‘ప్రమాద’ ఇంధనాలు!

Sakshi Editorial On Pollution Threat To Mankind

మానవాళిని మింగేయటానికి, భూగోళాన్ని అమాంతం నాశనం చేయటానికి కాలుష్య భూతం కాచుక్కూర్చున్నదని ఎవరికీ తెలియనిది కాదు. కానీ ఏ దేశమూ దాన్ని సరిగా పట్టించుకుని,  చిత్తశుద్ధితో కృషి చేస్తున్న వైనం కనబడదు. పర్యవసానంగా ఆ ముప్పు రోజురోజుకూ మనకు దగ్గరవుతోంది.  కొన్నేళ్ల క్రితం అమెరికాలోని మియామీ నది గడ్డకట్టిన ఘటన మొదలుకొని నిన్న మొన్న వచ్చిన ఉత్తరాఖండ్‌ ఉత్పాతం వరకూ ఇందుకెన్నో ఉదాహరణలున్నాయి. హార్వర్డ్‌ విశ్వ విద్యాలయం వివిధ దేశాల్లో అధ్యయనం చేసి వెల్లడించిన వాస్తవాలు చదివితే గుండె గుభేలు మంటుంది. ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధన కాలుష్యం బారినపడి దాదాపు 90 లక్షలమంది ఏటా అకాల మృత్యువాత పడుతున్నారని ఆ అధ్యయనం సారాంశం. ఇందులో చైనా, భారత్‌లు అగ్ర స్థానంలో వున్నాయి. దాని లెక్క ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంభవించే ప్రతి అయిదు మరణాల్లో ఒకటి శిలాజ ఇంధన సంబంధమైనదే. ఈ అధ్యయన వివరాలు 2018 నాటివి. ఆ తర్వాతైనా పరిస్థితులు ఏమంత మెరుగుపడిన దాఖలాలు లేవుగనుక ఇప్పటికీ ఈ వరసే కొనసాగుతున్నదని అంచనాకు రావొచ్చు. శిలాజ ఇంధనాలు ప్రతి దేశంలోనూ నిత్యావసర వస్తువుగా మారిపోయాయి.

ఫ్యాక్టరీలు నడవాలన్నా, వాహనాలు కదలాలన్నా, విద్యుత్‌ వెలుగులు రావాలన్నా శిలాజ ఇంధనా లపైనే అత్యధిక దేశాలు ఆధారపడుతున్నాయి. వాటిని క్రమ పద్ధతిలో తగ్గించుకుంటూ వెళ్తామని, భూగోళం వేడెక్కే ప్రక్రియను తగ్గించటంలో తోడ్పడతామని పారిస్‌ శిఖరాగ్ర సదస్సులో 2015లో దాదాపు 200 దేశాలు ఏకాభిప్రాయానికొచ్చాయి. కర్బన ఉద్గారాల తగ్గింపుపై చరిత్రాత్మక ఒడం బడిక కుదుర్చుకున్నాయి. 2005నాటి కర్బన ఉద్గారాల స్థాయిలో 33 నుంచి 35 శాతం తగ్గిస్తామని ఆ దేశాలన్నీ పూచీ పడ్డాయి. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతోపాటు అనేక దేశాలకు చెందిన అధినేతల చొరవ కారణంగా ఇదంతా సాధ్యమైంది. కానీ ఆ ముచ్చట ఎంతో కాలం నిలబడ లేదు. అమెరికాలో ఒబామా అనంతరం 2016లో డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి రాగానే పారిస్‌ ఒడంబడికనుంచి తప్పుకోబోతున్నట్టు ప్రకటించారు. తన పదవీకాలం ముగుస్తున్న దశలో అంత పనీ చేసే వెళ్లారు. ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం పర్యావరణానికి ఎంతో నష్టం చేసింది. 

వేరే దేశాల మాట అటుంచి మన నగరాలు మృత్యువునే ప్రతి క్షణం ఆఘ్రాణిస్తున్నాయి. భారత్‌లోని 30 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని, శిలాజ ఇంధనాలను మండిం చటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని హార్వర్డ్‌ నివేదిక చెబుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఆ ఏడాది కేవలం శిలాజ ఇంధనాల వల్ల 4,71,456మంది మరణించారని నివేదిక అంటున్నది. ఆ తర్వాత స్థానంలో బిహార్‌ వుంది. అక్కడ 2,88,821 మరణాలకు మూల కారణం శిలాజ ఇంధనాలే. పశ్చిమ బెంగాల్‌లో అటువంటి మరణాలు 2,76,312. వేరే రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో వున్నాయి. హరియాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కోచోట లక్షకుపైగా మరణాలు ఈ ఇంధనాల పుణ్యమేనని నివేదిక అంటున్నది. హార్వర్డ్‌ అధ్యయనానికి ప్రధానంగా ఉపగ్రహ ఛాయాచిత్రాలు, ఉపరితల వాతావరణ గణాంకాలు ఉపయోగపడుతుంటాయి. వీటి ఆధా రంగా వేసే అంచనాలు సంతృప్తికరంగా వుండేవి కాదు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో అంతక్రితంతో పోలిస్తే సగటున అతి సూక్ష్మ ధూళి కణాలు ఏ స్థాయిలో వున్నాయో నిర్ధారించటానికి ఉపగ్రహ ఛాయా చిత్రాలపై ఆధారపడేవారు. అయితే ఆ సూక్ష్మ ధూళి కణాలు శిలాజ ఇంధనాల కారణంగా ఏర్పడ్డాయో, కార్చిచ్చు వల్ల ఏర్పడ్డాయో, ఇతరేతర కారణాల వల్ల ఏర్పడ్డాయో చెప్పటం సాధ్యమయ్యేది కాదు. కానీ 2018లో మరింత అధునాతనమైన సాంకేతికతను ఉపయోగించారు. వాతావరణంలోని రసాయన మార్పులను కొలిచే జియోస్‌–కెమ్‌ అనే 3డీ మోడల్‌ను వినియోగించారు.

దాని ఆధారంగా పరిమిత ప్రాంతంలో కాలుష్యం స్థాయిలు ఏవిధంగా వున్నాయో, వాటి స్వభావమేమిటో అంచనాకు రావటం పరిశోధకులకు మరింత సులభమైంది. ఒక ప్రాంతం మొత్తానికి సంబంధించిన సగటు ఆధారంగా లెక్కలేయటం కంటే, పరిమిత ప్రాంతంలోని పరిస్థితిని అధ్యయనం చేయటం, అక్కడి జనం ఎటువంటి ప్రమాదకర రసాయనాలను ఆఘ్రాణిస్తున్నారో తేల్చటం నిపుణులకు చాలా సులభం. అందుకే 2018నాటి గణాంకాలు పక్కాగా వున్నాయని వారు చెబుతున్నారు. ఈ నివేదిక ప్రపంచ దేశాల కళ్లు తెరిపించాలి. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిం చటానికి, వాటి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టడానికి ఇది తోడ్పడాలి. మలేరియావంటి వ్యాధుల వల్ల కలిగే మరణాలను మించి శిలాజ ఇంధనాలు జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచించాల్సిందే. వాస్తవానికి పారిస్‌ ఒడంబడికలో కాలుష్యాన్ని తగ్గిం చటానికి నిర్దేశించిన లక్ష్యాలు అవసరమైన స్థాయిలో లేవని పర్యావరణవేత్తలు అప్పట్లోనే పెదవి విరిచారు. 2050నాటికి భూతాపాన్ని 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పరిమితం చేయాలని సంకల్పం చెప్పు కుంటూ దాన్ని చేరుకోవటానికి నిర్దేశించుకున్న లక్ష్యాలు ఇలా అరకొరగా వుంటే ఎలా అని ప్రశ్నిం చారు. కానీ విషాదం ఏమంటే కనీసం ఆ పరిమిత లక్ష్యాల దిశగానైనా చాలా దేశాలు అడుగు లేయటం లేదు. అదృష్టవశాత్తూ అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ వచ్చి, తిరిగి పారిస్‌ ఒడంబడికలో భాగమవుతామని చెప్పారు. కాలుష్యం నివారణ ప్రాధాన్యతను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవా ల్సిన అవసరాన్ని తాజా నివేదిక మరోసారి అందరికీ గుర్తు చేస్తోంది. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top