Animatronic Elephant: స్కూల్‌కు ఏనుగొచ్చింది

Dia Mirza Poses with Animatronic Elephant During Peta Event - Sakshi

జంతు చెలిమి

ఏనుగు స్కూల్‌కి వస్తే? పిల్లలు దానిని భయం లేకుండా తాకి, నిమిరి ఆనందిస్తే? ఆ ఏనుగు కళ్లార్పుతూ, చెవులు కదిలిస్తూ మాట్లాడుతూ తన గురించి చెప్పుకుంటే? ‘ఎలీ’ అనే యానిమెట్రానిక్‌ ఏనుగు ఇకపై దేశంలోని స్కూళ్లకు తిరుగుతూ పిల్లలకు ఏనుగుల జీవనంలో ఏది ఇష్టమో, ఏది కష్టమో చెప్పనుంది. ‘పెటా’ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ‘ఎలీ’కి గొంతు ఇచ్చిన నటి దియా మిర్జా ఏనుగులపై జరుగుతున్న దాష్టీకాలపై పిల్లలకు అవగాహన కల్పించడానికి నడుం కట్టింది. ముంబైలో శుక్రవారం మొదలైన ఈ కార్యక్రమం పిల్లలు, తల్లిదండ్రులు, జంతు ప్రేమికులు తప్పక ఆహ్వానించదగ్గది.

సుప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్‌ ‘ఏనుగు డాక్టర్‌’ అనే కథ రాశారు. మదుమలై అడవుల్లో ఏనుగుల డాక్టర్‌గా పని చేసిన ఒక వ్యక్తి అనుభవాలే ఆ కథ. అందులో ఆ డాక్టర్‌ అడవుల్లో పిక్నిక్‌ల పేరుతో తిరుగుతూ బీరు తాగి ఖాళీ సీసాలను రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ విసిరేసే వాళ్ల మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దానికి కారణం బీరు సీసా మీద ఏనుగు కాలు పెట్టగానే అది పగులుతుంది. ఏనుగు పాదంలో దిగబడి పోతుంది. ఇక ఏనుగుకు నడవడం కష్టమైపోతుంది. అది తిరగలేదు. కూచోలేదు. లేవలేదు. ఒక చెట్టును ఆసరా చేసుకుని నిలబడి పోతుంది. అలాగే వారం పదిరోజులు నిలబడి తిండి లేక కృశించి మరణిస్తుంది.

ఇది ఎవరు జనానికి చెప్పాలి? ఎవరు ప్రచారం చేయాలి? ఎవరో ఒకరు లేదా అందరూ ఏదో ఒక మేరకు పూనుకోవాలి కదా. ‘పీపుల్‌ ఫర్‌ ది ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌’ (పెటా) నిన్న (శుక్రవారం) ఏనుగులతో జనం మైత్రి కోసం ముఖ్యంగా పిల్లల్లో అవగాహన కోసం ఒక ప్రచార కార్యక్రమం మొదలుపెట్టింది. అచ్చు నిజం ఏనుగులా కనిపించే యానిమెట్రానిక్‌ ఏనుగును తయారు చేయించి దాని ద్వారానే పిల్లల్లో చైతన్యం కలిగించనుంది. ఆ ఏనుగుకు ‘ఎలీ’ అనే పేరు పెట్టారు. ఈ కార్యక్రమానికి ‘వైల్డ్‌లైఫ్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా’లో అంబాసిడర్‌గా ఉన్న దియా మిర్జా తోడు నిలిచింది. ఆమె ఏనుగుకు తన కంఠం ఇచ్చింది.

నేను... ఎలీని...
నిజం ఏనుగులా అనిపించే ఎలీ ఇకపై ఊరూరా తిరుగుతూ స్కూల్‌కి వస్తుంది. అందులో రికార్డెడ్‌గా ఉన్న దియా మిర్జా కంఠంతో మాట్లాడుతుంది. ఇది యానిమెట్రానిక్‌ బొమ్మ కనుక కళ్లు కదల్చడం, చెవులు కదల్చడం లాంటి చిన్న చిన్న కదలికలతో నిజం ఏనుగునే భావన కలిగిస్తుంది. అది తన చుట్టూ మూగిన పిల్లలతో ఇలా చెబుతుంది. ‘నేను ఎలీని. నా వయసు 12 సంవత్సరాలు. నేను ఇంతకు ముందు ఒక సర్కస్‌లో పని చేసే దాన్ని. జనం నన్ను సర్కస్‌లో చూసి ఆనందించేవారు.

కాని అలా ఉండటం నాకు ఆనందం కాదు. అడవిలో తిరిగే నన్ను కొందరు బంధించి సర్కస్‌కు అప్పజెప్పారు. సర్కస్‌ ఫీట్లు చేయడానికి నన్ను బాగా కొట్టేవారు. నన్ను గట్టి నేల మీద ఎప్పుడూ నిలబెట్టేవారు. అలా నిలబడితే నాకు కష్టంగా ఉంటుంది. అసలు జనం మధ్య తిరగడం, గోల వినడం ఇవన్నీ నాకు భయం. సర్కస్‌ లేనప్పుడు నన్ను గొలుసులతో కట్టేస్తారు. ఏనుగుల గుంపు నుంచి ఏనుగును విడదీస్తే అది ఎంతో బాధ పడుతుంది. కాని ఇప్పుడు నేను విముక్తమయ్యాను. నన్ను ఒక సంస్థ విడిపించి బాగా చూసుకుంటోంది. నేను హాయిగా ఉన్నాను’ అని తన కథను ముగిస్తుంది.

కొనసాగుతున్న హింస
‘ఏనుగులు ప్రకృతిలో ఉండాలి. జనావాసాల్లో కాదు. ఒక తల్లిగా పిల్లలకు కొన్ని విషయాలు తెలియాలని కోరుకుంటాను. పెటాతో కలిసి బాలబాలికల్లో చైతన్యం కోసం పని చేయడం మూగజీవులకు, పిల్లలకు బంధం వేయడంగా భావిస్తాను’ అని దియా మిర్జా అంది. ఏనుగులను ఇవాళ్టికీ ఉత్సవాల్లో, పర్యాటక కేంద్రాల్లో, బరువుల మోతకు, వినోదానికి ఉపయోగిస్తున్నారు. మనుషుల ఆధీనంలో ఉన్న ఏనుగుకు ఎప్పుడూ కడుపు నిండా తిండి, నీరు దొరకవు. వాటిని గొలుసులతో బంధించి ఉంచడం వల్ల ఒక్కోసారి అవి అసహనానికి గురై మనుషుల మీద దాడి చేస్తాయి. ఎలిఫెంట్‌ సఫారీల వల్ల ఏనుగు వెన్ను సమస్యలతో బాధ పడుతుంది. ఇవన్నీ మన తోటి పర్యావరణ జీవులతో ఎలా మెలగాలో తెలియకపోవడం వల్ల జరుగుతున్న పనులేనని ‘పెటా’ వంటి సంస్థల ప్రతినిధులు, జంతు ప్రేమికులు తెలియచేస్తున్నారు.

‘ఎలీ’ వంటి ఏనుగులు ప్రతి ఊరు వచ్చి పిల్లలతో, పెద్దలతో సంభాషిస్తే లేదా ఇలాంటి సంభాషణను ప్రతి స్కూల్లో వీడియోల ద్వారా అయినా ప్రదర్శిస్తే మార్పు తథ్యం.        
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top