ధనుర్మాస ప్రాముఖ్యత

Gumma Prasad Rao Dhanurmasam 2020 Special Devotion Story - Sakshi

ప్రపంచ దేశాలన్ని మన భారత దేశం వైపు ఒక విధమైన సమస్కరణీయ దృష్టితో చూస్తున్నా యి. అందుకు కారణం మన సంస్కృతీమయ వైభవమే. మనం జరుపుకునే పర్వదినాలు, పండుగల వెనుక ఎంతో అంతరార్థం ఉంది. పండుగంటే కేవలం తిని, త్రాగి, కొత్త బట్టలు వేసుకోవటం మాత్రమే కాదు. నిశితంగా ఆలోచిస్తే కొన్ని పండుగల వెనుక మనిషికీ, మనిషికి మధ్య సత్సంబంధాలు పెంచే ఉద్దేశ్యం కనపడితే.. కొన్ని పండుగలు ఆరోగ్యం కాపాడుకోవటానికి దోహదం చేసేవిగా ఉంటాయి. ప్రతి పండగ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నదే, సందేశాన్ని ఇచ్చేదే. ‘ఏష సుస్తేషు జాగ్రర్తి భూతేషు పరినిష్ఠిత:’ అనే రామాయణ వచనాన్ని అనుసరించి లక్ష్మీ స్వరూపాలన్నింటిని ఇచ్చేది సూర్యభగవానుడే. (ధారణ శక్తి, పుష్టి, ఆనందం, ధైర్యం మొదలైనవన్ని లక్ష్మి స్వరూపాలే) కనుక సూర్యగమనంపై ఆధారపడి ప్రవర్తించేది, శక్తిని, పుష్టిని ఇచ్చేది అయిన ధనుర్మాసం అత్యంత పవిత్రమైనది.

మన తెలుగు నెలల ప్రకారం ధనుర్మాసం మార్గశిర పుష్యమాసాలలో వస్తుంది ‘మాసానాం మార్గశీరోం’అని భగవద్గీతలో శ్రీకృష్ణుడంటాడు. అంటే ఈ మాసం అతని విభూతులలోనొకటి. ధనుర్మాసం సాధారణంగా డిసెంబరు 12-16 తేదీల మధ్య వస్తుంది. దీనిని నెలగంట పెట్టడం అని కూడా అంటారు. మనం జరుపుకునే పండుగలన్నీ చాంద్రమానం అనుసరించి జరుపుకునేవే. అయితే సంక్రమాణములు సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటాము. ధనుస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించిన మాసాన్ని ప్రత్యేకంగా ధనుర్మాసం అని వాడుకలోనుంది. ఇది చైత్రాది పన్నెండు మాసాల్లో లేదు. ఈ మాసానినేచాపము, కోదండకర్మక, శూన్యమాసము అని కూడా అంటారు. ధనుర్మాసమనేది స్త్రీల సౌభాగ్యమును పెంచును. (చదవండి: భక్తుల ఇంటికే అయ్యప్ప ప్రసాదం)

అందుచేత సౌభాగ్యవంతులుగు స్త్రీలు,పెళ్ళి కావలసిన ఆడపిల్లలు ధనుర్మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ వుంటారు. ఆ సమయం రాగానే. గృహములను శుభ్రం చేసుకొని ఇంటి ముంగిట గోమయంతో కళ్ళాపి చల్లి, చిత్ర విచిత్రమగు ముగ్గులను. తీర్చి దిద్ది వాని మధ్యలో గొబ్బిళ్ళు పెట్టి వాటిమీద పసుపు కుంకుమలు జల్లి గుమ్మడి పూలు బంతిపూలు పెట్టి ప్రదక్షిణం చేస్తూ గొబ్బిపాటలు పాడుతూ ఈ నెలంతా ఆనందోత్సాహాలతో గడుపుతారు. సుబ్బీ గోబ్బెమ్మ సుఖము లీయవే చామంతి పూవంటి చెల్లెల్నీయవే. తామర పూవ్వంటి తమ్ముడినీయవే మొగలి పూవంటి మొగుణ్ణీయవే లక్ష్మీ కటాక్షం అందరికి కావాలి. సౌభాగ్యవతులు నిత్య సౌభాగ్యం కొరకు సర్వదా, సర్వావస్థలయందు లక్ష్మీ తమ గృహమందు స్థిరనివాసమేర్పచుటకై భక్తి శ్రద్ధలతో తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈ విధంగా కోరుకుంటారు.

నిత్యం సాపద్మహస్తా మమవసతు గృహే సర్వ మాంగళ్యయుక్తా నగరవాసులకు ఇంత శ్రద్ధ తీరికా లేదు. పేడ అంటేనే అసహించుకుంటారు. అపార్ట్ మెంట్ ఇళ్ళు, సిమెంటు గచ్చులు. కళ్ళాపిఎక్కడ జల్లుతారు? కొంతలో కొంత నయం. ఉన్న జాగాలో ముగ్గులు పెడతారు, గుమ్మాలకు మామిడాకు తోరణాలు కడతారు. లక్ష్మీ దేవి నారాదించు గృహిణిలు కూడా లక్ష్మీ స్వరూపులుగా ఉన్నప్పుడే ఆ దేవి అనుగ్రహం పొందగలరు. అందువలన ఇంటి గృహిణి పాదములకు పసుపు రాసుకుని శుభ్రమైన చీర ధరించి, కేశములను అందంగా అలంకరించుకుని, సువాసనగల పూలను తలలో ధరించి ముఖమున కుంకుమ బొట్టు తీర్చి దిద్దుకొని ఉన్నప్పుడు లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. రూపేచ లక్ష్మీ అని అంటారు. ఈ మాసంలో కాత్యాయని వ్రతం ఆచరిస్తారు.

పెళ్ళి కాని ఆడపిల్లల ఈ వ్రతం చేస్తే మంచి భర్తను పొందుతారంటారు. ఈ వ్రతాన్ని చేసే పార్వతీదేవి పరమశివుడిని భర్తగా పొందింది అంటారు. ధనుర్మాసంలో మరో విశేషం గోపూజ. గోవులో ముక్కోటి దేవతలుంటారని పెద్దలు చెపుతారు. లక్ష్మీ స్వరూపాలైన గోవు గిట్టలందు, ధర్మస్వరూపాలైన వృషభాల గిట్టలందు లక్ష్మీ ఉంటుందని శిష్టులు చెబుతారు. గోవును పూజించడం శుభకరం. ఘడియల్లో ధనుర్మాసంలో లక్ష్మీ నారాయణులనే కాక  ప్రత్యక్ష దైవం సూర్యభగవానునికి కూడా పూజించడం, ప్రార్ధించడం, ధ్యానించడం వలన అవ్యయఫల ప్రాప్తి కలుగుతుంది. బంగారు భవిష్యత్తుకు దోహదపడే కాలమే ధనుర్మాసం. స్వస్తి

- గుమ్మా ప్రసాద రావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top