ప్రాణాంతక యాప్‌లు! | Sakshi Editorial On Online Money Lending Racket | Sakshi
Sakshi News home page

ప్రాణాంతక యాప్‌లు!

Dec 24 2020 12:02 AM | Updated on Dec 24 2020 4:37 AM

Sakshi Editorial On Online Money Lending Racket

చైనా గేమింగ్‌ యాప్‌లు, ఇతర యాప్‌లు కేంద్ర ప్రభుత్వం నిషేధించిన తరుణంలో, ఆ దేశానికి చెందిన వస్తువులు కొనకపోవడం దేశభక్తికి నిదర్శనమని కొందరు ప్రచారం చేస్తున్న సమయంలో అందరి కళ్లూ కప్పి చాపకింద నీరులా చైనా మూలాలున్న లోన్‌ యాప్స్‌ దేశంలో అనేకచోట్ల స్వైరవిహారం చేసిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ యాప్స్‌ బారినపడి మూడు నిండు ప్రాణాలు బలికాగా, నిత్యం వీరి వేధింపులు చవిచూస్తున్నవారు మరెందరో. ఇక్కడే కాదు... కేరళ మొదలుకొని ఢిల్లీ వరకూ ఈ యాప్స్‌ నిర్వాహకులు ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్నవారికి వలపన్ని, సాయం చేసే పేరిట అడ్డగోలుగా దోచుకుతిన్నారని, వారిని మానసికంగా వేధిస్తూ నరకం చవిచూపించారని ఇప్పుడిప్పుడు బయటపడుతున్న కథనాలు వెల్లడిస్తున్నాయి.

ఈ సంస్థలను నమ్మొద్దని, వారి బారినపడి నష్టపోవద్దని బుధవారం రిజర్వ్‌బ్యాంక్‌ సైతం హెచ్చరించింది. ఇంతక్రితం చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ యధేచ్ఛగా సాగింది. అందులో ఆయన పార్టీకి చెందినవారే అనేకులు వుండటంతో నిందితులంతా తేలికపాటి సెక్షన్లకింద అరెస్టయి బెయిల్‌ కూడా తెచ్చుకోగలిగారు. ఈ యాప్స్‌ కూడా దాదాపు అటువంటివే. లాక్‌డౌన్‌ల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న చిరు వ్యాపారులు, కొలువు పోగొట్టుకుని రోడ్డునపడిన యువతీయువకులు, అనుకోకుండా అనారోగ్యంలో చిక్కుకుని చికిత్స కోసం డబ్బు అవసరమైనవారు, వినియోగ వస్తు వ్యామోహంలో పడేవారు... ఇలా అనేకమంది అభాగ్యులు ఈ సంస్థల్ని ఆశ్రయిస్తున్నారు.

ఈ లోన్‌ యాప్‌ల పేర్లు కూడా తమాషాగా వుంటాయి. బబుల్‌ లోన్, లిక్విడ్‌ క్యాష్, రుపీ ఫ్యాక్టరీ, పైసాలోన్, ఫ్లిప్‌క్యాష్, ఇన్‌నీడ్, రుపీప్లస్, పాన్‌లోన్, క్యాష్‌పాట్, వన్‌హోప్‌... ఇలా వీటికి అంతేలేదు. ఒక లెక్క ప్రకారం గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఈ బాపతు మారీచ సంస్థలు 500పైగానే వున్నాయి. వీటిల్లో అధికభాగం మూలాలు చైనాలోనే వుంటాయి. ఒక్కో యాప్‌కు దాదాపు పది లక్షలకుపైగా డౌన్‌లోడ్లు వున్నాయంటే ఇవి ఎంతగా అల్లుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు.  వీటికి ఒక వెబ్‌సైట్‌గానీ, చెప్పుకోవడానికి కార్యాలయంగానీ వుండవు. కనీసం సంప్రదించడానికి ఫోన్‌ నంబరైనా ఉండదు. అన్నిటికీ యాప్‌ ఒక్కటే మార్గం. ఇవ్వడమైనా, గుంజుకోవడమైనా ఆన్‌లైనే! యాప్‌ల నిర్వాహణ తీరు కూడా విలక్షణమైనది. ఎక్కడో చైనాలో గుట్టుగా వుంటూ అనేకానేక సంస్థల చాటున దీన్నంతా కొనసాగిస్తారు.

ఔట్‌సోర్సింగ్‌ సంస్థలతో కూడా వీరికి నేరుగా సంబంధాలుండవు. మనదేశంలో వున్న నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లోగానీ, నేరుగాగానీ రుణాలిచ్చే సంస్థలు తప్పనిసరిగా రిజిస్టరైన బ్యాంకులు లేదా నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు అయివుండాలి. లేదా రాష్ట్రాల్లోని చట్టాలకింద వడ్డీ వ్యాపారం చేసే సంస్థలైనా అయివుండాలి. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకొనివుండాలి. ఏమీ లేకుండా ఇలా రుణాలిచ్చే వ్యాపారం చేయడం చట్టవిరుద్ధం. కానీ ఈ యాప్స్‌ నిర్వాహకుల తీరు చూస్తే వీళ్లు నకిలీగాళ్లనే అనుమానం ఎవరికీ రాదు. లోన్‌ కోసం ఆశ్రయించినప్పుడు తీయగా మాట్లాడటం, సరిగా చెల్లించే స్థితిలో లేరని తెలియగానే దుర్భాషలాడటం ఈ యాప్స్‌ నిర్వాహకులకు అలవాటు. పోలీసు కేసులు పెడతామని బెదిరించడం, కోర్టుకీడుస్తామని హెచ్చరించటం రివాజు.

