
రాజానగరం: జిల్లాలో వైఎస్సార్ ఆసరా సంబరాలు కొనసాగుతున్నాయి. ఊరూవాడా ఉత్సాహంగా లబ్ధిదారులు పాల్గొంటున్నారు. మాట తప్పకుండా తమకు మూడో విడత కూడా రుణ మాఫీకి వీలుగా ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేసిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి డ్వాక్రా మహిళలు క్షీరాభిషేకం చేస్తున్నారు. రాజానగరంలోని అన్నదాన సత్రం కల్యాణ మండపంలో ఆసరా పథకం లబ్ధిదారుల సమావేశం బుధవారం వేడుకలా జరిగింది. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాల అమలులో మహిళలకు అగ్రాసనమేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలవాలని ఎంపీ పిలుపునిచ్చారు. రుణమాఫీపై ఇచ్చిన మాటను ఏ విధంగా నెరవేర్చారో గణాంకాలతో ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా నాయకులు, అధికారులు నమూనా చెక్కును డ్వాక్రా మహిళలకు అందజేశారు.