చేతులెత్తేసిన సర్కారు | - | Sakshi
Sakshi News home page

చేతులెత్తేసిన సర్కారు

May 3 2025 7:40 AM | Updated on May 3 2025 7:40 AM

చేతుల

చేతులెత్తేసిన సర్కారు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: చివరి గింజ వరకూ ప్రభు త్వం కొంటుంది.. 24 గంటల్లో ప్రతి రైతు ఖాతాల్లో డబ్బు జమ చేస్తాం.. నచ్చిన మిల్లులో విక్రయించుకోవచ్చు.. ఇది పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ మొదలు జిల్లా అధికారుల వరకు రబీ సీజన్‌కు ముందు ప్రకటించిన మాట. కట్‌ చేస్తే.. కొనుగోళ్లు ప్రారంభం కాగానే 50 శాతం ధాన్యమే రైతు సేవా కేంద్రాల్లో కొంటాం.. మిగిలి నవి కొనుగోలు చేయమని.. ప్రభుత్వమేమీ ధాన్యం వ్యాపారం చేయదు కదా అంటూ మంత్రి ప్లేట్‌ ఫిరాయించారు. దీంతో జిల్లాలో అన్నదాత పరిస్థితి రోడ్డున పడింది. ఆరుగాలం శ్రమించి పంట పండించడం ఒక ఎత్తయితే.. వాటిని అమ్ముకుని సొమ్ము చేయడానికి రైతు సేవా కేంద్రాలు, మిల్లుల వద్ద వాహనాలకు అద్దెలు చెల్లించి మరీ రోజుల తరబడి ఎదురుచూసే పరిస్థితులు జిల్లాలో ఉత్పన్నమయ్యాయి. శుక్రవారం ఉంగుటూరు మండలం కై కరం, ఏలూరు రూరల్‌, దెందులూరుతో సహా పలు చోట్ల రైతులు ఆందోళనలకు దిగారు.

తుది దశకు కొనుగోళ్లు

జిల్లాలో రబీ కొనుగోళ్లు ప్రభుత్వ అధికారిక సమాచార ప్రకారం తుది దశకు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 77 వేల ఎకరాల్లో 3.53 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. కొనుగోళ్లకు ముందు నుంచే గోనె సంచుల కొరత, అందుబాటులో ఉన్న అరకొర గోనె సంచులు కూడా చినిగిపోయి ఉండటం, అలాగే తేమ శాతం ఎక్కువ ఉందనే సాకుతో పీఆర్‌–126 ధాన్యంపై ఆంక్షలు విధించి కొనుగోలు చేయకపోవడం వంటి సమస్యలతో సీజన్‌ ప్రారంభమైంది. అయితే ప్రభుత్వం మాత్రం వేలం పాట తరహాలో ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని నిర్ణయించింది. తొలుత జిల్లాలో 1.50 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించిందని జాయింట్‌ కలెక్టర్‌ ప్రకటించారు. రైతుల అభ్యర్థన మేరకు 2 లక్షల టన్నులకు పెంచినట్టు మరలా అధికారులు ప్రకటించారు. ఇప్పుడు రైతుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉందని మరో 20 వేల టన్నులు మొత్తంగా 2.20 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామని సరిగ్గా రెండు రోజుల క్రితమే ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పటికే జిల్లాలో 1.98 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం 117 రైతు సేవా కేంద్రాల ద్వారా సేకరించింది. ఈ మేరకు రైతులకు రూ.287 కోట్లు జమ చేయగా రూ.155 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. రోజురోజుకూ ధాన్యం కొనుగోలు టార్గెట్‌ పెంచడం, తగ్గించడం వంటి చర్యలతో పల్లెల్లో అగచాట్లు పెరుగుతున్నాయి.

గత ప్రభుత్వంలో నూరు శాతం

గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు అన్నదాత జిల్లాలో రోడ్డెక్కిన సందర్భం లేదు. పండిన పంటను రైతు భరోసా కేంద్రాల్లో నూరు శాతం కొనుగోలు చేసి ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర రైతు ఖాతాలో జమ చేయడంతో దళారులకు ఆస్కారం లేకుండా కొనుగోళ్లు సజావుగా సాగాయి. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. 60 శాతం ప్రభుత్వం కొనుగోలు చేస్తే 40 శాతం తప్పనిసరిగా దళారులకు విక్రయించాల్సిన పరిస్థితి ప్రభుత్వమే కల్పించడం గమనార్హం.

అన్నదాతల ఆందోళన

అధికారులు టార్గెట్లను పెంచుతూ, తగ్గిస్తూ ఉండటంతో రైతు సేవా కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఏలూరు రూరల్‌, దెందులూరు మండలంలోని కొవ్వలి, ఉంగుటూరు నియోజకవర్గంలో కై కరంలో శుక్రవారం రైతులు ఆందోళనలు చేశారు. టార్గెట్‌ పూర్తవుతుందని కొనుగోలు చేయలేమని సేవా కేంద్రాల సిబ్బంది చెబుతున్నారు. రైతు పండించిన పంటను అద్దె వాహనాల్లో తీసుకువచ్చి కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తే టార్గెట్‌ రివైజ్డ్‌ జరిగితే ఆన్‌లైన్‌లో ట్రక్‌ షీక్‌ జనరేట్‌ చేస్తున్నారు. అక్కడ నుంచి మిల్లుకు చేర్చడానికి మరో రెండు రోజులు మొత్తంగా మూడు రోజుల వాహనం అద్దె రైతు చెల్లిస్తున్నారు. అలాగే శాంపిల్స్‌ పేరుతో బస్తాకు కేజీ మిల్లర్లు తీసుకుంటున్నారు.

ధాన్యం కొనుగోళలో తీవ్ర గందరగోళం

జిల్లాలో 2.20 లక్షల టన్నులు కొంటామని ప్రభుత్వం ప్రకటన

1.98 లక్షల టన్నుల సేకరణ పూర్తి

కై కరం, ఏలూరు రూరల్‌లో ధాన్యాన్ని నిరాకరిస్తున్న మిల్లర్లు

ఆందోళనలు చేస్తున్న రైతులు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోచివరి గింజ వరకూ కొనుగోలు

పది రోజుల నుంచి తిరుగుతున్నా..

పది రోజుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తిరుగుతున్నాను. టార్గెట్‌ అయిపోయింది మేమేం చేయలేం, ధాన్యం కొనలేమని సమాధానం చెబుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. నాకు న్యాయం చేయాలని కోరుతున్నా.

– పర్సా సుబ్రహ్మణ్యం, రైతు, రామారావుగూడెం

చేతులెత్తేసిన సర్కారు 1
1/2

చేతులెత్తేసిన సర్కారు

చేతులెత్తేసిన సర్కారు 2
2/2

చేతులెత్తేసిన సర్కారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement