
రెండు నెలలుగా జీతాలు అందక విలవిల
నూజివీడు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇస్తాం.. ఇదీ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన మాటలు. కానీ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. రెండు నెలలుగా జీతాలు లేక నాలుగు ట్రిపుల్ ఐటీల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో పనిచేస్తున్న దాదాపు 750 మంది కాంట్రాక్టు బోధనా సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు లేవు. మార్చి నెలకు చెందిన వేతనాలు, ఏప్రిల్‌కు సంబంధించిన వేతనాలు ఆరో తేదీ గడిచినప్పటికీ రాకపోవడంతో సిబ్బంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దీంతో కుటుంబ ఖర్చులకు, ఇతర అవసరాలకు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. మరోపక్క ఆ అప్పులపై వడ్డీల భారం అదనమని వారు వాపోతున్నారు. సకాలంలో జీతాలు ఇస్తే ఈ తలనొప్పి ఉండదని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
అవుట్‌సోర్సింగ్ సిబ్బందికే ఇవ్వలేదు
నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కాంట్రాక్టు పద్ధతిలో మెంటార్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, గెస్ట్ ఫ్యాకల్టీలు, ల్యాబ్ అసిస్టెంట్‌లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఐటీ మెంటార్లు పనిచేస్తున్నారు. పర్మినెంట్ ఫ్యాకల్టీకి జీతాలు రాగా, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి మాత్రం గత నెల, ఈ నెలలో ఇప్పటివరకు జీతాలు ఇవ్వకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం వల్ల ఆసుపత్రి ఖర్చులు, పిల్లల ఫీజుల చెల్లింపు, నెలవారీ మందుల ఖర్చులు, పాల బిల్లులు, సరకుల బిల్లులు, రుణ ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.
జీతాలు నెలకు రూ.3 కోట్లు
నాలుగు ట్రిపుల్ ఐటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు నెలకు రూ.3 కోట్లు జీతాల కింద చెలిస్తారు. రెండు నెలలకు కలిపి రూ.6 కోట్లు చెల్లించాల్సి ఉంది. రెండు నెలలుగా సకాలంలో చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలోనే బడ్జెట్ మంజూరైందని స్థానిక ట్రిపుల్ ఐటీ అధికారులు చెబుతుండగా, ఇంతవరకు ఎందుకు జీతాలు రాలేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ట్రిపుల్ ఐటీల్లోని కాంట్రాక్టు బోధనా సిబ్బంది దుస్థితి
నేడో రేపో జమ అవుతాయి
కాంట్రాక్టు సిబ్బంది వేతనాలు నేడో, రేపో జమవుతాయి. జీతాల బిల్లులను అప్‌లోడ్ చేశాం. ప్రాసెస్‌లో ఉన్నాయి. పర్మినెంట్ ఉద్యోగులకు మూడు రోజుల క్రితమే వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. పర్మినెంట్, కాంట్రాక్టు సిబ్బందికి హెడ్‌లను వేరువేరుగా పెట్టడంతో జాప్యం జరిగింది. ప్రతినెలా సకాలంలోనే జీతాలను ప్రభుత్వం విడుదల చేస్తోంది. – సండ్ర అమరేంద్రకుమార్,
ఆర్జీయూకేటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్