Covid-19: మూడో ప్రమాద హెచ్చరిక

Sakshi Editorial On Covid 19 Third Wave In India

మరోసారి ప్రమాదఘంటిక మోగింది. అప్రమత్తత అవసరాన్ని గుర్తు చేసింది. పెద్దల విషయంలోనే కాదు... పిల్లల కోసం కరోనాపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో సరిచూసుకొమ్మని పారా హుషార్‌ పలికింది. ఒక్కమాటలో, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎం) సారథ్యంలోని నిపుణుల కమిటీ తాజా నివేదిక కొత్త యుద్ధానికి సిద్ధం కమ్మని చెబుతోంది. వివిధ అధ్యయనాలు ఇప్పటికే చెప్పినట్టు కరోనా థర్డ్‌వేవ్‌ రావడం ఖాయమనీ, అది అక్టోబర్‌ ద్వితీయార్ధానికి తారస్థాయికి చేరుకోవచ్చనీ ఈ సంఘం ప్రధానమంత్రి కార్యాలయానికి తెలియజేసింది. ఈసారి పెద్దలతో సమానంగా పిల్లలకూ ముప్పుంది... పెద్ద సంఖ్యలో పిల్లలు కరోనాకు గురైతే, అవసరమైన వైద్య సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్సుల సహా వసతులే లేవని హెచ్చరించింది. ఇతర ఆరోగ్య సమస్యలున్న పిల్లలకూ, అంగవికలురకూ మున్ముందుగా టీకాలు వేయాలని సంఘం ప్రభుత్వానికి సూచించింది. ఇక, కరోనాతో సహజీవనంలో సరికొత్త సమరానికి సిద్ధం కావాల్సింది మనమే. 

‘ప్రజలకు సంకల్పం, మోదీ మార్గదర్శనం ఉంటే చాలు... అసలు థర్డ్‌ వేవ్‌ రానే రాద’ని దేశ కొత్త ఆరోగ్య మంత్రి పార్లమెంట్‌ సాక్షిగా సహచరుల చప్పట్ల మధ్య ఇటీవలే ప్రకటించారు. దురదృష్టవశాత్తూ, శాస్త్రీయ అధ్యయనంతో నిపుణులిచ్చిన తాజా నివేదిక అందుకు విరుద్ధంగా ఉందన్నమాట. సాక్షాత్తూ కేంద్ర హోమ్‌ శాఖ ఉత్తర్వుల మేరకు డాక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ లాంటి పలువురు ప్రముఖ నిపుణులతో ఏర్పాటైన సంఘం ఇది. ప్రభుత్వమే వేసిన అంతటి సంఘం ఇలాంటి నివేదిక ఇచ్చిందంటే – పాలకులు కచ్చితంగా ఆలోచించాల్సిందే! దేశంలోని వివిధ ప్రాంతాల్లో జూలై చివరి వారంలో కరోనా ‘ఆర్‌’ వ్యాల్యూ 0.96 నుంచి 1 పైగా పెరగడాన్ని బట్టి చూస్తే, థర్డ్‌వేవ్‌ ఇప్పటికే పడగ విప్పినట్టు అర్థమవుతోందని కూడా నిపుణుల నివేదిక పేర్కొనడం గమనార్హం. 

ఇప్పుడున్న టీకాల సత్తాను మించిన బలమైన, కొత్త వేరియంట్లు థర్డ్‌వేవ్‌లో వచ్చే ముప్పుందనేది నివేదిక సారాంశం. అయితే, కరోనా వచ్చినా ప్రాణాంతకం కాకుండా కాపాడే ఇప్పుడున్న టీకాలనైనా ఎంత వేగంగా వేస్తున్నాం? కరోనా పూర్తి కట్టడిలోకి వచ్చిందనుకున్న ఇజ్రాయెల్‌ లాంటి దేశాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఆ దేశం ఇప్పుడు బూస్టర్‌ డోస్‌గా మూడో డోస్‌ వేస్తుండడం గమనార్హం. మన దేశంలో 58.25 కోట్ల పైగా టీకా డోసులు వేశామని పాలకులు రొమ్ము విరుచుకుంటున్నారు. కానీ, అందులో 45.15 కోట్ల పైగా మొదటి డోసులే. మిగతా 13.10 కోట్లు రెండో డోసులు. దేశజనాభాలో 13.87 శాతం మందికే కరోనా టీకా రెండు డోసులూ వేయడం పూర్తయింది. అంటే, మన దేశంలో నూటికి 84 మందికి టీకాలు పూర్తిగా వేయనే లేదు. ఇది కేంద్ర ఆరోగ్యశాఖే చెప్పిన మాట. ఈ ఆగస్టులో తొలి పది రోజులతో పోలిస్తే, తరువాతి పది రోజుల్లో రోజువారీ వేస్తున్న టీకా డోసుల సంఖ్య 48.8 లక్షల నుంచి 57 లక్షలకు పెరిగింది. ఆ మేరకు సంతోషమే. కానీ, రోజుకు 98 లక్షల డోసులైనా వేస్తే తప్ప, ఈ ఏడాది చివరికి కనీసం వయోజనుల వరకైనా టీకాలేయడం పూర్తి కాదు. ఆ సంగతి పాలకులు గుర్తించి, టీకా ప్రక్రియ వేగం పెంచాల్సిందే. 

చిన్నారులకు ముప్పుందని తాజా నివేదిక మళ్ళీ చెబుతున్న నేపథ్యంలో వాస్తవ గణాంకాలు నిర్లక్ష్యం పనికి రాదని నిద్ర లేపుతున్నాయి. ప్రజారోగ్య రంగంలో గత పాలకుల నిర్లక్ష్యపు పాపం ఇప్పుడు శాపమైంది. దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నేటికీ పిల్లల వైద్యులకు 82 శాతం కొరత ఉంది. ప్రజారోగ్య కేంద్రాల్లో 63 శాతం మేర టీకాల కొరత. ప్రజాసామ్యంలో అత్యున్నతమైన పార్లమెంట్‌ వేసిన ఓ స్థాయీ సంఘం వెల్లడించిన లెక్కలివి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, రేపు థర్డ్‌ వేవ్‌ వచ్చి భారీ సంఖ్యలో పిల్లలు కరోనా బారిన పడితే ప్రజారోగ్య రంగం కుప్పకూలడం ఖాయం. నిపుణుల ఆందోళన కూడా అదే! ఇదే సమయంలో నేటి ఏపీ సర్కారు కొంతకాలంగా ప్రజారోగ్యరంగంలో మౌలిక వసతులపై దృష్టిపెట్టి, మంచి ఫలితాలు చూపిస్తోంది. అదే ఇప్పుడు మిగతా దేశానికీ ఆదర్శం. అలాగే, గత వారం విరిసిన ఓ చిన్న వెలుగు రేఖ – 12 నుంచి 18 ఏళ్ళ లోపు పిల్లల కోసం మన దేశంలో తయారైన కొత్త టీకా. పిల్లలకు తగ్గట్టే సూది లేకుండా వేసే ఈ మూడు డోసుల ‘జైకోవ్‌–డి’ టీకాకు నిజానికి 66 శాతం మేర సామర్థ్యమే ఉంది. అయితేనేం, అత్యవసర వినియోగం కోసం భారత ఔషధ నియంత్రణ జనరల్‌ ఆమోదించింది. భారత్‌ బయోటెక్‌ తయారీ కోవ్యాగ్జిన్‌ తర్వాత ఈ కొత్త ‘జైడస్‌ క్యాడిలా’ మన దేశవాళీ రెండో టీకా. వచ్చేనెల పరిమితంగా అందుబాటులోకి వచ్చే ఈ టీకాతో పిల్లలకు కచ్చితంగా కొంత ఉపశమనమే. 

అయితే, దేశంలో 15 నుంచి 20 కోట్ల మేర ఉండే ఆ వయసు పిల్లల కోసం కేంద్ర సర్కారు సార్వత్రిక టీకా విధానంపై దృష్టి పెట్టడం అవసరం. ప్రైవేటుకే అంతా వదిలేస్తే కష్టం. ఈ కరోనా టీకాల బృహత్‌ కార్యక్రమం ప్రపంచం మొత్తానికీ ఉన్న బరువు, బాధ్యత. నిజానికి, బీద దేశాల్లో ఇప్పటికీ 2 శాతం జనాభాకే టీకాలు వేయగలిగారు. ఈ పరిస్థితుల్లో ఒకపక్క టీకాల ఉత్పత్తి, సరఫరా భారీగా పెంచాలి. మరోపక్క ఆ టీకాలు పరమౌషధంగా పనిచేసేలా చూసుకోవాలి. ఈ రెండూ పెను సవాళ్ళే. ఈ సవాళ్ళను భారత్‌ ఇప్పుడు అధిగమించాలి. దీపాలు వెలిగించి, పళ్ళాలతో చప్పుళ్ళు చేస్తే చాలు కరోనా పోతుందని చెప్పిన పాలకులున్న దేశంలో... తాజా నివేదిక మరోసారి ‘శాస్త్రీయ దృక్పథంతో’ ప్రజారోగ్య రంగంలో సన్నద్ధతకు పిలుపునివ్వడం కీలకం. భావిపౌరుల కోసం పాలకులు తక్షణ కార్యాచరణకు దిగితే మంచిది. ఎందుకంటే, ఆలస్యమ్‌... అమృతం విషం! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top