కమెడియన్‌ను చంపింది ఎవరు? రోర్‌సాక్‌ చెప్పింది నిజమేనా?

Alan Moore Watchmen Book Review - Sakshi

మై ఫెవరెట్‌ బుక్‌

వాచ్‌మెన్‌ రచన: అలెన్‌ మోర్‌

పూజా హెగ్డేకు ఆటలు, పాటలు ఎంత ఇష్టమోపుస్తకాలుచదవడం కూడా అంతే ఇష్టం. లాక్‌డౌన్‌లో ఖాళీ సమయాన్ని పుస్తకాలకు వినియోగించిందట. ఆమెకు నచ్చిన పుస్తకాల్లో ఒకటి గ్రాఫిక్‌ నావెల్‌ వాచ్‌మెన్‌. ఈ పుస్తకం గురించి...

బ్రిటీష్‌ రచయిత అలెన్‌ మోర్, ఆర్టిస్ట్‌ డేవ్‌ గిబన్స్, కలరిస్ట్‌ జాన్‌ హిగ్గిన్స్‌ల అద్భుత సృష్టి  వాచ్‌మెన్‌. నిజానికి ఈ పుస్తకానికి ముందు, పుస్తకం తరువాత ఎన్నో కామిక్స్‌ నావెల్స్‌ వచ్చాయి. అయితే ‘వాచ్‌మెన్‌’ మాత్రం ఒక మైలురాయిగా నిలిచింది. కాలంతో కలిసి నడిచే పుస్తకాలు కొన్ని మాత్రమే ఉంటాయి. ఇది అలాంటి పుస్తకమే. అమెరికన్‌ పబ్లిషింగ్‌ హౌజ్‌ డీసీ కామిక్స్‌ 1986లో తొలిసారిగా ప్రచురించిన ఈ పుస్తకం ‘లీస్ట్‌ ఆఫ్‌ ది 100 బెస్ట్‌ నావెల్స్‌’లో ఒకటిగా నిలిచింది. సినిమాగా వచ్చింది. వీడియో గేమ్‌ సిరీస్‌లతో అలరించింది.

 ఈ పుస్తకం చదువుతున్నప్పుడు రెగ్యులర్‌ కామిక్‌ బుక్‌లాగా అనిపించదు. ఇంకా చెప్పాలంటే ‘కాంప్లెక్స్‌ స్టఫ్‌’గా అనిపిస్తుది. ఎందుకీ కాంప్లెక్స్‌? ఎందుకంటే ఇది ‘అల్టర్‌నేటివ్‌ హిస్టరీ’ జానర్‌లో వచ్చిన నవల. ఈ నవలలో కనిపించే నిర్ధిష్టమైన కాలానికి సంబంధించిన చరిత్ర (కోల్డ్‌వార్, నిక్సన్‌ పాలన, న్యూక్లియర్‌వార్‌....మొదలైన విషయాలు) ఎంతో కొంత మనకు తెలిసి ఉంటే సంక్లిష్టత దూరం అవుతుంది. ‘ది వాచ్‌మెన్‌’ పేరుతో అమెరికన్‌ గవర్నమెంట్‌కు సహాయపడే సూపర్‌ హీరోల బృందం ఉంటుంది. అందులో కొందరు...

1. డా.మన్‌హట్టన్‌   2. సిల్క్‌ స్పెక్టర్‌   3. ఒజిమాండియస్‌ 4. నైట్‌ వోల్‌   5. రోర్‌సాక్‌   6. కమెడియన్‌ అమెరికన్‌ గవర్నమెంట్‌ ‘కీన్‌ యాక్ట్‌’  పాస్‌ చేయడంతో  సూపర్‌హీరోల ప్రాభవం తగ్గుతుంది. నిజానికి ఈ సూపర్‌హీరోలు అప్పటికే దాదాపుగా  రిటైరై ఉంటారు. అయితే డా.మన్‌హట్టన్‌ ప్రభుత్వం తరఫున పనిచేస్తుంటాడు. రోర్‌సాక్‌ అండర్‌గ్రౌండ్‌ కార్యకలాపాల్లో బిజీగా ఉంటాడు.

అది 1986 సంవత్సరం. అక్టోబర్‌ నెల...న్యూయార్క్‌ సిటీలో ఎడ్వార్డ్‌ బ్లేక్‌ అనే వ్యక్తి హత్యకు గురవుతాడు. అతడిని చంపి గ్లాస్‌ విండో నుంచి బయటికి విసిరేస్తారు హంతకులు. డిటెక్టివ్‌లు రంగప్రవేశం చేస్తారు. అణువణువూ  గాలిస్తారుగానీ ఏ ఒక్క ఆధారం వారికి చిక్కదు. పక్కా ప్లాన్‌తో జరిగిన మర్డర్‌ అనే విషయం అర్థమవుతుంది. సూపర్‌హీరోల్లో ఒకడైన రోర్‌సాక్‌ ఈ హత్య గురించి సొంతంగా దర్యాప్తు ప్రారంభిస్తాడు. హత్యకు గురైన ఎడ్వార్డ్‌ బ్లేక్‌ ఎవరో కాదని సూపర్‌ హీరోల్లో ఒకడైన ‘కమెడియన్‌’ అనే నిజం తెలుస్తుంది. ఇతడి హత్య వెనుక వ్యక్తిగత పగలు, ప్రతీకారాలు ఏమీ లేవని సూపర్‌ హీరోలు అందరినీ తుదముట్టించే పనిలో భాగంగానే ఇది జరిగిందని, ఈ హత్య ఒక హెచ్చరిక అని నిర్ధారణకు వస్తాడు. తాను నమ్మింది ఇతర సూపర్‌ హీరోలకు చెబుతాడు. అయితే వారు ఇతడి మాటలను సీరియస్‌గా తీసుకోరు.

కమెడియన్‌ను చంపింది ఎవరు? ఎందుకు చంపారు? రోర్‌సాక్‌ చెప్పింది నిజమేనా? మహత్తరమైన శక్తులు ఉన్నవాడిగా పేరున్న డా. మన్‌హట్టన్‌ అంగారక గ్రహానికి ఎందుకు వెళ్లాడు...ఇలాంటి ఆసక్తికరమైన విషయాలలోకి వెళ్లవచ్చు. నిజానికి ఈ పుస్తకం ‘కథావస్తువు’ గురించి మాత్రమే మాట్లాడడం అంటే కుదరదు. కచ్చితంగా బొమ్మల అద్భుతం గురించి మాట్లాడుకోవాల్సిందే. వావ్‌! ఆ బొమ్మలను చూసి తరించాల్సిందే.  ఆర్టిస్ట్‌ డేవ్‌ గిబన్స్‌ బొమ్మలతో తన ప్రత్యేకతను  చాటుకున్నాడు. ఆ కాలంలో సూపర్‌ హీరో కామిక్‌ బుక్స్‌ పోస్టర్‌–టైప్‌ పేజీ లేఔట్లతో, ఒక పెద్ద సీన్‌ దాని చుట్టూ ప్యానెల్స్‌తో వచ్చేవి. దీంట్లో మాత్రం 9–ప్యానల్‌ గ్రిడ్‌ లే ఔట్‌లో కాగితాల్లోనే సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top