్రోల్‌ మొదలయ్యాక కేరళలో బీచ్‌ల వద్ద జరిగే క్రైమ్‌ బాగా తగ్గింది. ఇక ఆడపిల్లలను సిటీ బస్సుల్లో, కాలేజీల దగ్గర, స్కూళ్ల దగ్గర అల్లరి పెట్టేవారి భరతం పట్టడానికే ‘పింక్‌ రోమియో’ మహిళా పోలీసు దళం పని చేస్తుంది. వీరికి బుల్లెట్లు, సైకిళ్లు కూడా పోలీసు శాఖ సమకూర్చింది. పింక్‌ హెల్మెట్లతో వీరు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకూ విధులలో ఉంటారు. అలాగే 24 గంటలూ అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్‌ నంబర్‌ కూడా ఉంటుంది.

భావజాలం మారాలి

‘ఎన్ని దళాలు ఎన్ని విధాలుగా పని చేసినా అవి దుర్మార్గ పురుషులను నియంత్రించొచ్చుగాని వారిని పూర్తిగా మార్చలేవు. మారాల్సింది పురుషులే. తమకు తాముగా వారు స్త్రీల పట్ల ఎలా వ్యవహరించాలో వారిని ఎంత గౌరవించాలో తెలుసుకోవాలి. అప్పుడే అత్యాచారాలు, హింస, వేధింపులు ఆగుతాయి’ అని పింక్‌ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న ఒక మహిళా ఆఫీసర్‌ అన్నారు.
అవును. అబ్బాయిలకు హైస్కూలు వయసు నుంచే ఇంట్లో, బయట స్త్రీలతో ఎలా వ్యవహరించాలో నేర్పించాల్సిన బాధ్యత కుటుంబానికి ఉంది. వారిని జెండర్‌ సెన్సిటైజ్‌ చేయాల్సిన బాధ్యత విద్యా వ్యవస్థకు ఉంది. ఈ రెండు చోట్ల పురుష భావజాలం సంస్కరింపబడిన నాడు పింక్‌ ప్రొటెక్షన్‌ అవసరమే ఉండదు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top