Songkran In Thailand: లీ హోలీ.. జపాన్‌లో హనామి, థాయ్‌లాండ్‌లో సోంక్రాన్‌, ఇంకా...

Holi 2022: Hanami In Japan Songkran In Thailand Other Interesting Facts - Sakshi

మనదేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్‌లలోను, భారతీయ సంతతివారు ఎక్కువగా నివసించే ఆఫ్రికా, అమెరికా, యూరోప్‌ దేశాల్లోనూ హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. హోలీ మాదిరిగానే వసంతానికి స్వాగతం పలుకుతూ వివిధ దేశాల్లో జరిగే వేడుకల గురించి తెలుసుకుందాం.

హనామి జపాన్‌
జపాన్‌లో జరుపుకొనే వసంతోత్సవాన్ని ‘హనామి’ అంటారు. ‘హనామి’ అంటే పుష్పసందర్శనం. ఈ కాలంలోనే జపాన్‌లో చెర్రీ చెట్లు నిండా పూలతో విరగబూసి కనువిందు చేస్తాయి. ప్లమ్‌ వృక్షాలు కూడా ఇలాగే విరగబూస్తాయి గాని, జపాన్‌లో చెర్రీ వృక్షాలే విరివిగా కనిపిస్తాయి. చెర్రీ పూలను జపానీస్‌ భాషలో ‘సకురా’ అంటారు. హనామి వేడుకలు ఏటా మార్చి నెలలో ఆఖరి వారం నుంచి మే తొలివారం వరకు జరుగుతాయి.

ఏటా ఫిబ్రవరిలో జపాన్‌ వాతావరణ శాఖ ఆ ఏడాది చెర్రీవృక్షాలు ఏ సమయంలో పుష్పించడం ప్రారంభిస్తాయో అంచనా వేసి, తేదీని ప్రకటిస్తుంది. అప్పటి నుంచి వేడుకలు మొదలవుతాయి. తొలుతగా ఒకినావా దీవి నుంచి ఈ వేడుకలు మొదలవుతాయి. మన కార్తీక వనభోజనాలను ఉసిరిచెట్ల కింద చేసుకునే పద్ధతిలోనే జపాన్‌ ప్రజలు వసంతకాలంలో ఆరుబయట విరగబూసిన చెర్రీచెట్ల కింద, ప్లమ్‌ చెట్ల కింద ఉల్లాసంగా ఉత్సాహంగా విందు వినోదాలు చేసుకుంటారు.

చాలాచోట్ల రాత్రివేళ కూడా చెట్లకు పేపర్‌లాంతర్లు వేలాడదీసి, ఆరుబయటే ఆటపాటలతో విందు వినోదాలతో గడుపుతారు. టోక్యోలోని ఉయెనో పార్కులో ‘హనామి’ వేడుకలు చాలా సందడిగా జరుగుతాయి. ‘హనామి’ వేడుకల సంప్రదాయం క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దిలో గెన్మెయి మహారాణి కాలం నుంచి మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయి. జపాన్‌లో మృతుల కళేబరాలను చెర్రీ చెట్ల కింద సమాధి చేసే ఆచారం కూడా ఉంది.

‘హనామి’ వేడుకల్లో పెద్దలను స్మరించుకుంటూ ప్రార్థనలు జరుపుతారు. వసంతానికి స్వాగతం పలుకుతూ ఆరుబయట ప్రకృతి ఒడిలో గడుపుతారు. హనామి తరహా వేడుకలు తైవాన్, కొరియా, ఫిలిప్పీన్స్, చైనాలలోనూ జరుగుతాయి. జపాన్‌ 1912లో అమెరికాకు మైత్రీచిహ్నంగా మూడువేల చెర్రీ మొక్కలను కానుకగా ఇచ్చింది. అప్పటి నుంచి అమెరికాలోనూ పలుచోట్ల ఈ వేడుకను ‘చెర్రీ బ్లోసమ్‌ ఫెస్టివల్‌’గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

సోంక్రాన్‌– థాయ్‌లాండ్‌
నూతన సంవత్సరానికి స్వాగతం పలకడంతోనే థాయ్‌లాండ్‌లో వసంతోత్సవాలు మొదలవుతాయి. థాయ్‌లాండ్‌ వాసులు ఏటా ఏప్రిల్‌ 13న నూతన సంవత్సర వేడుకలు జరుపుకొంటారు. ఆ రోజు నుంచి మొదలయ్యే వసంత స్వాగతోత్సవాలు మాత్రం మూడు రోజుల పాటు– ఏప్రిల్‌ 15 వరకు చాలా సందడిగా కొనసాగుతాయి. ఈ వేడుకల కోసం అక్కడి ప్రభుత్వం ఏప్రిల్‌ 12 నుంచి 16 వరకు సెలవు దినాలను ప్రకటిస్తుంది.

బంధుమిత్రులతో ఈ వేడుకలు జరుపుకోవడానికి ఉపాధి కోసం నగరాల్లో పనిచేసుకునే వారంతా స్వస్థలాలకు పయనమవుతారు. థాయ్‌లాండ్‌ ప్రజలు నూతన సంవత్సరాన్ని ‘సోంక్రాన్‌’ అంటారు. ‘సోంక్రాన్‌’కు మూలం సంస్కృతంలోని ‘సంక్రాంతి’ పదమే. సౌరమానం ప్రకారం తొలి సంక్రాంతి అయిన మేష సంక్రాంతినే థాయ్‌లాండ్‌ వాసులు నూతన సంవత్సరంగా పాటిస్తారు. భారత్‌లో కూడా సౌరమానం పాటించేవారు మేష సంక్రాంతినే నూతన సంవత్సరంగా పాటిస్తారు.

థాయ్‌లాండ్‌ వాసులు మిగిలిన వారికి భిన్నంగా వరుసగా మూడురోజుల పాటు వసంతోత్సవాలను జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా థాయ్‌ ప్రజలు బౌద్ధారామాలను దర్శించుకుని ప్రార్థనలు చేస్తారు. నగరాలు, పట్టణాల్లోని కూడళ్లలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేసి, జనాలంతా కూడళ్లలోకి చేరుకుని ఒకరిపై ఒకరు నీళ్లు చిమ్ముకుంటూ సందడి చేస్తారు. నీళ్లు చిమ్ముకునే ఆచారం వల్ల ఈ వేడుకలను ‘వాటర్‌ ఫెస్టివల్‌’ అని కూడా అంటారు.

ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన వేదికల వరకు సంప్రదాయ దుస్తులు ధరించి, చక్కగా అలంకరించుకున్న మహిళలు, యువతులు సంగీతవాద్యాలతో పాటలు పాడుతూ ఊరేగింపుగా వెళతారు. కొన్నిచోట్ల అందాల పోటీలు కూడా నిర్వహిస్తారు. ఊరేగింపులో పాల్గొన్న అందమైన మహిళలను, యువతులను ‘లేడీ సోంక్రాన్‌’, ‘మిస్‌ సోంక్రాన్‌’ బిరుదులిచ్చి, కిరీటాలతో వారిని ఘనంగా సత్కరిస్తారు. ఈ సందర్భంగా కొందరు ఆలయాల పునరుద్ధరణ కోసం ఇసుకను దానం చేస్తారు. పెద్దలను స్మరించుకుంటూ, బౌద్ధ భిక్షువులకు అన్నసంతర్పణలు చేస్తారు.

మెక్సికోలో భారీ ఎత్తున కార్నివాల్‌
వసంతకాలం అడుగుపెట్టే తొలిరోజు మెక్సికోలో భారీ ఎత్తున కార్నివాల్‌ నిర్వహిస్తారు. మెక్సికోలోని తీరప్రాంత పట్టణాల్లో ఈ వేడుకలు మరింత అట్టహాసంగా జరుగుతాయి. ఏటా మార్చి నెలలో వసంతారంభంగా వాతావరణ నిపుణులు ప్రకటించిన రోజున ఈ సంబరాలను జరుపుకొంటారు. సాధారణంగా మార్చి 19–22 తేదీల మధ్య వసంత రుతువు మొదలవుతుంది.

సంగీత వాద్యాలతో దారిపొడవునా పాటలు పాడుతూ, నవ్వుతూ తుళ్లుతూ, కేరింతలు కొడుతూ, నృత్యాలు చేస్తూ విచిత్ర వేషధారణలతో ఉత్సాహంగా ఊరేగింపులు జరుపుతారు. ఊరేగింపులో తినుబండారాలు, పానీయాలు విరివిగా దొరుకుతాయి. ఈ వేడుకలు కొన్నిచోట్ల వారంరోజుల వరకు, మరికొన్ని చోట్ల దాదాపు రెండు వారాల వరకు కూడా కొనసాగుతాయి. కార్నివాల్‌ వేడుకలను తిలకించేందుకు విదేశీ పర్యాటకులు పెద్దసంఖ్యలో మెక్సికోకు వస్తుంటారు.

