
కారు ఢీకొని 8 గొర్రెల మృతి
ద్వారకాతిరుమల: మండలంలోని లైన్ గోపాలపురం జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం కారు ఢీకొని ఎనిమిది గొర్రెలు మృతి చెందాయి. స్థానికుల కథనం ప్రకారం.. లైన్ గోపాలపురానికి చెందిన రైతు దండుబోయిన కొండయ్య గొర్రెలను సమీపంలోని ఒక తోటలో మేపి, సాయంత్రం ఇంటికి తోలుకెళుతున్నాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి రోడ్డు దాటుతున్న గొర్రెలను ఏలూరు నుంచి రాజమండ్రి వైపుకు వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 8 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.
వరకట్న వేధింపుల కేసు నమోదు
కై కలూరు: వరకట్న వేధింపులతో పాటు, పరాయి సీ్త్రతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడంటూ భర్తపై భార్య రూరల్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చటాకాయి గ్రామానికి చెందిన ఘంటసాల చామంతి(29)తో అదే గ్రామానికి చెందిన ఘంటసాల వెంకన్నబాబు(35)కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలున్నారు. భర్త మద్యానికి బానిసై వరకట్నం కోసం వేధిస్తున్నాడని, అతని తల్లిదండ్రులు సహకరిస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదుపై రూరల్ ఎస్‌ఐ రాంబాబు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.