
పొద్దంతా కష్టపడి పనిచేసి, రాత్రిపూట కడుపు నిండా భుజించి ప్రశాంతంగా నిద్రపోతే.. అర్ధరాత్రి ఎక్కడో గుర్ర్..గుర్ర్‌మంటూ వస్తోన్న శబ్దం చికాకు తెప్పిస్తుంది. గాఢనిద్రలో ఉన్నవారిని ఉలిక్కి పడేలా చేస్తుంది. పక్కన పడుకుంటే చెవుల్లో సప్తస్వరాలు మోగినట్లు వినిపించే గురక శబ్దం మంచి నిద్రను దూరం చేస్తుంది. గురకపెట్టేవారి పక్కన పడుకునే వారి కష్టాలు ఇవైతే.. గుర్ర్.. గుర్ర్‌మంటూ సోయిలేకుండా పడుకునేవారు తెలియకుండానే అనారోగ్యం పాలవుతున్నారు. అకస్మాత్తుగా హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లా జనాభాలో 10 శాతం మంది రాత్రిపూట గురక పెట్టేవారు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి.
నగరవాసుల్లో ఎక్కువగా..
నగరవాసుల్లో చాలామందిని గురక సమస్య వేధిస్తోంది. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, ఊబకాయం, మద్యపానం, ధూమపానం అలవాట్లు ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (వోఎస్‌ఏ) అనేది గురకకు కారణమవుతోంది. కండరాలతో నిర్మాణం అయిన ఊపిరి గొట్టంలో నిద్రపోయే సమయంలో కలిగే ఆటంకంతో ఆ శబ్దం వస్తుంది. ఇలా వచ్చే శబ్దాన్నే గురక అంటారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారికి గురక రాదు. గురక ఉన్నవారికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందితో తరచూ నిద్రలోంచి మేల్కొంటారు. దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉంటే గుండె కొట్టుకునే వేగం పెరిగి.. నిద్రలోనే హార్ట్ ఎటాక్‌లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
పాలిసొమ్నోగ్రఫీతో పరీక్ష
స్లీప్ అప్నీయాతో బాధపడే వారికి స్లీప్ స్టడీస్ (పాలిసొమ్నోగ్రఫీ) పరీక్ష అవసరమవుతుంది. గురకతో బాధపడుతున్న వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో అతని శరీర వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో ప్రత్యేక పరికరాలతో పరిశీలించి రికార్డు చేస్తారు. ఇందులో మెదడు పనితీరు తెలుసుకునేందుకు ఎలక్ట్రోఎన్సెపలోగ్రఫీ (ఈఈజీ), గుండె పనితీరు కోసం ఎలక్ట్రోకార్డియోగ్రఫీ (ఈసీజీ) కండరాల కదలికల కోసం ఎలక్ట్రోమియోగ్రామ్ తదితర పరికరాలను శరీరానికి అనుసంధానించి ఏ మేరకు నాణ్యమైన నిద్రపోతున్నారో లేదో అని పరీక్షిస్తారు.
జనాభాలో 10 శాతం మందికి
గురక సమస్యతో ఉమ్మడి జిల్లా జనాభాలో 10 శాతం మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ప్రతీరోజు 150మందికి పైగా అంటే నెలకు సుమారు 5,000 మంది గురక సమస్యతో ఆసుపత్రులకు వచ్చి చికిత్స పొందుతున్నారు. ఇందులో 200 మందికి పైగా అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా పరీక్ష చేయించు కుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ దీర్ఘకాలిక సమస్యగా బాధపడే వారు 2,000 మంది వరకు ఉంటారని వైద్యుల అంచనా.
జీవనశైలిలో మార్పులతో..
గురకను తగ్గించుకోవాలంటే చికిత్సతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. వ్యాయామం, మద్య, ధూమపానాల వాడకాన్ని తగ్గించుకోవడం. షుగర్, బీపీ, థైరాయిడ్ కంట్రోల్‌లో ఉంచుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం వల్ల గురక సమస్యకు మెరుగైన ఫలితం ఉంటుంది. నిద్రతో మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. నిద్రలో వచ్చే చిన్నచిన్న సమస్యలకూ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి వైద్యం చేయించుకోవాలి. – వినయ్‌కుమార్, పల్మనాలజిస్టు
లక్షణాలు ఇవీ
నిద్రలో ఐదుకన్నా ఎక్కువసార్లు శ్వాస ఆగిపోయినట్లు అనిపించి మెలకువ రావడం
నిద్రపోయినా ఉదయం లేవగానే నిద్రలేమి ఉన్నట్లు అనిపించడం
రాత్రి పూట ఛాతీలో నొప్పి.. నిద్రలేవగానే గొంతులో నొప్పి
నిద్రలేవగానే తలనొప్పి, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలతో బాధపడే వారిని గురక బాధితులుగా గుర్తిస్తారు.
జాగ్రత్తలు
ఊబకాయంతో బాధపడుతుండే వారి బరువును తగ్గించుకోవడం
ఆల్కహాల్, స్మోకింగ్ వంటి అలవాట్లను మానుకోవడం
బీపీ, షుగర్, థైరాయిండ్ నార్మల్‌గా ఉంచుకోవడం
ప్రతీరోజు వాకింగ్, వ్యాయామం వంటివి చేయాలి.