
రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులకు గాయాలు
ద్వారకాతిరుమల: మండలంలోని రాళ్లకుంట సెయింట్ గ్జేవియార్ పాఠశాల వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కధనం ప్రకారం.. రాళ్లకుంటకు చెందిన పరసా జనార్ధన్, సరోజిని దంపతులు ద్వారకాతిరుమలలోని సొసైటీ పెట్రోల్ బంకు సమీపంలో నిమ్మకాయలు, కొబ్బరి కాయలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వ్యాపారం ముగించుకుని సాయంత్రం టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై స్వగ్రామానికి వెళ్తున్నారు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి జి.కొత్తపల్లి నుంచి ద్వారకాతిరుమల వైపుకు వెళుతున్న ఆటోను వీరి వాహనం ఎదురుగా ఢీకొట్టింది. దాంతో జనార్ధన్, సరోజిని దంపతులు రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. 108 ఆంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో స్థానికులు శ్రీవారి దేవస్థానం ఆంబులెన్స్‌లో పీహెచ్‌సీకి తరలించారు.
ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
తణుకు అర్బన్: వాహనం ఢీకొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన తణుకు పట్టణంలో చోటు చేసుకుంది. 55 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తిని శుక్రవారం తణుకు ఆర్యోబీపై వాహనం ఢీకొట్టింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో ఉంచారు.