
శ్రీవారి క్షేత్రంపై గాలివాన ఎఫెక్ట్
ద్వారకాతిరుమల: ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఈదురు గాలులు, భారీ వర్షం కారణంగా శ్రీవారి ఆలయ ఆవరణలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పాక్షికంగా దెబ్బతింది. ద్వారకాతిరుమల–భీమడోలు ప్రధాన రహదారిలో పలు చోట్ల వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. కుంకుళ్లమ్మ ఆలయ సమీపంలో, గొల్లగూడెం, పంగిడిగూడెం వద్ద రోడ్డుపై నీరు నిలిచింది. వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. ద్వారకాతిరుమలలో వర్షం దాటికి డ్రైనేజీలు పొంగిపొర్లడంతో మురుగు, చెత్తా, చెదారం రోడ్డుపైకి చేరింది. దాంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సొసైటీ పెట్రోల్ బంకు ఎదురుగా, లక్ష్మీపురం నిర్మిత కేంద్రం, దొరసానిపాడు శివారులో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ వైర్లపై పడ్డాయి. దాంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మార్కెట్ యార్డులో కూరగాయల దుకాణాలు గాలులకు అతలాకుతలమయ్యాయి.