
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వేళాయె..
ద్వారకాతిరుమల: చిన్నతిరుమలేశునికి జరిగే బ్రహ్మోత్సవాలు ఇలలో ఓ అద్భుతం.. వర్ణనాతీతం. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఈనెల 7 నుంచి 14 వరకు (8 రోజుల పాటు) ద్వారకాతిరుమల దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఈ ఉత్సవాలు శ్రీవారి వైభవాన్ని చాటనున్నాయి. క్షేత్రంలో ప్రతి ఏటా (రెండు సార్లు) వైశాఖ మాసంలో వెలసిన స్వామికి, ఆశ్వయుజ మాసంలో ప్రతిష్ఠ స్వామికి ఈ బ్రహ్మోత్సవాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. వీటితో పాటు నిత్యోత్సవ, వారోత్సవ, మాసోత్సవాలను అట్టహాసంగా జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 7 నుంచి శ్రీవారి వైశాఖమాస బ్రహ్మోత్సవాలను కన్నులపండువగా నిర్వహించనున్నారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో స్వామివారు ఉభయ దేవేరులతో కలసి ఉదయం, సాయంత్రం వేళల్లో పలు వాహనాలపై తిరువీధుల్లో విహరించనున్నారు. అలాగే ఆలయ ముఖ మండపంలో రోజుకో విశేష అలంకారంలో శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదికపై ఉదయం నుంచి రాత్రి వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.
ఉత్సవాలు జరిగేదిలా..
● ఈనెల 7న ఉదయం శ్రీవారిని పెండ్లికుమారునిగా, అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా చేసి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి గజ వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది.
● 8న రాత్రి 7 గంటల నుంచి అంకురార్పణ, రుత్విగ్వరణ అనంతరం బ్రహ్మోత్సవాల వీక్షణకు సర్వాది దేవతలను ఆహ్వానించే క్రమంలో ధ్వజారోహణను నిర్వహిస్తారు. రాత్రి 9 గంటల నుంచి హంస వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది.
● 9న ఉదయం 7 గంటల నుంచి సూర్యప్రభ, రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనాలపై గ్రామోత్సవాలు జరుగుతాయి.
● 10న ఉదయం 7 గంటల నుంచి హనుమద్వాహనంపై గ్రామోత్సవం, రాత్రి 7 గంటల నుంచి ఎదుర్కోలు ఉత్సవం, రాత్రి 8.30 గంటల నుంచి వెండి శేష వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది.
● 11న రాత్రి 8 గంటల నుంచి శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం, అదే రోజు ఉదయం 7 గంటల నుంచి సింహ వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది.
● 12న రాత్రి 8 గంటల నుంచి క్షేత్ర పురవీధుల్లో రథోత్సవం జరుగుతుంది.
● 13న ఉదయం 10.30 గంటల నుంచి చక్రవారి–అపభృధోత్సవము, మధ్యాహ్నం 3 గంటల నుంచి వేద సభ, రాత్రి 8 గంటల నుంచి పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజావరోహణ, రాత్రి 9 గంటల నుంచి అశ్వ వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది.
● 14న ఉదయం 9 గంటల నుంచి చూర్ణోత్సవం, వసంతోత్సవ వేడుకలు జరుగుతాయి. అలాగే రాత్రి 7 గంటల నుంచి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగము – పవళింపు సేవ కార్యక్రమాలతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి.
దాదాపుగా పూర్తయిన ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాలకు సమయం దగ్గర పడటంతో స్వామివారి వాహనాలను సిబ్బంది ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు నిర్మించారు. అలాగే ఆలయ రాజగోపురాలు, పరిసరాలకు విద్యుద్దీప అలంకారాలు చేశారు. దాంతో ఉత్సవ ఏర్పాట్లకు సంబంధించిన పనులు దాదాపుగా పూర్తయ్యాయి.
రేపటి నుంచి ద్వారకాతిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
11న రాత్రి తిరుకల్యాణం, 12న రాత్రి రథోత్సవం
రోజుకో ప్రత్యేక అలంకారంలో దర్శనమివ్వనున్న శ్రీవారు
ఉత్సవాలు ముగిసే వరకు ఆర్జిత సేవలు రద్దు
ప్రత్యేక అలంకారాలు ఇలా..
ఈనెల 7న శ్రీ మహావిష్ణువు
8న మత్స్యావతారం
9న శ్రీరామ
10న మురళీకృష్ణ
11న మోహిని
12న రాజమన్నార్
13న కాళీయమర్థనం
14న శయన మహావిష్ణువు
భక్తులు తరలిరావాలి
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉత్సవాల్లో పాల్గొనే సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తాం. 8 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలి. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 7 నుంచి 14 వరకు ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నాం. భక్తులు గమనించాలి.
– ఎన్‌వీ సత్యన్నారాయణ మూర్తి, శ్రీవారి దేవస్థానం ఈఓ

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వేళాయె..

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వేళాయె..