జ్ఞాన శంఖం 'పూరి'ద్దాం! | Interesting Funny Story About Breakfast Poori Recipe | Sakshi
Sakshi News home page

జ్ఞాన శంఖం 'పూరి'ద్దాం!

May 8 2026 5:15 PM | Updated on May 8 2026 6:51 PM

 Interesting Funny Story About Breakfast Poori Recipe

‘‘కంగారూ అంటూ దానికా పేరెందుకు పెట్టారం’టే ‘‘సింపుల్‌.. అది కంగారుపడుతూ ఉండే జంతువు కాబట్టి’’ అనగలడు మా రాంబాబు గాడు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే...

సరిగ్గా మా రాంబాబుగాడు పూరీ తింటున్న టైమ్‌కు వెళ్లి బుక్కయియాన్నేను. ‘లోకాస్సమస్త పూరీ తినంతు... నువ్వు కూడా పూరీ తిందువుగానీ రారా... ’ అంటూ ఆనంమాయంగా డైనింగ్‌ టేబుల్‌ దగ్గరికి పిలిచాడు మా రాంబాబుగాడు. ‘‘ఆ కొటేషన్‌కు అర్థమేంట్రా?’’ అడిగా. 

‘‘లోకాలన్నింటికీ పూరీ తినే అదృష్టం దక్కుగాక! ఎందుకంటే పూరీ అనేది ఓ అద్భుతమైన తినుబండారం. దాని బండారం బట్టబయలైతే... బోల్డన్ని లైఫ్‌ లెసన్స్‌ చెబుతుందది’’ గ్యాపులేకుండా మరో కొటేషన్‌ విసరనే విసిరాడు. 
‘‘పూరీ లైఫ్‌ లెసన్స్‌ చెప్పడమేంట్రా?’’ 

‘‘సరిగ్గా చూడు. పెనం మీదికి చపాతి ఠపీమంటూ మళ్లీ లేవకుండా పడిపోతుంది. కానీ మన పూరీ...?! సిమ్మింగ్‌పూల్లోకి డైవ్‌ కొట్టినంత చలాగ్గా చులాగ్గా ఏటవాలుగా నూనెలోకి ఇలా మునుగుతుందా... అంతలోనే ఆ తైలం తాలూకు నునుపైన అలల మీద అలా అలా తేలియాడుతూ మూకుడులో ‘లాహిరి లాహిరి లాహిరిలో’ పాడుతూ ‘పూరీ విహారం’ చేస్తుంది. 

అంటే ఏమిటర్థం? చపాతీలా చతికిలపడిపోకూడదూ... చుట్టూ కష్టాల నూనెసాగరం ఉన్నా సరే... పూరీలా తేలి పైకిరావాలీ! పిండి గోధుమరంగులో ఉన్నా... నూనెలో తనను కాల్చేస్తున్నా, మాడ్చేస్తున్నా తనను తాను మెరుగుపెట్టుకుని మెరుగుబంగారు రంగు సంతరించుకుని మెరుస్తుండాలీ... అనే సందేశమిస్తుందిరా పూరీ. ఇంతకంటే లైఫ్‌ లెసన్‌ ఏముంటుంద్రా’’ ఆవేశపడ్డాడు రాంబాబుగాడు. 

‘‘నేనెప్పుడూ అంత ఆలోచించలేదురా’’ అన్నా. అంతే... ‘‘ఒరేయ్‌...  ప్లేటులోకి పూరి పడిపోగానే ఎప్పుడెప్పుడు తిందామా అంటూ ఆబగా  నువ్వెదురు చూస్తావు. కానీ బాగా లోతైన అంతర్గత అవలోకిత మహా మహిమాన్విత తత్వలోకైక తాత్విక దృష్టితో విషయాల్ని పరిశీలించినప్పుడపు ఇంకెంతో జ్ఞానాన్ని ప్రసాదించేదేరా పూరీ. అందుకే ‘సర్వ టిఫినానాం పూరీ ప్రధానం’ అన్నది శాస్త్రోక్తి’’ అంటూ మళ్లీ చెలరేగిపోయాడు. ‘‘నిజమేరా... ఎంత జ్ఞానం రా బాబూ నీకూ’’ అంటూ కాస్త వ్యంగ్యం మిక్స్‌ చేసి కొట్టా గానీ... లాభం లేదు. దీన్నీ వాడు సీరియస్‌ పొగడ్తగానే తీసుకున్నాడు. 

‘‘అన్నట్టు... ఇక్కడ జ్ఞానానికీ పూరీకి కూడా ఓ పోలిక ఉంది చూశావా? పూరీలో పొరలున్నాయనీ... వాటి మధ్య ఖాళీ స్థలమనేది ఉందనే విషయం కూడా తెలియనట్టే అమాయకంగా ఉంటుందది. టైమొచ్చినప్పుడు తన పొరలలోకి గాలిని జ్ఞానంలా నింపుకుంటుంది. అంటే ఏమిటీ... మనిషనేవాడు ఏ హడావుడీ లేకుండా, నిరాడంబరంగా, నిశ్శబ్దంగా మెదడులోకి జ్ఞానం ఊరేలా చేసుకోవాలి. ఎట్టకేలకు... పూరీలా ఊరేంత జ్ఞానసముపార్జన చేసుకోవడం కంటే మనిషి బతుక్కు ఇంతకు మించి సార్థకత లేదూ– అనే సందేశమిస్తుందిరా మన పూరీ!’’

ఇంతవరకు విన్నాక అలా బయటకెళ్తూ ‘‘కంగారుపడుతూ ఉండటం వల్ల ఆ జంతువుకు ‘కంగారు’ అనే పేరొచ్చిందనేది ఎంత నిజమో... వేలెట్టి పొడిచి బొక్కెట్టాక  పూరీలోని గాలి విశ్వవ్యాపితం కావడం ఎంత వాస్తవమో... నీ జ్ఞానం కూడా ఒకనాటికి విశ్వమంతటా విస్తరించడం కూడా అంతే ఖాయం రా’’ అంటూ గొణుక్కుంటూ బయల్దేరా. కానీ వాడు మాత్రం ‘‘కరెక్ట్‌... పూరీ రక్షతి రక్షితః’’ అంటూ మరో ముక్క తుంచి... బొంబాయి చట్నీలో ముంచి... నోరంతా తెరచి... హాయిహాయిగా... రుచిరుచిగా తినడానికి రెడీ అయ్యాడు. 
– యాసీన్‌ 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement