
శవాలు కుళ్లిపోతున్నా పట్టించుకోరా?
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగం ఆధ్వర్యంలో శవ పరీక్ష కేంద్రం(మార్చురీ) పనిచేస్తోంది. నిత్యం జిల్లా పరిధిలో రోడ్డు, రైలు ప్రమాదాల్లో మరణించినవారు, అనుమానాస్పద మృతులు, హత్యలు, ఆత్మహత్యలు, చికిత్స పొందుతూ మృతిచెందిన వారి మృతదేహాల్ని మార్చురీలో భద్రపరుస్తారు. మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగానికి చెందిన వైద్య నిపుణులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగిస్తుంటారు. మార్చురీలోని ఫ్రీజర్ బాక్సులు పనిచేయక బంధువుల మృతదేహాలు పాడవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా సరిగా అంతిమ సంస్కారాలు చేయలేని పరిస్థితి నెలకొందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కేవలం ఐదు ఫ్రీజర్లే దిక్కు
ఏలూరు జిల్లా వ్యాప్తంగా రోజూ రెండు, మూడు లేదా ఒక్కోసారి నాలుగైదు మృతదేహాలు జీజీహెచ్‌లోని మార్చురీకి వస్తాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణించినవారు, గుర్తు తెలియని మృతదేహాలు, రైల్వే డెత్స్ మృతదేహాలు మార్చురీలో రోజుల తరబడి భద్రపరచాల్సిన అవసరం ఉంటుంది. మార్చురీలో కేవలం రెండు పాత ఫ్రీజర్ బాక్సులు, మరో మూడు స్వచ్ఛంద సంస్థకు చెందిన ఫ్రీజర్ బాక్సులు ఏర్పాటు చేసిన అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.
సిబ్బంది నిర్లక్ష్యం వల్లే..
ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన కొత్తలో 12 మృతదేహాలను భద్రపరిచేలా ఫ్రీజర్ బాక్సులు అందుబాటులో ఉంచారు. మొదటి నుంచి ఈ ఫ్రీజర్ బాక్సులు పనిచేయటంలేదు. మరో రెండు పాత ఫ్రీజర్ బాక్సులు పూర్తిగా పాడైపోవటంతో బయో మెడికల్ ఇంజనీర్ విభాగం వాటిని పక్కన పెట్టేసింది. ఫ్రీజర్ బాక్సులు సక్రమంగా పనిచేయటం లేదని ఉన్నతాధికారులకు మొదట్లోనే నివేదించారని మెడికల్ కాలేజీ అధికారులు చెబుతున్నారు.
జీజీహెచ్‌లో పరిష్కారం కాని ఫ్రీజర్ల సమస్య
ఆవేదనలో మృతుల బంధువులు
ఏలూరు జీజీహెచ్‌లోని మార్చురీలో ప్రస్తుతం మరమ్మతులు చేసిన రెండు పాత ఫ్రీజర్ బాక్సులు, మరో మూడు స్వచ్చంద సంస్థకు చెందిన ఫ్రీజర్ బాక్సులు అందుబాటులో ఉన్నాయని మెడికల్ కాలేజీ అధికారులు చెబుతున్నారు. ఏలూరు జిల్లా పరిధిలో రోజూ మూడు నుంచి నాలుగు మృతదేహాలు మార్చురీకి వస్తాయి. రైల్వే ప్రమాదాల్లో మృతదేహాలకు వారం రోజులకు పైగా పోస్టుమార్టం నిర్వహించే పరిస్థితి ఉండదు. సరాసరి రోజుకు మూడు నుంచి నాలుగు మృతదేహాలు మార్చురీలో భద్రపరుస్తారు. ఒక్కోసారి ఐదారు మృతదేహాలు మార్చురీకి వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2 పాత ఫ్రీజర్ బాక్స్ లు, స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన 3 ఫ్రీజర్ బాక్స్‌లు మాత్రమే ఉంటే మృతదేహాలను భద్రపర్చడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ఫ్రీజర్ బాక్సులు లేకుంటే బంధువుల మృతదేహాలు పాడై దుర్గంధం వెదజల్లితే వారి కుటుంబ సభ్యులు ఎంత ఆవేదనకు గురవుతారనేది అధికారులకు పట్టదా? అని ప్రశ్నిస్తున్నారు.