
కుసుమ ధర్మన్న సాహిత్యం నేటి తరానికి ఆదర్శం
పాలకొల్లు సెంట్రల్: జాతీయ ఉద్యమకారుడు, 19వ శతాబ్ధపు తొలితరం దళిత కవి కుసుమ ధర్మన్న ఉద్యమ సమరంతో పాటు సామాజిక సేవలో ఎంతో విశిష్టత సాధించారని, ఆయన సాహిత్యం నేటితరానికి ఆదర్శనీయమని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపారాణి అన్నారు. సోమవారం స్థానిక మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లెల్ల సత్య సుధామ (సామాజిక సేవా రంగం), ఉన్నమాటి శ్యాంసుందర్ (కార్టూన్ జర్నలిజం), డాక్టర్ పెంకి విజయ్ కుమార్, వాసంశెట్టి దుర్గా శంకర్ (కళారంగం), మామిడిశెట్టి శ్రీనివాస్ (తెలుగు సాహిత్యం) లకు కుసుమ ధర్మన్న ప్రతిభా పురస్కారాలు అందజేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు కవులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించారు. బత్తుల మురళీకృష్ణ రచించిన జముకు, దీర్ఘ కవితను, తంగిరాల సోనీ సంపాదకత్వంలో వెలువడిన ప్రజాకాంక్ష ప్రత్యేక సంచికను అతిథులు ఆవిష్కరించారు. కుసుమ ధర్మన్న సాహిత్య వేదిక రాష్ట్ర నూతన అధ్యక్షునిగా కోలాటి చిన పెద్దిరాజు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో నేలపూరి రత్నాజీ, పేరూరి మురళీకుమార్, గొల్లపల్లి అంబేద్కర్, డా అలుగు ఆనంద్, సాహితీవేత్తలు, కళాకారులు పాల్గొన్నారు.