శాషిల్యూటెన్‌– స్విట్జర్లాండ్‌ 
స్విట్జర్లాండ్‌లో వసంతోత్సవాన్ని ఏప్రిల్‌లో జరుపుకుంటారు. చలిదేశం కావడం వల్ల అక్కడ వసంతకాలం కాస్త ఆలస్యంగా మొదలవుతుంది. మధ్యయుగాల నుంచే స్విట్జర్లాండ్‌లో ఈ వేడుకలు జరుపుకొనే ఆచారం ఉంది. అప్పట్లో వేసవిలోని మొదటి పనిదినాన ఈ వేడుకలను జరుపుకొనేవారు. గత శతాబ్దం నుంచి ఈ వేడుకలను ఏప్రిల్‌ మూడో సోమవారం రోజున జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.

విద్యుత్తు లేని మధ్యయుగాల కాలంలో శీతాకాలంలో పగటి వెలుతురు ఉన్నంత సేపే పనిగంటలు నడిచేవి. వేసవిలోని తొలి పనిదినాన కాలానికి తగినట్లు పనివేళలను నిర్ణయించుకునే వారు. సాయంత్రం ఆరుగంటలకు చర్చిగంటలు మోగగానే పనివేళలను ముగించుకోవాలని అప్పట్లో శాసనం కూడా తెచ్చారు. శీతాకాలం వెళ్లిపోతూ వసంతం ప్రారంభమైదనడానికి సూచనగా స్విస్‌ ప్రజలు నగరాలు, పట్టణాల కూడళ్లలో పెద్దసంఖ్యలో గుమిగూడి, గోనెపట్టాలు, ఇతర వ్యర్థాలతో తయారుచేసే శీతాకాలం దిష్టిబొమ్మను తగులబెడతారు.

దీని తలభాగంలో మందుగుండు కూడా దట్టిస్తారు. బొమ్మ కొంత కాలిన తర్వాత  మంటలు తలవరకు వ్యాపించి, మందుగుండుకు నిప్పు తాకగానే పేలుడు సంభవిస్తుంది. ఈ ఆచారం మనదేశంలో జరిగే హోలికాదహనం, కామదహనం మాదిరిగానే కనిపిస్తుంది. శీతాకాలం దిష్టిబొమ్మను ‘బోగీ’ అంటారు. మనం భోగిమంటలు వేసుకుంటాం, వాళ్లు ‘బోగీ’కి మంట పెడతారు. గమ్మత్తుగా లేదూ!

సెమానా శాంటా– గ్వాటెమాలా
గ్వాటెమాలాలో ‘సెమానా శాంటా’ పేరిట వసంతోత్సవాలను జరుపుకొంటారు. ‘సెమానా శాంటా’ అంటే పవిత్ర వారం అని అర్థం. ఈ వారాన్ని ‘సెమానా మేయర్‌’ (ప్రధానవారం) అని కూడా అంటారు. ఈ వారం రోజులూ గ్వాటెమాలా నలుమూలలా చర్చ్‌లలో ప్రార్థనలు, వీథివీథినా ఊరేగింపులు జరుగుతాయి. ‘శాంటా హెర్మన్‌డాడ్‌’ అనే శాంతిపరిరక్షక దళాల నాయకత్వంలో పిల్లా పెద్దా అందరూ క్రీస్తు, మేరీమాతల చిత్రపటాలు ధరించి, పాటలు పాడుతూ ఊరేగింపుల్లో పాల్గొంటారు.

ఈస్టర్‌ ఆదివారంతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఈ పవిత్రవారానికి సన్నాహాలు ఫిబ్రవరి చివరివారంలో మొదలయ్యే లా క్యుయారెస్మా (లెంట్‌)తో ప్రారంభమవుతాయి. ‘లెంట్‌’ రోజుల్లో క్యాథలిక్‌లు ఉపవాసాలు, ప్రార్థనలతో కాలం గడుపుతారు. ప్రపంచవ్యాప్తంగా కేథలిక్‌లు ఈ ఆచారాలను పాటించినా, గ్వాటెమాలాలో మాత్రం మరింత విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి.

