ఊహలకు అందని రూపాలు

Artist-Entrepreneur Srinia Chowdhury On Creating Functional art - Sakshi

టీ కప్పులు, మగ్‌లను అందమైన కళారూపాలుగా మార్చుతూ, ఫంక్షనల్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తూ, మార్కెటింగ్‌ చేస్తూ, ఆర్ట్‌ప్రెన్యూర్‌గా మారింది శ్రీనియా చౌదరి. ఈ కళారూపం అంతగా సక్సెస్‌ కాదన్న వారి నోళ్లను మూయిస్తూ, ఛాలెంజ్‌గా తీసుకొని మరీ ఈ కళలో రాణిస్తోంది. ఢిల్లీలో సొంతంగా స్టూడియో ఏర్పాటు చేసుకోవడంతో పాటు తన కళారూపాలను వివిధ దేశాలకు ఎక్స్‌పోర్ట్‌ చేస్తోంది.  

    ఎవరి ఊహకూ అందని కళారూపాలు శ్రీనియా చేతుల్లో రూపుదిద్దుకుంటాయి. పదేళ్లుగా సిరామిక్‌ మెటీరియల్‌తో మగ్‌లను తయారుచేస్తూ, వాటినే అందమైన కళాఖండాలుగా తీర్చిదిద్దుతోంది. యూరప్‌లోని లాట్వియాలో సిరామిక్స్‌ బియన్నాలే, మార్క్‌ రోత్కో మ్యూజియంలలోనూ తన కళారూపాలు స్థానాన్ని పొందాయంటే శ్రీనియా కృషి, పట్టుదల ఎంత బలమైనవో ఇట్టే తెలిసిపోతాయి.

సాధనమున సమకూరిన కళ

స్వతహాగా చిత్రకారిణి అయిన శ్రీనియా ఈ కళలో రాణించడానికి మట్టిపైనే చిత్రాలు వేసేది. ఆ తర్వాత మట్టితో కళారూపాలు తయారుచేసి వాటిపైనే చిత్రీకరించేది. తన ప్రతి చిత్రంలోనూ సమాజం గురించిన ఆలోచనలు ప్రతిబింబిస్తాయి. ‘సెరామిక్స్‌తో రకరకాల కళాత్మక రూపాలను తయారుచేయడం అనేది శతాబ్దాలుగా ఉంది. కానీ, నేను ప్రత్యేకంగా ఎంచుకున్న మగ్గులతో డిజైన్లు, మగ్గులపై పెయింటింగ్‌.. ప్రజల్లో మంచి డిమాండ్‌ ఉంది. దీనిని అనుసరించే నేను నా దైన సృజనను జోడించాను. అభ్యాసనకు మట్టితోనే కళారూపాలను తీర్చడంలో కొన్నాళ్లు నిమగ్నమయ్యాను. ఎంతోమందిని అవి ఆకట్టుకున్నాయి. వీటికున్న డిమాండ్‌ను బట్టి ఆర్ట్‌ప్రెన్యూర్‌గా మారాలనుకున్నాను.

నెలల సమయం..

కోవిడ్‌ టైమ్‌లోనూ నా ఆలోచనా విధానాన్ని నలుగురితో పంచుకోవడానికి, శిక్షణ ఇవ్వడానికి  వెబ్‌షాప్‌ను ప్రారంభించాను. కొన్ని వారాల పాటు వెబ్‌షాప్‌ను నిర్వహించాను. వ్యూవర్స్‌లో మంచి ఆసక్తి కనపడింది. కానీ, నిత్యసాధనతోనే ఈ కళలో రాణించగలరు. ఏ కాలమైనా సరే యంత్రంతో తయారుచేసిన వస్తువుకన్నా, పూర్తిగా చేతితో తయారుచేసిన  వస్తువు ఖరీదు ఎక్కువ. అందుకే, సిరామిక్‌తో మగ్‌ తయారీ నుంచి వాటి రూపాల్లో మార్పులతో పాటు.. ఒక కళాఖండంగా తయారుచేయడానికి చాలా సమయం పడుతుంది. ముందుగా నేను అనుకున్న కళారూపం స్కెచ్‌ వేసుకుంటాను.

అది సంతృప్తిగా అనిపించాక దానిని వాస్తవ రూపానికి తీసుకు రావడానికి నెలల సమయం పడుతుంది. ఒక్కో సమయంలో అయితే ఒక చిన్న పీస్‌ను మాత్రమే తయారు చేస్తుంటాను. ఒకదానితో మరోటి అస్సలు పోలికే ఉండదు. దేనికది ప్రత్యేకం. కానీ, అన్ని కళారూపాలకు మంచి డిమాండ్‌ ఉంది. ఆన్‌లైన్‌ వేదిక ద్వారా నా కళారూపాలను నేనే మార్కెటింగ్‌ చేస్తుంటాను. విదేశీయులు కూడా ఈ ఫంక్షనల్‌ ఆర్ట్‌ను బాగా ఇష్టపడుతున్నారు. వ్యాపారిగా మారినప్పటికీ ప్రతీ కళారూపాన్ని నేనే స్వయంగా సృష్టిస్తాను. ఎవరి సాయమూ తీసుకోను. అచ్చులు పోయడం అనేది నా ఆలోచనకు పూర్తి విరుద్ధం. అందుకే ప్రతీ కళాఖండం విభిన్నంగా ఉంటుంది’ అని వివరిస్తారు శ్రీనియా.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top