
కొనసాగుతున్న సీహెచ్‌ఓల నిరసన
భీమవరం (ప్రకాశం చౌక్): విలేజ్ క్లినిక్‌ల సీహెచ్‌ఓల నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. గత 8 రోజులుగా వారు తమ సమస్యలపై నిరసన గళం వినిపిస్తున్నారు. భీమవరం కలెక్టరేట్ వద్ద టెంట్ వేసుకుని ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉద్యోగ భద్రత, న్యాయమైన డిమాండ్లపై పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిత్యం గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించే వారు రోజుల తరబడి నిరసన కార్యక్రమంలో ఉండడం వల్ల గ్రామాల్లో స్థానిక వైద్య సేవలు నిలిచిపోయాయి. పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామం విలేజ్ క్లినిక్‌లో ఒక ఆర్‌ఎంపీ డాక్టర్ వెళ్లి వైద్య సేవలు అందించినట్లు సీహెచ్‌ఓల యూనియన్ నాయకులు మీడియా దృష్టికి తీసుకువచ్చారు. అతడు వైద్యం చేస్తున్న ఫొటోలు సేకరించి, వారు లేని విలేజ్ క్లినిక్‌లలో పరిస్థితి ఏ విధంగా ఉందో మీడియాకు తెలియజేశారు. అలాగే పలు చొట్లు ఆరోగ్య మిత్రలు వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. వైద్యా ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరితో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శిస్తున్నారు.