ఎల్లలు దాటించే కళ

Translators On The Cover Editorial By Vardhelli Murali - Sakshi

నిత్యం మధుర ఫలాలు తినేవాడికి పులుపు మీద మనసు పుడుతుందట. మనిషి స్వభావాన్ని అత్యంత సన్నిహితంగా చూసినవాడు మాత్రమే చెప్పగలిగే ఈ వాక్యాన్ని కవులకే కవి అయిన కాళిదాసు పదిహేను వందల సంవత్సరాల క్రితం అన్నాడట. ఈ అట ఎందుకంటే, సంస్కృతంలో దీన్ని చదివినవాళ్లు ఎంతమందో మనకు తెలియదు. తక్కువమంది అని మాత్రమే నిశ్చయంగా చెప్పగలం.

ఆ కాళిదాసుకు వెయ్యి సంవత్సరాల ముందు, మనిషికి శాంతిలోని సౌఖ్యాన్ని తెలియ జేయడానికి బుద్ధ భగవానుడు చెప్పాడని చెప్పేదంతా పాళీ భాషలో ఉంది. అయినా అదంతా మనకు చేరింది. బైబిల్, ఖురాన్‌ తమ మూలభాషలైన హీబ్రూ, అరబిక్‌లను దాటుకొని ప్రపంచ మూలమూలలకూ వ్యాపించాయి. ఒక్కమాటలో దీనంతటికీ కారణం: అనువాదం.

గ్రీకు సోక్రటీసు మనకు సన్నిహితుడే. పారశీక రూమీ కావాల్సినవాడే. గోర్కీ రష్యాలో రాస్తే ఇక్కడి పల్లెటూళ్లలో సమోవార్ల వెచ్చదనం అనుభవించాం. మావో చైనాలో ఏదో చెబితే మన పక్కనే ఉండి మనకు చెప్పాడనుకుని కార్యరంగంలోకి దూకాం. మపాసా ఫ్రాన్సులో చెప్పినదానికి మన చలం చెప్పేవాటితో పోలికలు వెతికాం. పక్కనే కన్నడ దేశంలో ఉన్న భైరప్ప ఏం రాశాడో; పొరుగున మరాఠా ప్రాంతంలో ఉన్న శరణ్‌ కుమార్‌ లింబాలే ఏం చేశాడో అనాయాసంగా తెలుసుకోగలం.

బహుశా ప్రపంచంలోని సారస్వతం అంతా అనువాద రూపంలోనే బతికి ఉంది. ఈ ప్రపంచం నిలిచింది, వివేకవంతమైంది అనువాదంతోనే. ఒక భాషలోని రచనను ఇంకో భాషవాళ్లకు తెలియజేయాలని ఒక అనువాదకుడు ఎందుకు ఉవ్విళ్లూరుతాడో దానికి తనవైన కారణాలు ఉండొచ్చు. భావజాల వ్యాప్తి మొదలు తాను అనుభవించిన సంతోషాన్ని ఇంకొకరికి పంచడం దానికి ప్రేరేపకాలు కావొచ్చు. మూల భాషలోంచి లక్ష్య భాషలోకి ఎలా తేవాలో చెప్పడానికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఆ తెచ్చిన దాని పట్ల అన్నే నిరసనలూ ఉన్నాయి.

పోయే గింజంతా పోగా మిగిలిన పొల్లు మాత్రమే అనువాదం అని చెప్పేంతగా. పూలనే కాదు, ఆ రాళ్లను ముఖాన కొట్టించుకోవడానికి కూడా అనువాదకుడు సిద్ధపడతాడు. పుష్కిన్‌ కవిత్వాన్ని  అనువదించ లేమంటారు. ఆ కారణంగా ఎవరూ అనువాదానికే పూనుకోకపోతే, ఆ అమృతం తాగలేకపోయిన ఇతర భాషీయులకు సువాసన అయినా పీల్చే అవకాశం ఉండదు కదా. అయితే అనువాదకుల వల్ల కూడా లక్ష్యభాషలు వృద్ధి చెందాయి. కొత్త పదాలు పుట్టాయి. కొత్త వ్యక్తీకరణలు పరిచయం అయ్యాయి. ఒక్క మాటలో రచన ఒక కళ అయితే, అనువాదం దాదాపుగా అంతకు తగ్గని కళ.

ఆ స్వీయాభిమానంతోనే, ఈ మధ్య కొందరు అనువాదకులు ‘ట్రాన్స్‌లేటర్స్‌ ఆన్‌ ద కవర్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో ఒక ఉద్యమం చేపట్టారు. ప్రచురణ సంస్థలు రచయితల పేర్లను మాత్రమే కవర్‌ పేజీ మీద వేస్తున్నాయనీ, తమ పేర్లను కూడా గౌరవంగా ముఖపత్రం మీద ముద్రించాలనీ లండన్‌లోని ‘ద సొసైటీ ఆఫ్‌ ఆథర్స్‌’ ప్రచారం ప్రారంభించారు. సెప్టెంబర్‌ 30 నాటి అంతర్జాతీయ అనువాద దినోత్సవం దీనికి ఒక ట్రిగ్గర్‌గా పనికొచ్చింది. దానికి కొనసాగింపుగా చర్చలు జరుగుతున్నాయి. రచయితల సమూహం ప్రచురణకర్తలకు బహిరంగ లేఖ రాశారు. దానికి బలం పెరిగేలా సంతకాల సేకరణ మొదలుపెట్టారు. ఎందరో ప్రసిద్ధ అనువాదకులు సమ్మతి తెలిపారు. పదకొండు వేల మంది సభ్యులున్న అమెరికాకు చెందిన ‘ఆథర్స్‌ గిల్డ్‌’ కూడా వీరికి మద్దతుగా నిలిచింది. 

యాభై లక్షల రూపాయల నగదు కలిగిన ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజును రచయితతో పాటు అనువాదకులకూ 2016 నుంచి సమంగా పంచుతున్నారు. ఇది అనువాద ప్రతిభను గొప్పగా గౌరవించడమే. అయితే, 2018లో ‘ఫ్లైట్స్‌’ పుస్తకానికి గానూ ఈ పురస్కారం గెలుచుకున్న పోలండ్‌ రచయిత్రి ఓల్గా తొకార్చుక్‌ పేరును కవర్‌ మీద వేశారు గానీ, దాన్ని ఆంగ్లంలోకి అనువదించిన జెన్నిఫర్‌ క్రాఫ్ట్‌ పేరును వేయలేదు. పుస్తకం లోపల వేస్తారు; కానీ చూడగానే అనువాదం అని తెలియకుండా అదో చిన్న యుక్తి అనేది కొంత మంది ప్రచురణకర్తల వాదన. అదే సంవత్సరం సాహిత్యంలో అత్యున్నత గౌరవమైన నోబెల్‌ పురస్కారం కూడా పొందిన తొకార్చుక్‌ కూడా ముఖపత్రం మీద అనువాదకుల పేరు వేయాలన్న వాదనకు మద్దతునివ్వడం గమనార్హం.

భిన్న అనువాదాల్లో వెలువడే అదృష్టం ఉన్న రచయితలు కొంతమంది ఉంటారు. అలాంట ప్పుడు అడిగినా అనువాదకుల పేరు కవర్‌ మీద వేయడం జరగకపోవచ్చు. కానీ వారి ప్రతిభతో నిమిత్తం లేకపోయినా అనువాదం కావడమే గొప్ప అదృష్టం అయ్యే రచయితలు మరికొందరు ఉంటారు. అలాంటప్పుడు ఆ డిమాండ్‌ సులువుగానే అంగీకారం పొందుతుంది. అయితే రచయిత, అనువాదకుడు సమానం అవుతారా? కచ్చితంగా కాదని ఆ సంతకాలు పెడుతున్న అనువాదకులు కూడా ఒప్పుకుంటారు. రచయితకూ అనువాదకుడికీ మధ్య ఒక గౌరవప్రదమైన దూరం ఉండాలి.

 అయితే, కవర్‌ పేజీ మీద పేరు వేయడం అనేది మరింతమందిని అనువాదంలోకి దిగేలా పురిగొల్పడానికీ, ఏదో భాషలో చీకట్లో ఉండిపోయిన అద్భుతమైన రచనను ప్రపంచానికి తెలియ జెప్పడానికి కావాల్సిన డ్రైవ్‌ ఇవ్వడానికీ కారణం కాగలదేమో. ‘అనువాదం గనక లేకపోతే, నేను నా దేశ సరిహద్దులకే పరిమితమయ్యేవాణ్ణి’ అన్నాడు స్పానిష్‌ రచయిత సెర్వాంటెజ్‌. కదా! అందువల్లే ఆయన ‘డాన్‌ కిహోటీ’ మనదాకా వచ్చాడు. ప్రపంచ ఎల్లలను చెరపడంలో రచయితల కన్నా అను వాదకుల పాత్రే ఎక్కువనే విషయంలో మాత్రం ఎవరికీ సందేహం లేదు.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top