సొంత గూటికి... మహారాజా!

Editorial On Tata Group Acquisition Air India - Sakshi

సరిగ్గా ఏడు దశాబ్దాల తర్వాత మహారాజా సొంత గూటికి చేరారు. 1932లో జేఆర్డీ టాటా పూనికతో ‘టాటా ఎయిర్‌లైన్స్‌’గా ఆరంభమై, జాతీయీకరణతో 1953లో ప్రభుత్వం చేతికొచ్చి, మహారాజా చిహ్నంతో పాపులరైన భారత విమానయాన సంస్థ ఎయిరిండియా ఇప్పుడు మళ్ళీ టాటాల చేతికే వచ్చింది. ప్రభుత్వం అధికారిక అప్పగింతలతో కొత్త శకం ఆరంభమైంది. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన విక్రయంలో దాదాపు రూ. 18 వేల కోట్లకు టాటా సంస్థ తన బిడ్డను మళ్ళీ చేజిక్కించుకుంది. దాంతో పాటు సంస్థ తాలూకు రూ. 15,300 కోట్ల మేర ఋణభారాన్ని భుజానికెత్తుకుంది. రోజుకు రూ. 20 కోట్ల మేర నష్టపోతున్న ఈ సంస్థను మళ్ళీ గగనతలంలో దూసుకుపోయేలా చేయడం ఇప్పుడు

టాటాల ముందున్న పెనుసవాలు. అటు ఎయిరిండియా, ఇటు దేశ విమానయాన రంగం, వివిధ రంగాలు – వ్యాపారాల్లో ప్రభుత్వ పాత్ర... అన్నిటా ఇది ఓ కీలక ఘట్టం.
మోదీ గద్దెనెక్కిన తరువాత గడచిన ఎనిమిదేళ్ళలో విజయవంతంగా పూర్తయిన తొలి ప్రైవేటీకరణ ప్రయత్నం ఇదే. కానీ, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా కలిసొచ్చిందేమీ లేదు. పేరుకు రూ. 18 వేల కోట్లకు కొన్నా, అందులో రూ. 2,700 కోట్లే ప్రభుత్వానికి ఇచ్చేది. మిగతా రూ. 15,300 కోట్లు ప్రభుత్వమిచ్చిన అప్పుగా టాటా దగ్గరే ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేటీకరణ సాగుతున్న తీరుపై విమర్శలూ అనేకం. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లు గడించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ, ఇప్పటి దాకా కేవలం రూ. 9,330 కోట్లే వచ్చినట్టు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ ‘పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం’ (దీపమ్‌) వారి లెక్క. అవన్నీ అటుంచితే, ఈ విక్రయం ద్వారా వెలువడ్డ సిగ్నల్స్‌ను మర్చిపోలేం. 

నిజానికి, ఎయిరిండియా ప్రైవేటీకరణ చాలాకాలంగా వినపడుతున్నదే. ఒకప్పుడు ఉజ్జ్వలంగా వెలిగిన సంస్థ ఇది. 1932 అక్టోబర్‌లో మొదలై, టాటాలు నడుపుతున్న సంస్థలో స్వాతంత్య్రానంతరం ప్రభుత్వం ప్రవేశించింది. మొదట 49 శాతం వాటా తీసుకుంది. 1953లో మిగతా వాటాను కూడా కొని, జాతీయీకరణ జరిపింది. తర్వాత కొన్ని దశాబ్దాలు ఎయిరిండియాదే హవా. ఆర్థిక సరళీకరణ, ఆ పైన పెరిగిన ప్రైవేట్‌ సంస్థల పోటీతో గత ప్రాభవం కోల్పోతూ వచ్చింది. ఈ ప్రభుత్వరంగ సంస్థ నిర్వహణలో అనేక లోటుపాట్లూ చోటుచేసుకున్నాయి. నష్టాలను తగ్గించుకోవడం కోసం 2007లో అంతర్జాతీయ విమానాలు నడిపే ఎయిరిండియాను, దేశీయ విమానయాన ‘ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌’లో కలిపారు. అయినా సరే, అప్పటి నుంచి ఇప్పటి దాకా లాభమన్నది కళ్ళజూడలేదు. చివరకు అన్నీ కలిసి సంస్థను ప్రైవేటీకరణ బాట పట్టించాయి.  
వాజ్‌పేయి సారథ్యంలో 2001లోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేటీకరణకు తొలి ప్రయత్నం చేసింది. 40 శాతం వాటాలు విక్రయించాలనుకొని విఫలమైంది. మోదీ సర్కార్‌ మొదటి విడత పాలనలో 2018లో 76 శాతం మేర వాటా అమ్మాలనుకుంది. ఒక్కరైనా ముందుకు రాలేదు. 2020 జనవరిలో పాక్షికంగా కాక వాటాలను పూర్తిగా అమ్మేస్తామంటూ, తాజా ప్రయత్నం ప్రారంభించింది. ప్రభుత్వ వాటాలుంటే దాని పెత్తనమూ ఉంటుందనీ, స్వేచ్ఛగా సంస్థ నిర్వహణ సాధ్యం కాదనీ ఇంతకాలం సంశయిస్తూ వచ్చిన ప్రైవేట్‌ సంస్థలకు ఇది నచ్చింది. ఎట్టకేలకు ఇప్పటికి అమ్మకం పూర్తయింది. 

