ఇది న్యాయమేనా?!

Raja Man Singh murder justice delayed - Sakshi

న్యాయం అందించడంలో జాప్యం చోటుచేసుకుంటే అన్యాయం జరిగినట్టేనంటారు. అయినా మన దేశంలో అది దక్కడానికి ఏళ్లూ పూళ్లూ పడుతోంది. కేసుల విచారణలో జాప్యం గురించి, పెరుగు తున్న పెండింగ్‌ కేసుల గురించి అందరూ మాట్లాడతారు. కానీ క్రియకొచ్చేసరికి ఏమీ జరగదు. 35 ఏళ్లనాటి రాజస్తాన్‌ ఎన్‌కౌంటర్‌ గురించి రెండురోజులక్రితం వెలువడిన తీర్పు న్యాయం నత్తనడక గురించి అందరినీ మరోసారి మేల్కొలుపుతోంది. ఆ ఎన్‌కౌంటర్‌లో మరణించింది అనామకుడైన సాధారణ నేరగాడు కాదు. రాజ్యక్షేమానికి ప్రమాదకరంగా పరిణమించాడని నిందపడిన నక్సలైటు అసలే కాదు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా డీగ్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించిన నాయకుడు రాజా మాన్‌సింగ్‌. స్వాతంత్య్రం వచ్చాక అప్పటివరకూ జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఆయనే విజేత. 1985 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారస్థాయిలో వుండగా తన బ్యానర్లను, భరత్‌పూర్‌ జెండాను కాంగ్రెస్‌ కార్యకర్తలు చించేయడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది.

వెంటనే అప్పటి ముఖ్యమంత్రి శివ్‌ చరణ్‌ మాధుర్‌ ఎక్కివచ్చిన హెలికాప్టర్‌ వున్నచోటికెళ్లి తన జీపుతో దాన్ని ఢీకొట్టి ధ్వంసం చేశారు. దానిపై కేసు నమోదైంది. ఆ మర్నాడు మద్దతుదార్లతో కలిసి లొంగిపోవడానికి పోలీస్‌స్టేషన్‌ వెళ్తుండగా మార్గమధ్యంలో నడిరోడ్డుపై పోలీసులు నేరుగా ఆయన్ను గురిపెట్టి కాల్చి చంపారు. మాన్‌సింగ్‌ పక్కనున్న ఆయన అనుచరులిద్దరు కూడా ఈ కాల్పుల్లో మరణించారు. ఇక అక్కడినుంచి ఈ కేసు ఎన్ని మలుపులు తిరిగిందో తెలుసుకుంటే మన నేర న్యాయవ్యవస్థ తీరు తెన్నులు అర్థమవుతాయి. కాల్పులు జరిపిన డీఎస్‌పీ కాన్‌సింగ్‌ భాటికి ఇప్పుడు 82 ఏళ్లు. ఎస్‌ఐ వీరేంద్ర సింగ్‌కు 78 ఏళ్లు. ఇతర కానిస్టేబుళ్లు కూడా 70 ఏళ్లు పైబడినవారే. వీరందరికీ ఉత్తరప్రదేశ్‌ లోని మధుర జిల్లా జడ్జి యావజ్జీవ శిక్ష విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు. చట్టం ముందు అందరూ సమానులేనంటారు. మాన్‌సింగ్‌ తప్పు చేసివుంటే ఆయనపై కేసు పెట్టి శిక్షించవచ్చు. కానీ పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. నేరాలు, ఘోరాలు జరగని చోటు ప్రపంచంలో ఎక్కడా వుండదు. కానీ నిర్భీతిగా, నిష్పక్షపాతంగా, శరవేగంతో పనిచేసే న్యాయవ్యవస్థ వున్నచోట నేరాల సంఖ్య కనిష్టంగా వుంటుంది. తప్పు చేస్తే ఎంతటివారికైనా దండన తప్పదన్న స్పృహ వున్న చోట నేరగాళ్లలో భయం ఏర్పడుతుంది. అలాంటిచోట శాంతిభద్రతలు అదుపులో వుంటాయి. కానీ ఈ కేసు పరిణామక్రమం అందుకు విరుద్ధంగా సాగింది.

