Bharatpur Bird Sanctuary: భరత్‌పూర్‌ బర్డ్‌ శాంక్చురీ విహారం.. ఖండాంతరాలు దాటి..

Interesting Facts About Bharatpur Bird Sanctuary In Telugu - Sakshi

భరత్‌పూర్‌ బర్డ్‌ శాంక్చురీ... మన పక్షి ప్రేమికుడు సలీం అలీ మానసపుత్రిక. పక్షులు... ఖండాలు దాటి వస్తాయి. పర్యాటకులు... దేశాలు దాటి వస్తారు. పిల్లలు... ఏకంగా బడినే తెచ్చేస్తారు. 

worlds most important bird breeding: భరత్‌పూర్‌ బర్డ్‌ శాంక్చురీ రాజస్థాన్‌లో ఉంది. ఈ ప్రదేశం దేశరాజధాని ఢిల్లీకి ఆ రాష్ట్ర రాజధాని జైపూర్‌కు సమదూరంలో ఉంది. ఆగ్రాలో తాజ్‌మహల్‌ చూసిన తర్వాత పశ్చిమంగా యాభై కిలోమీటర్లు ప్రయాణిస్తే భరత్‌పూర్‌లో ఉంటాం. ఏటా ఇక్కడికి సైబీరియా పక్షులు వస్తాయి. ఇక్కడ ఉన్నవి, అతిథులుగా వచ్చినవి కలిపి మొత్తం 370 పక్షిజాతులను చూడవచ్చు. అందుకే ప్రపంచంలోని ఆర్నిథాలజిస్టులు భరత్‌పూర్‌కి క్యూ కడతారు. ఏడాదికి లక్ష మంది పర్యాటకులకు తగ్గరు, వారిలో యాభై వేల మంది విదేశీయులే. స్కూలు పిల్లలైతే ఆ పరిసరాల జిల్లాలే కాదు ఢిల్లీ నుంచి కూడా ఎక్స్‌కర్షన్‌కి భరత్‌పూర్‌కి వస్తారు. పిల్లలకు వంద పేజీల పుస్తకంతో కూడా చెప్పలేనన్ని సంగతులను ఒక్క టూర్‌తో చెప్పవచ్చు. అందుకే బడి అప్పుడప్పుడూ అడవిలోకి వచ్చేస్తుంటుంది.


                                            బర్డ్‌ సాంక్చురీలో ఏనుగు మీద విహారం

ఏనుగు అంబారీ!
భరత్‌పూర్‌ బర్డ్‌ శాంక్చురీలో ఎలిఫెంట్‌ సఫారీ, జీప్‌ సఫారీతోపాటు రిక్షా సఫారీ కూడా ఉంటుంది. పక్షులు శబ్దాలకు బెదిరి ఎగిరిపోకుండా ఉండాలంటే ఏనుగు మీద కానీ రిక్షాలో కానీ వెళ్లాలి. రిక్షావాలానే గైడ్‌గా వ్యవహరిస్తాడు. దట్టమైన అటవీప్రదేశంలోకి వెళ్లడానికి మాత్రం జీప్‌ సఫారీనే మంచి ఆప్షన్‌. ఇక్కడ సఫారీ పగలు మాత్రమే. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది. బర్డ్‌ శాంక్చురీ ప్రవేశ ద్వారం దగ్గరే జీప్‌ బుక్‌ చేసుకోవాలి. మితిమీరిన శబ్దాలను, హారన్‌లను అనుమతించరు. సొంత వాహనంలో వెళ్లినా సరే శాంక్చురీకి రెండు కిలోమీటర్ల దూరంలో ఆ వాహనాన్ని వదిలి టూరిజం శాఖ వాహనాల్లోనే లోపలికి వెళ్లాలి. ఇక్కడ ఫొటోగ్రఫీ, వీడియో షూటింగ్‌ను అనుమతిస్తారు. కానీ ఎంట్రీ టికెట్‌తోపాటు కెమెరాలకు చార్జ్‌ చెల్లించాలి.

చదవండి: ఈ సబ్బు ఖరీదు తెలిస్తే మూర్చపోతారు!.. రూ. 2.7 లక్షలట!!

వేటాడే అడవి కాదిప్పుడు
►ఇది ఒకప్పుడు భరత్‌పూర్‌ రాజుల వేటమైదానం. బ్రిటిష్‌ వైశ్రాయ్‌లు కూడా ఏటా ఇక్కడ డక్‌షూట్‌ నిర్వహించేవారు. 
►ఒక ఏడాది వైశ్రా య్‌ లార్డ్‌ లినిత్‌గౌ వేటలో వేలాది పక్షులు వేట ఆనందానికి బలయ్యాయి. 
►ప్రసిద్ధ పక్షి ప్రేమికుడు సలీం అలీ కృషితో నలభై ఏళ్ల కిందట ఈ ప్రదేశం పక్షి సంరక్షణ కేంద్రంగా మారింది. 
►1985లో ఇది వర ల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా గుర్తింపు పొందింది. 
►అడవిలో నేల రాళ్ల మయం. నున్నటి కాలిబాట వంటి రోడ్డు కూడా ఉండ దు. రాళ్లబాటలోనే నడవాలి. కాబట్టి ఈ టూర్‌లో మంచి షూస్‌ ధరించాలి.
►ఆగ్రా, ఫతేపూర్‌ సిక్రీ, జైపూర్‌ టూర్‌ ప్లాన్‌లో భరత్‌పూర్‌ కూడా ఇమిడిపోతుంది. 

ఇదే మంచికాలం!
ఖండాంతరాల నుంచి వచ్చే వలస పక్షులను చూడాలంటే అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి మధ్యలో వెళ్లాలి. ఆహ్లాదకరంగా వెకేషన్‌ కోసమే అయితే ఆగస్టు నుంచి నవంబర్‌ వరకు ఎప్పుడైనా వెళ్లవచ్చు. గడ్డకట్టే చల్లని వాతావరణం నుంచి సమశీతోష్ణమైన వాతావరణాన్ని వెతుక్కుంటూ వచ్చే ఈ పక్షులకు ఆరు నెలల పాటు మంచి విడిది భరత్‌పూర్‌ బర్డ్‌ శాంక్చురీ. ఏదైనా కారణం చేత ఒక ఏడాది నీటి నిల్వలు లేకపోయినట్లయితే ఈ పక్షులు నీళ్లున్న వేరే ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్లిపోతాయి. ఒకసారి ఈ చక్రం గాడి తప్పితే మళ్లీ పక్షులు ఈ ప్రదేశానికి రావడానికి చాలా ఏళ్లు పడుతుంది.

ఈ బర్డ్‌ శాంక్చురీ అసలు పేరు కేలాదేవ్‌ నేషనల్‌ పార్క్‌. ఈ పక్షి సంరక్షణ కేంద్రం భరత్‌పూర్‌కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే భరత్‌ఫూర్‌ శాంక్చురీగా వాడుకలోకి వచ్చింది. ఆకాశంలో ఉండే ఇంద్రధనస్సు నేలకు దిగి పక్షుల రెక్కల్లో ఒదిగిపోయినట్లు్ల ఉంటుంది. రంగురంగుల పక్షులు నీటిలో మునిగి చేపలు పట్టుకుని కడుపు నిండిన తర్వాత ఒడ్డుకు చేరతాయి. తడిసిన రెక్కలను విప్పార్చి సన్‌బాత్‌ చేస్తున్న దృశ్యం ఈ టూర్‌లో కనువిందు చేసే మరో ప్రత్యేకత.       

చదవండి: ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్‌..            

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top