ఇప్పటికే అనేక సంస్థలు పోటీపడుతూ, కరోనా కష్టాలతో మథనం తప్పనిసరి అయిన వేళ ఎయిరిండియాను టాటాలు చేపట్టడం గమనార్హం. తాము పురుడు పోసిన సంస్థను మళ్ళీ తమ చేతుల్లోకి తీసుకోవడం భావోద్వేగభరిత ఘట్టమే అయినా, అందులోని సవాళ్ళు అనేకం. ఒకపక్కన పాతబడుతున్న విమానాలు, మరోపక్క వేల సంఖ్యలో ఉద్యోగులు వారసత్వంగా సంక్రమించాయి. కనీసం ఏడాది పాటు ఉద్యోగులెవరినీ తొలగించబోమని హామీ ఇచ్చిన టాటాలు నష్టాల్లో ఉన్న సంస్థను ఓ గాడిన పెట్టాలంటే అసాధారణ కృషి అవసరం. విమానయాన రంగంలో ఇప్పటికే ఒకటికి రెండు సంస్థల్లో టాటాల పెట్టుబడులున్నాయి. దేశంలో ఇప్పుడు మిగిలిన ఏకైక ఫుల్‌ సర్వీస్‌ ఎయిర్‌లైన్‌ ‘విస్తారా’లో, అలాగే తక్కువ ఖర్చుతో ప్రయాణాలకు తోడ్పడే విమానయాన సంస్థ ‘ఎయిర్‌ ఏషియా’ భారతీయ శాఖ (ఎయిర్‌ ఏషియా ఇండియా)లో టాటాలకు భాగముంది. ఇప్పుడు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లలో నూటికి నూరుపాళ్ళ యాజమాన్యం, క్షేత్రస్థాయి నిర్వహణ సంస్థ ‘ఎయిరిండియా – శాట్స్‌’లో 50 శాతం వాటా వచ్చింది. ఒకే గొడుగు కింది విస్తారా, ఎయిర్‌ ఏషియా ఇండియా, ఎయిరిండియాలు మూడూ పోటాపోటీ పడాల్సిన గమ్మల్తైన పరిస్థితి. అందుకే, ఏదో ఒక దశలో వీటన్నిటినీ ఒక్కటి చేసినా, ఆశ్చర్యం లేదు. 

ఏమైనా, ప్రైవేటీకరణతో గూటిలోని గువ్వ పిల్లకు కొత్త రెక్కలొస్తాయా? ఈ కరోనా కాలంలో ఎయిరిండియాకు టాటా ఎలాంటి బూస్టర్‌ షాట్‌ ఇస్తుంది? జవాబుల కోసం ఇంకొంతకాలం వేచి చూడాలి. ప్రభుత్వమేమో ప్రైవేటీకరణ లక్ష్యంలో భాగంగా ఖజానాకు మరింత సొమ్ము సమకూర్చు కోవడానికి మార్చి ఆఖరున ‘భారత జీవిత బీమా సంస్థ’ (ఎల్‌ఐసీ) పబ్లిక్‌ ఇస్యూ గడువు పూర్తయ్యే దాకా ఆగకతప్పదు. అభ్యంతరాలు, అడ్డంకుల మధ్యనే భారత్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌), కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ముందుకు సాగే సూచనలూ కనిపిస్తు న్నాయి. అనివార్యతలెలా ఉన్నా, ప్రజా ప్రయోజనాల్ని కాపాడాల్సిన ప్రభుత్వ సారథ్యంలోని స్వేచ్ఛా విహంగాలు ప్రైవేటు చేతిలో పతంగులుగా మారిపోవడానికి దారి తీసిన పరిస్థితులే తీరని దుఃఖం! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top