దక్షిణాది రాష్ట్రాలవారికి హిందీ భాషా ప్రాంతవాసులతో ఫోన్‌ చేయించి బెదిరించటం, ఇంటికొస్తున్నామని హడలెత్తించటం వీరనుసరించే విధానం. ఏదోవిధంగా ఇచ్చిన సొమ్ముకంటే అనేక రెట్లు అధికంగా గుంజటం వీరి ధ్యేయం. ఏం చేసినా కట్టే స్థితిలో లేరని నిర్ధారణయ్యాక యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నప్పుడు సేకరించిన డేటా ఆధారంగా వారి బంధుమిత్రులందరి ఫోన్‌లకూ వారిని దారుణంగా చిత్రిస్తూ సందేశాలు పంపి పరువు ప్రతిష్టలు దెబ్బతీయాలని చూస్తారు. డబ్బు చెల్లించకపోతే తమతో నగ్నంగా వీడియో చాటింగ్‌ చేయాలని యువతిని బెదిరించిన ఉదంతం, అప్పు తీసుకున్న యువకుడి తల్లి ఫొటోను మార్ఫింగ్‌ చేసి అతని పరిచయస్తులకు పంపిన ఉదంతంవంటివి వెల్లడయ్యాయి. వీరు ఇంకేం చేశారో, ఎందరు వీరి ఆగడాలకు బలయ్యారో మున్ముందు చూడాల్సివుంది. 

లాక్‌డౌన్‌ తర్వాత సాధారణ జనం ఆర్థికంగా ఎంత కుంగిపోయారో చెప్పడానికి ఈ యాప్‌ల స్వైరవిహారమే ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్‌ తరహాలో సాధారణ ప్రజానీకం చేతుల్లో డబ్బుండేలా చూసే పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వాలు దేశంలో చాలా తక్కువ. ఈ పరిస్థితిని లోన్‌ యాప్స్‌ నిర్వాహకులు చక్కగా వినియోగించుకున్నారు. రుణం ఇచ్చేటపుడు ఆధార్‌ నంబర్‌ మినహా మరే డాక్యుమెంటూ అవసరం లేదనడం వల్ల చాలామంది వీటికి ఆకర్షితులవుతారు. కానీ యాప్‌ డౌన్‌లోడ్‌ సమయంలోనే ఫోన్‌లోని సమస్త సమాచారమూ వారికి పోతుంది. అప్పు తీసుకున్నవారు కదలికలేమిటి... ఏ బ్యాంకులో వారికి ఖాతా వుంది... వారు ఏఏ దుకాణాల్లో సరుకులు కొనుగోలు చేస్తారు వంటి వివరాలన్నీ ఆ యాప్స్‌ నిర్వాహకుల చేతుల్లోకి పోతాయి.

అన్నిటికీ ఆన్‌లైన్‌ వ్యవస్థపైనే ఆధారపడేలా, అత్యధిక లావాదేవీలు డిజిటల్‌ మార్గాల్లోనే జరిగేలా చూసేందుకు గత దశాబ్దకాలంగా కేంద్రం అనేక విధానాలు అమల్లోకి తెచ్చింది. ఆధార్‌తో మొదలుపెట్టి అన్నీ డిజిటల్‌ మార్గంలోకి పోయాయి. కానీ దీనికి దీటుగా ప్రజలకు డిజిటల్‌ అవగాహన కల్పించడంలో మాత్రం పాలకులు విఫలమయ్యారు. ఫలితంగా తమ విలువైన డేటా ప్రమాదకర వ్యక్తుల చేతుల్లోకి పోతోందని జనం గ్రహించలేకపోతున్నారు. దాదాపు ఏడాదినుంచి లోన్‌ యాప్‌లు స్వైరవిహారం చేస్తుంటే రిజర్వ్‌బ్యాంకు మొన్న జూన్‌లో తొలిసారి హెచ్చరించింది. ఆ తర్వాతైనా దానిపై గట్టి ప్రచారం జరగలేదు. మళ్లీ ఇప్పుడే అది మాట్లాడటం! గూగుల్‌ వంటి సంస్థలు జవాబుదారీతనంతో వుండేలా చూడటం, యాప్‌లపై నిపుణుల సాయంతో నిఘా పెట్టడంవంటి చర్యలతోనే ఈ మాయదారి యాప్‌లకు అడ్డుకట్టవేయగలం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement