హౌస్‌ మెయిడ్‌ నుంచి అసెంబ్లీకి... | Kalita Majhi Scripts Inspiring Victory in West Bengal | Sakshi
Sakshi News home page

హౌస్‌ మెయిడ్‌ నుంచి అసెంబ్లీకి...

May 6 2026 2:39 AM | Updated on May 6 2026 2:39 AM

Kalita Majhi Scripts Inspiring Victory in West Bengal

సమాజంలో పెద్దగా పలుకుబడి లేదు... హోరెత్తించే ప్రచారాలూ లేవు.. ఆర్భాటాలూ లేవు.. ప్రతిపక్షాన్ని ఆరోపణలతో ఎండగట్టిందీ లేదు.. ఆర్థికంగానూ అంతంత మాత్రమే... నాలుగిండ్లల్లో పనిచేసుకుంటేనే నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లే పరిస్థితి.. అయినా నేడు తాను ఎమ్మెల్యేగా గెలిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆమే బెంగాల్‌కు చెందిన ఓ సాధారణ మహిళ కలితా మాఝీ తాను ప్రతి రోజూ ఎదుర్కొంటున్న సమస్యల్నే ప్రజల ముందుంచి.. వాటి వాటి పరిష్కారం కోసం పనిచేయడమే తన ముందున్న కర్తవ్యమంటూ తన విజయానికి బాటలు పరచుకొంది.

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అద్భుతమైన గెలుపు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇళ్లలో పనిమనిషిగా పనిచేసే కలితా మాఝీ, ఇప్పుడు ఆస్‌గ్రామ్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యింది. ఆస్‌గ్రామ్‌ స్థానంలో కలితా మాఝీకి 1,07,692 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి శ్యామ ప్రసన్న లోహర్‌పై 12,535 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు.

జీవితమంతా కష్టాలే...
తూర్పు బర్దామన్‌ జిల్లాలోని గుస్కరా మున్సిపాలిటీ నివాసి అయిన కలితా మాఝీ ప్రయాణం కటిక పేదరికం నుంచి మొదలైంది. ఏడుగురు అక్కాచెల్లెళ్లు, ఒక సోదరుడు ఉన్న పెద్ద కుటుంబం ఆమెది. తండ్రి దినసరి కూలీ కావడంతో చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. వివాహం తరువాత కూడా ఆమె ఆర్థిక పరిస్థితిలో మార్పు రాలేదు. కలితా భర్త ప్లంబర్‌. అందువల్ల ఆమె గత రెండు దశాబ్దాలుగా పలు ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ.. నెలకు రూ. 4,500 సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమెకు ఒక కుమారుడు.

2021లో ఓటమి
కలితా మాఝీ రాజకీయ ప్రయాణం రాత్రికి రాత్రి మొదలైంది కాదు. దాదాపు పదేళ్ల పాటు ఆమె ఓ సాధారణ కార్యకర్తగా కష్టపడింది. గతంలో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేశారు. అప్పుడు టీఎంసీ అభ్యర్థి అభేదానంద థండర్‌ చేతిలో 11,815 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ 41 శాతం ఓట్లు సాధించి అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే ఇపుడు మరోసారి ఆమె పార్టీ టికెట్‌ను పొందేలా చేస్తే.. ప్రజలతో ఆమెకున్న అనుబంధం భారీ విజయాన్ని సాధించిపెట్టింది.

సమస్యలే ప్రచార అస్త్రాలు
భారీ బహిరంగ సభలు, ఆర్భాటాలు లేకుండా కలితా మాఝీ ప్రచారం సాగింది. తాను అనుభవించిన కష్టాలనే ఓటర్ల ముందుంచింది. వైద్యంకోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన దుస్థితి, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, తాగునీటి ఎద్దడి, మహిళల భద్రత వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. కేవలం ప్రభుత్వ పథకాలపై ఆధారపడటం కాకుండా, ప్రజలకు ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆమె గళం విప్పింది. అవినీతిపై ఆమె చేసిన సూటి విమర్శలు ఓటర్లను ఆకట్టుకున్నాయి.

అదే ఉత్సాహంతో...
నన్ను అభ్యర్థిగా ప్రకటించినప్పుడు, నేను రెండు ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ  నెలకు రూ. 4,500 సంపాదిస్తున్నాను. నేను పని చేసుకోవడానికి వీలుగా నా అత్తగారు ఇంట్లో వంట పనుల్లో సహాయం చేసేవారు. నేను ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి పనులకు వెళ్లేదాన్ని. ఇప్పుడు ప్రజల కోసం కూడా పనిచేయడానికి అదే ఉత్సాహంతో సిద్ధంగా ఉన్నాను.ప్రాథమిక సౌకర్యాల మెరుగుదలే నా లక్ష్యం.  – కలితా మాఝీ

Advertisement
 
Advertisement
Advertisement