మాన్‌సింగ్‌ కేసు నడిచిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. అది అసాధారణమైనది. ఆ ఎన్‌కౌంటర్‌కు నైతిక బాధ్యతవహించి అప్పటి ముఖ్యమంత్రి మాధుర్‌ రాజీనామా చేయాల్సివచ్చింది. వారం తర్వాత దానిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. ఇదంతా చూసి నిందితులకు వెనువెంటనే కఠినశిక్ష పడుతుందన్న అభిప్రాయం చాలామందిలో ఏర్పడివుంటుంది. అన్నిటికీ మించి ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఎమ్మెల్యే భరత్‌పూర్‌ సంస్థాన వారసుడు. జాట్‌ కులంలో పేరుప్రఖ్యాతులున్నవాడు. జిల్లా రాజకీయాలను శాసిస్తున్నవాడు. అయినా ఇవేమీ పనికి రాలేదు. ఒక దశలో మాన్‌సింగ్‌ కుటుంబసభ్యులు తమకు ఇక్కడ న్యాయం దొరికేలా లేదని, కేసును రాష్ట్రం వెలుపలికి తరలించాలని కోరారు. వారి సూచన మేరకు అది ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లా కోర్టుకు వెళ్లింది. అప్పటినుంచి మొత్తం 1,700 దఫాలకు పైగా విచారణ కొనసాగాక 35 ఏళ్ల తర్వాత దోష నిర్ధారణ జరిగింది.

అయితే ఇప్పటికి తేలింది జిల్లా కోర్టులో మాత్రమే. ఈ కేసుపై ఇంకా అప్పీళ్లు వుంటాయి. కేసు హైకోర్టుకు వెళ్తే అక్కడ మరెన్నాళ్లు సాగుతుందో, ఎప్పుడు తీర్పు వస్తుందో చెప్పలేం. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా వుంది. సాధారణంగా అల్లర్ల కేసుల్లో, నరమేథానికి సంబంధించిన కేసుల్లో నిందితుల దోష నిర్ధారణ కష్టమవుతుంది. ఫోరెన్సిక్‌ సాక్ష్యాల సంగతలావుంచి... నిందితుడు ఫలానా వ్యక్తిని చంపినప్పుడు, చంపమని ఎవరినైనా ప్రోత్సహించినప్పుడు తాను చూశానని చెబితే... నేరానికి పథక రచన చేయడంలో అతగాడి ప్రమేయం వున్నదని నిర్ధారణగా చెప్పగలిగితే తప్ప అటువంటి కేసుల్లో నిందితులు తప్పించుకోవడానికి ఛాన్సుంటుంది. కానీ భరత్‌పూర్‌ ఎన్‌ కౌంటర్‌ నడిరోడ్డుపై జరిగింది. ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించామని చెప్పి, వాహనాలను ఆపేసి  దూరం నుంచి అందరూ చూస్తుండగానే పోలీసులు కాల్చిచంపారు. మరణించిన నాయకుడు డబ్బు, పలుకుబడి వున్నవాడు. అయినా ఇవేవీ కేసు విచారణలో చోటుచేసుకునే జాప్యాన్ని నివారించలేక పోయాయి.

మన న్యాయస్థానాల్లో పెండింగ్‌కేసుల సంఖ్య అపరిమితంగా వుంటోంది. కింది కోర్టుల్లో 3 కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లోవుంటే... హైకోర్టుల్లో 44 లక్షల కేసులు, సర్వోన్నత న్యాయస్థానంలో 60,000 కేసులు ఏళ్లతరబడి ఎటూ తేలకుండా వున్నాయి. సకాలంలో న్యాయం అందే తోవ లేనప్పుడు సాధారణ పౌరులకు న్యాయప్రక్రియ పట్ల, దాని సామర్థ్యం పట్ల విశ్వాసం సడలే ప్రమాదం లేదా? నేరగాళ్లకు అది వరంగా మారదా? పరిస్థితి ఇలా అఘోరించింది కనుకనే అత్యాచారం జరిగినప్పుడల్లా నిందితులను ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపాలన్న డిమాండు బయ ల్దేరుతోంది. ఇది పరిష్కరించాల్సిన సమస్యేనని అటు ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నాయి. ఇటు న్యాయవ్యవస్థ సైతం అంగీకరిస్తోంది. కానీ న్యాయమూర్తుల ఖాళీలు భర్తీ చేయడం, కోర్టుల సంఖ్యను పెంచడం, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు వగైరాల విషయంలో అవసరమైన చురుకుదనం లోపించింది. నిరర్ధకమైన కేసులు, మౌలిక సదుపాయాల లేమి దీనికి అదనం. అసలు కేసుల దర్యాప్తులోనే అడుగడుగునా నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. వీటన్నిటినీ సరిచేస్తే తప్ప ప్రజానీకానికి సకాలంలో న్యాయం దక్కదు. ఆలస్య న్యాయం అన్యాయమేనని మన పాలకులు గుర్తిస్తే తప్ప ఈ పరిస్థితి మారదు.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top