ముగిసిన నందిగ్రామ్‌ పోరు

Mamata Banerjee Nandigram Constituency Editorial By Vardhelli Murali - Sakshi

మొత్తానికి కొన్ని చెదురుమదురు ఘటనలతో పశ్చిమబెంగాల్‌లోని రెండో దశ పోలింగ్‌ గురువారం ముగిసింది. ఇతర నియోజకవర్గాల మాటెలావున్నా రెండో దశలో అందరి కళ్లూ నందిగ్రామ్‌పైనే వున్నాయి. మూడు దశాబ్దాలక్రితమే ఫైర్‌బ్రాండ్‌ ఇమేజ్‌తో దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అందరి ఊహలకూ భిన్నంగా ఆ ఒక్క స్థానాన్నే ఎంచుకుని పోటీ చేస్తుండటం ఇందుకు కారణం. అక్కడ పోలైన ఓట్ల శాతం 80 శాతం పైగా వుందంటే పోరాటం ఎంత హోరాహోరీగా సాగిందో అర్థమవుతుంది. ఎనిమిది దశల బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో గత నెల 27న 30 స్థానాలకు తొలి దశ పూర్తయింది. రెండో దశలో గురువారం నందిగ్రామ్‌తోసహా 30 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరిగింది. నందిగ్రామ్‌ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలన్నిటినీ మమత చక్రాల కుర్చీలో స్వయంగా సందర్శించటం, తమ పార్టీ పోలింగ్‌ ఏజెంట్లను అనుమతించటంలేదని ఆరోపణలొచ్చినచోట ఎన్నికల అధికారులను కదిలించి పరిస్థితి చక్కదిద్దటం మాత్రమే కాదు... సాధారణ ఓటర్లను బీజేపీ అడ్డగిస్తున్నదని ఆరోపణలొచ్చిన బోయల్‌ పోలింగ్‌ కేంద్రం దగ్గర రెండు గంటలపాటు వుండి పర్యవేక్షించటం గమనిస్తే ఆమె పట్టుదలేమిటో అర్థమవుతుంది. 

ఈ ఎన్నికల్లో మమత అంతా తానై పోరాడారు. రాష్ట్రంలో ఆమెతో సరితూగగలిగినవారు ఎవరూ లేరనే చెప్పాలి. అందుకే బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లతోసహా అతిరథ మహారథులను బీజేపీ మోహరించింది. నందిగ్రామ్‌ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి సొంత నియోజకవర్గం కావటం, ఆయన నిన్న మొన్నటివరకూ తృణమూల్‌లో కీలక నేతగా వుండటం కారణంగా అక్కడి ఓటర్లు ఎటు మొగ్గాలో తేల్చుకోవటానికి చాలానే కష్టపడివుంటారు. పంట భూములను అప్పటి లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం భూసేకరణ ద్వారా స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నించినప్పుడు 2007లో సాగించిన పోరులో సువేందు కీలకపాత్ర పోషిం చారు. అప్పట్లో రైతులకు సన్నిహితుడయ్యారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన బాగా పాటుబడ్డారని చెబుతారు. అందుకే ఆయన్ను పార్టీలో వుంచటానికి మమత శత విధాల ప్రయత్నించారు. ఆయన తమ వైపు మొగ్గు చూపకపోతే బీజేపీ బహుశా ఇంత హోరాహోరీ పోరాటానికి సిద్ధపడేది కాదు. అధికారానికి రాబోయేది తామే అన్నంత హడావుడి చేసేది కాదు. ఆ స్థాయిలో బీజేపీ హడావుడి చేయకుంటే మమత సైతం అంత పట్టుదలగా తన సొంత నియో జకవర్గాన్ని వదిలి నందిగ్రామ్‌కు కదిలివచ్చేవారు కాదు. ఏమైతేనేం అగ్నికి వాయువు తోడైనట్టు బీజేపీ–సువేందుల కాంబినేషన్‌ బెంగాల్‌ ఎన్నికలపై ఉత్కంఠను అనేక రెట్లు పెంచితే... సువేందుతో తాడో పేడో తేల్చకోవటానికి మమత రావటం నందిగ్రామ్‌కు ఓ ప్రత్యేకతను తీసుకొచ్చింది.

మమత రాకపోయివుంటే ఆ స్థానం నిస్సందేహంగా సువేందు సొంతమే. ఆ సంగతలావుంచి రాష్ట్రంలో బీజేపీ బలపడటానికి మమత మొదటగా తనను తాను నిందించుకోవాలి. సీపీఎం శ్రేణులు తమ పార్టీవారిని బతకనీయటం లేదని, వారు తమిళనాడు వంటి దూరప్రాంతాలకు పోయి జీవనం సాగించవలసివస్తోందని లెఫ్ట్‌ ఫ్రంట్‌ హయాంలో మమత ఆరోపించేవారు. కానీ అధికార పీఠం అందుకున్నాక తమ పార్టీ శ్రేణులపైనా అలాంటి ఆరోపణలే వస్తున్నాయని గుర్తించలేకపోయారు. అవి ఏ స్థాయికి చేరాయంటే ఒకప్పటి వామపక్షాల కార్యకర్తలు తమకెదురవుతున్న వేధింపులు భరించలేక బీజేపీని ఆశ్రయించాల్సివచ్చింది. తమకు మినహా వేరెవరికీ పునాదులు లేకుండా చేయాలన్న లక్ష్యంతోనే తృణమూల్‌ ఈ పని చేస్తోందని ప్రత్యర్థి పార్టీలు చాన్నాళ్లుగా ఆరోపిస్తు న్నాయి. సంక్షేమంతో, అభివృద్ధితో ప్రజానీకం ఆదరాభిమానాలు పొంది ప్రత్యర్థుల్ని అధిగమిం చటం వేరు... ఫిరాయింపులతో, బెదిరింపులతో దాన్ని సాధించాలనుకోవటం వేరు. ప్రత్యర్థి పార్టీ లకు పునాది లేకుండా చేయటానికి రెండో మార్గాన్ని ఎంచుకుంటే, ఆ ఖాళీ నింపేందుకు మరొక పార్టీ రంగం మీదికొస్తుంది. తృణమూల్‌ అధికారంలోకి రావటంలో కీలకపాత్ర పోషించిన నందిగ్రామ్‌ ఉద్యమంలో పాల్గొన్నవారికీ, అప్పట్లో జాడతెలియకుండా పోయినవారి కుటుంబాలకూ 14 ఏళ్ల తర్వాతగానీ ఆర్థిక ఆసరా కల్పించలేకపోవటం తృణమూల్‌ పాలన తీరుకు అద్దం పడుతుంది. కనుక రాష్ట్రంలో బీజేపీ బలపడటం వెనకున్న కారణాలేమిటో మమత ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంటుంది. 

సాగుతున్న పాలనపై తమ మనోభీష్టాన్ని వ్యక్తం చేయటానికీ, సమర్థవంతులైన ప్రతినిధులను ఎంచుకోవటానికీ ఎన్నికలను ప్రజలు ఒక సందర్భంగా భావిస్తారు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో ఆ ఎన్నికలు కాస్తా వైరి వర్గాల బలప్రదర్శనలుగా మారుతున్నాయి. పరస్పర దూష ణలకు వేదికలవుతున్నాయి. మద్యం, డబ్బు ప్రవహించటం... డాబూ దర్పం చూపటం, సవాళ్లు, ప్రతి సవాళ్లతో సాధారణ ప్రజానీకంలో అనవసర ఉద్రిక్తతలు సృష్టించటం మినహా ఎన్నికలు సాధి స్తున్నదేమీ వుండటం లేదు. పార్టీల మేనిఫెస్టోల్లో సాగు సంస్కరణలు, పెట్రో ధరల పెంపు వంటివి కనబడవు. ఇతరేతర అంశాల ఆసరాతో గద్దెనెక్కాక అవన్నీ జనంమీద స్వారీ చేస్తాయి. ఈ పరిస్థితి మారితేనే ఎన్నికలు అర్ధవంతమవుతాయి. అందులో అసలైన ప్రజాభీష్టం వ్యక్తమవుతుంది. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top