
వివాహ వేడుక వద్ద ఘర్షణ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
ముసునూరు: వివాహ వేడుక వద్ద జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. రమణక్కపేట శివారు కండ్రిక గ్రామంలో సోమవారం దొడ్డి ప్రసాద్ కుమారుడి వివాహ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు మద్యం సేవించారు. మద్యం మత్తులో వారి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో అదే గ్రామానికి చెందిన పాలకుర్తి శేఖర్‌పై దొడ్డి ప్రసాద్, అతని సహచరులు కర్రలు, కత్తులతో దాడి చేశారు. క్షతగాత్రుడిని బంధువులు 108 వాహనంలో నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ దాడి గురించి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై ఎం.చిరంజీవి చెప్పారు.
కోడి వ్యర్థాలను తరలిస్తున్న వాహనాల సీజ్
భీమడోలు: కోడి వ్యర్థాలను తరలిస్తున్న రెండు వాహనాలను సోమవారం పోలీసులు సీజ్ చేశారు. ఎస్సై వై.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం పెదపాడు గ్రామానికి చెందిన గండికోట వినయ్ హైదరాబాద్ నుంచి భీమడోలు పంచాయతీ శివారు లింగంపాడు ఏరియాలోని లంక నానికి చెందిన చేపల చెర్వులకు రెండు వాహనాల్లో కోడి వ్యర్థాలను తరలిస్తుండగా భీమడోలు పోలీసులు పట్టుకున్నారు. సుమారు 15 టన్నుల కోడి వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యర్థాలను గోతుల్లో పూడ్చారు. వాహన డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ చెప్పారు.