పవిత్రవారంలో ఊరేగింపు జరిపే దారుల్లో ‘లాస్‌ ఆంఫ్రోబాస్‌’ అనే రంగురంగుల తివాచీలను పరుస్తారు. ఈ తివాచీల హస్తకళా నైపుణ్యం చూసి తీరాల్సిందే! గ్వాటెమాలా ప్రజలు ఈ వేడుకల కోసం స్వయంగా ఈ తివాచీలను తయారు చేస్తారు. వీటి తయారీలో సహజసిద్ధమైన రంగులనే వాడతారు. రంపపుపొట్టు, ఎండిపోయిన పూలు, ఆకులు, పండ్లు, చెట్ల బెరళ్ల నుంచి అత్యంత ఆకర్షణీయమైన రంగులను తయారు చేయడం ఇక్కడి విశేషం. 

ట్యూలిప్‌ టైమ్‌ ఫెస్టివల్‌: హాలండ్, మిషిగాన్‌
అమెరికాలో మిషిగాన్‌ రాష్ట్రంలోని హాలండ్‌ నగరంలో ఏటా ‘ట్యూలిప్‌ టైమ్‌ ఫెస్టివల్‌’ పేరిట వసంతోత్సవ సంబరాలు జరుగుతాయి. ఇక్కడ పెద్దసంఖ్యలో ఉండే డచ్‌ ప్రజలు ఈ వేడుకలను అత్యంత వైభవోపేతంగా జరుపుకొంటారు. ‘ట్యూలిప్‌ టైమ్‌ ఫెస్టివల్‌’ ఏటా మే నెల రెండోవారంలో వారం రోజుల పాటు జరుగుతాయి. ఈ రుతువులో ట్యూలిప్‌ మొక్కలు విరగబూస్తాయి. గత శతాబ్దకాలంగా మిషిగాన్‌లోని హాలండ్‌ నగరంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి.

ఇక్కడ స్థిరపడ్డ డచ్‌ ప్రజల కోరిక మేరకు 1928లో హాలండ్‌ నగరపాలక సంస్థ నెదర్లాండ్స్‌ నుంచి లక్ష ట్యూలిప్‌ మొక్కల దిగుమతికి అనుమతించింది. వాటిని స్థానిక పార్కులకు పంపిణీ చేసింది. మరుసటి సంవత్సరం ఆ మొక్కలు విరగబూయడంతో చిన్నస్థాయిలో వేడుక జరుపుకొన్నారు. హాలండ్‌ నగర శతవార్షిక సంవత్సరమైన 1947 నుంచి క్రమం తప్పకుండా ఈ వేడుకలను ప్రతియేటా నిర్వహించడం ఆనవాయితీగా మారింది.

ఈ వేడుకల సందర్భంగా ట్యూలిప్‌ పూలను ప్రదర్శిస్తూ ఊరేగింపులు, బాణసంచా ప్రదర్శనలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ట్యూలిప్‌ టైమ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు వస్తుంటారు.

మార్జానా– పోలండ్‌
పోలండ్‌లో వసంతోత్సవాలను ‘మార్జానా’ పేరిట జరుపుకొంటారు. ‘మార్జానా’ అనేది పురాతన స్లావిక్‌ మతానికి చెందిన శీతాకాల మృత్యుదేవత. చెక్, స్లోవేనియా, క్రొయేషియా, బోస్నియా, సెర్బియా దేశాలలో ఈ దేవతను ‘మోరానా’ అని, రష్యాలో ‘మారెనా’ అని, ఉక్రేనియాలో ‘మారా’ అని, బల్గేరియాలో ‘మొరా’ అని పిలుస్తారు. పునర్జన్మల విశ్వాసంతో ముడిపడి ఉన్న వేడుక ఇది.

