దళిత సాహితీ రత్నాకరుడు

Dr GV Ratnakar Got Boyi Bhimanna Award - Sakshi

పురస్కారం

జాతీయ దళిత సాహిత్యంలో కేతనం ఎగరేస్తున్న తెలుగు కవి డాక్టర్‌ జి.వి.రత్నాకర్‌. ప్రకాశం జిల్లా కొండెపి అనే కుగ్రామంలో పుట్టి కేంద్రీయ విద్యాలయంలో ఆచార్యుని స్థాయికెదిగిన రత్నాకర్‌ విద్యార్థి దశనుండే ఉద్యమాలు ఎరిగినవాడు; అంబేడ్కరిజాన్ని, మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తూ ఎదిగినవాడు; అంబేడ్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక కార్యదర్శి; హిందీ సాహిత్యంలో ఎం.ఫిల్, పీహెచ్‌డీ చేసినవాడు. అందుకే ఆయన కవిత రాసినా, కథ రాసినా, వ్యాసం రాసినా, నాటకం రాసినా కాలక్షేపానికి కాక కమిట్‌మెంట్‌తో రాసినట్టు అర్థమవుతూనే ఉంటుంది. కవిగా, అనువాదకునిగా తనదైన ముద్ర కనిపిస్తూనే ఉంటుంది.
విద్యార్థి దశ నుండే దళిత ఉద్యమ నేపథ్యం ఉన్నవాడు కనుక ఆ ఫలితాలను కలగనకుండా ఎలా ఉండగలడు! దళిత మహాసభ తెచ్చిన సామాజిక చైతన్యం ఆలంబనగా రాష్ట్రంలో అడుగిడిన బహుజన సమాజ్‌పార్టీ కొంతమేరకైనా రాజకీయ అధికార బీజాలు వేసే వేళ దళితుల్లో ఉపకుల భేదాలు ఆ ప్రయత్నాలను నిర్వీర్యం చేయడం చూసి రత్నాకరుడు మథనపడ్డాడు.
‘ఆ మబ్బంత సంబరమవుదామని
అల ఎగిసిన ప్రతీసారి
నిలువునా ఇరిగి పడుతుంది
చివరికి ఇట్టా నెత్తుటి గాయాలవుతున్న
దేంటబ్బా’ అని వాపోయాడు. ‘అట్లేటి అల’, ‘ముసిబాస’ లాంటి దీర్ఘకవితా సంపుటులు తెచ్చిన రత్నాకర్‌ మట్టిపలక, వర్ణమాల వంటి సాహితీ సంపుటాలను తెచ్చి దళిత సాహితీ  సృజనలో భాగం చేశాడు. రత్నాకర్‌ దళిత కవి అయినప్పటికీ అభ్యుదయ వాదులైన దళితేతరుల పట్ల వ్యతిరేకతను ఎప్పుడూ ప్రదర్శించలేదు. ‘ఆ యేరు పారినంత మేర/ ఎర్ర పూలే పూసాయి’ అంటాడు. అయితే అవసరం అయినపుడు ‘దాహం వేసింది/ దోసిలి పట్టమంది/ నాకొద్దీ ఊరు’ అని ధిక్కారం ప్రకటించకుండా లేడు. ‘గుడిలో నీవు/ మెట్ల దగ్గర నేను/ ప్రేమించేదెలా’ అని ప్రశ్నించకుండా లేడు.
సమతా సైనిక్‌దళ్‌ అంటే ఏమిటి? అంబేడ్కర్‌ దినచర్య, రమాబాయి అంబేడ్కర్‌ జీవిత చరిత్ర, నేను భంగీని, క్రాంతిబాపూలే (నాటకం), వీరనారి ఝల్కాభాయి, నేను  అంటరానివాన్ని లాంటి హిందీ రచనలను తెలుగులోకి అనువదించి మహారాష్ట్ర దళిత నిబద్ధతను తెలుగువారికి ఎరికపరిచాడు రత్నాకర్‌. స్వామి అచ్యుతానంద్, వెంకటస్వామి, శూద్రుని శాపం లాంటి పుస్తకాలతో రాబోతున్న రత్నాకర్‌ 2018లో తాష్కెంట్‌ (రష్యా)లో దళిత సాహిత్యంపై ప్రసంగించి పరిశోధనా పత్రం సమర్పించాడు. దేశంలోని అనేక యూనివర్సిటీల్లో పత్ర సమర్పణ చేశాడు. రత్నాకర్‌ ఇటీవల చేసిన గొప్పపని బోయి భీమన్న ‘పాలేరు’ నాటకాన్ని హిందీలోకి అనువదించడం. పాలేరు  నాటకరంగ చరిత్రలో ఒక సంచలనం. పాలేరు చదువుకుని కలెక్టర్‌ కావడం పాలేరు నాటకంలోని ఇతివృత్తం. ఆ నాటకాన్ని చూసి పాలేర్లు కలెక్టర్లు అయ్యారంటే నమ్మగలరా! ‘ఎడ్యుకేట్‌’ అనే అంబేడ్కరిజం ప్రాథమిక సూత్రానికి హారతి పట్టింది ఆ నాటకం. అంతటి గొప్ప నాటకాన్ని హిందీలోకి అనువదించి మొత్తం దేశానికి అందించవలసిన బాధ్యతను నెరవేర్చాడు రత్నాకర్‌. ఆయనను బోయి భీమన్న అవార్డు వరించడానికి ఇంతకంటే గొప్ప కారణమేమి కావాలి!
-నేతల ప్రతాప్‌కుమార్‌
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top