శీతకాలం ముగిసే సమయంలో జనాలు పాటలు పాడుకుంటూ, వాయిద్యాలను మోగిస్తూ భారీ ఊరేగింపు జరిపి, ‘మార్జానా’ దేవత దిష్టిబొమ్మను దగ్గర్లోని నదుల్లోను, జలాశయాల్లోను నిమజ్జనం చేస్తారు. నిమజ్జనంతో మరణించిన ‘మార్జానా’ తిరిగి ‘కోస్త్రోమా’– అంటే వసంత దేవతగా జన్మిస్తుందని విశ్వసిస్తారు. నిమజ్జనానికి ముందు కొన్నిచోట్ల మార్జానా దిష్టిబొమ్మలకు నిప్పుపెట్టడం లేదా, దిష్టిబొమ్మకు చుట్టిన దుస్తులను చించేయడం వంటి పనులు చేస్తారు. ఏటా మార్చి 21న జరిగే ఈ వేడుకల్లో ఎక్కువగా పిల్లలు, యువతీ యువకులు పాల్గొంటారు. ‘మార్జానా’ను నిమజ్జనం చేసి, విందు వినోదాలతో వేడుకలు జరుపుకొంటే పంటలు బాగా పండుతాయని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు.

సింబురిజాదా – బోస్నియా
బోస్నియాలో వసంతోత్సవమంటే ఆహారోత్సవమే! ‘సింబురిజాదా’ పేరిట ఏటా మార్చి 21న జరిగే ఈ వేడుకలు విలక్షణంగా ఉంటాయి. ఈ వేడుకలను జనాలు ఆరుబయట జరుపుకొంటారు. నదులు, తటాకాల ఒడ్డున, ఉద్యానవనాల్లోను గుంపులు గుంపులుగా చేరి, ఆటపాటలతో సంబరాలు చేసుకుంటారు. ఆరుబయట పొయ్యిలు ఏర్పాటు చేసుకుని, భారీస్థాయిలో గుడ్లను గిలకొట్టి వాటితో సామూహికంగా తయారుచేసే వంటకాలను అందరూ ఆరగిస్తారు.

వేడుకలను తిలకించడానికి వచ్చే పర్యాటకులకు ఉచితంగా ఈ గుడ్ల వంటకాలను వడ్డిస్తారు. వసంత స్వాగతోత్సవ వేడుకల్లో గుడ్లు మాత్రమే ఎందుకు? వేరేవి ఏవైనా వండుకుంటే కుదరదా? అంటే, కుదరనే కుదరంటారు బోస్నియా వాసులు. జీవావిర్భవానికి మూలం గుడ్డు. ఎక్కడైనా గుడ్డు నుంచే పిల్ల పుడుతుంది. వసంతంతోనే కొత్త రుతువు మొదలవుతుంది. అందువల్ల కొత్త జీవానికి సంకేతంగా గుడ్లతోనే సంప్రదాయ వంటకాలు చేసుకుంటామని చెబుతారు.

ఫాలెస్‌– స్పెయిన్‌
స్పెయిన్‌లో ‘ఫాలెస్‌’ పేరిట వసంతారంభంలో వేడుకలు జరుపుకొంటారు. ఈ వేడుకలను సెయింట్‌ జోసెఫ్‌ సంస్మరణార్థం ఘనంగా నిర్వహిస్తారు. ఏటా మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు భారీ ఎత్తున జరుపుకొనే సంబరాల్లో పెద్దసంఖ్యలో జనాలు పాల్గొంటారు. ‘ఫాలెస్‌’ అంటే కాగడా అని, నిప్పుపెట్టడం అని అర్థాలు ఉన్నాయి. ‘ఫాలెస్‌’ వేడుకల్లో ఊరేగింపులు, విందు వినోదాలు, గానాభజానాలు అట్టహాసంగా జరుగుతాయి.

విందుల్లో గుమ్మడికాయ, చాక్లెట్‌తో తయారుచేసే ప్రత్యేక సాంప్రదాయక వంటకాలను వడ్డిస్తారు. ఈ వేడుకల్లో ప్రజలు కొత్తదనానికి స్వాగతం పలికే క్రమంలో పాతవాటన్నింటినీ వదులుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగానే పాత వస్తువులన్నిటినీ కూడళ్లలో గుట్టలుగా పోసి, వాటికి నిప్పంటిస్తారు. ఈ తతంగం మన భోగిమంటల మాదిరిగా ఉంటుంది. పెద్దసైజులో తయారు చేసే దిష్టిబొమ్మలను కూడా ఈ మంటల్లో వేసి తగులబెడతారు. స్పెయిన్‌లోని వాలెన్షియా నగరంలో ఈ వేడుకలు మరింత ఘనంగా జరుగుతాయి.

చదవండి: Cricketers Holy Celebrations: రోహిత్‌ది తిండిగోల.. కోహ్లీ, ధోని ఎకో ఫ్రెండ్లీ బాటలో
  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top